Share News

తిరుపతిలో నిన్న చిరుత.. నేడు ఎలుగుబంటి సంచారం.. భయాందోళనలో స్థానికులు

ABN , Publish Date - Jun 30 , 2026 | 06:45 PM

తిరుపతిలో ఓ ఎలుగుబంటి తన పిల్లలతో తిరగడం తీవ్ర కలకలం రేపింది. ఇటీవల తిరుపతి నగర సరిహద్దు ప్రాంతాల్లో వన్యప్రాణుల సంచారం ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది.

తిరుపతిలో నిన్న చిరుత.. నేడు ఎలుగుబంటి సంచారం.. భయాందోళనలో స్థానికులు
Bear Spotted in Tirupati

తిరుపతి, జూన్ 30: తిరుపతిలో ఓ ఎలుగుబంటి తన పిల్లలతో తిరగడం తీవ్ర కలకలం రేపింది. ఇటీవల అధ్యాత్మిక క్షేత్రం తిరుపతి నగర సరిహద్దు ప్రాంతాల్లో వన్యప్రాణుల సంచారం స్థానిక ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. తాజాగా తిరుమల నగర్ తెలుగు గంగ వాటర్ హౌస్ పైభాగంలో ఓ ఎలుగుబంటి పిల్లలతో తిరగడం కలకలం సృష్టించింది. ఎలుగుబంటి తన మూడు పిల్లలతో కలిసి ఈ ప్రాంతంలో స్వేచ్ఛగా సంచరిస్తూ స్థానికుల కంటపడింది. నివాస ప్రాంతాలకు అత్యంత సమీపంలో, ఎలుగుబంటి తిరుగుతుండటంతో ఏం జరుగుతుందోనని కాలనీవాసులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఈ విషయాన్ని గమనించిన వెంటనే స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.


కొంత కాలంగా శేషచల కొండల అంచున ఉండే తిరుమల నగర్, బీటీఆర్ కాలనీ, కృష్ణవేణి యాదవ్ కాలనీ తదితర పరిసర ప్రాంతాలలో రెండు నెలలుగా ఎలుగుబంట్లు తరచూ కనిపిస్తూనే ఉన్నాయి. ఆహారం, నీటి కోసమే ఇవి అడవి దాటి జనావాసాల్లోకి వస్తున్నాయని స్థానికులు భావిస్తున్నారు. ఎలుగుబంట్ల గుంపు కాలనీ వీధుల్లోకి వస్తే ప్రాణనష్టం జరిగే ప్రమాదం ఉందని, రాత్రి వేళల్లో ఇళ్ల నుంచి బయటకు రావడానికే భయపడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నగరవాసులను కేవలం ఎలుగుబంట్లు మాత్రమే కాదు, క్రూర జంతువైన చిరుత పులి కూడా వణికిస్తోంది. కేవలం రెండు వారాల క్రితమే తిరుమల నగర్‌కు సమీపంలోని ఉపాధ్యాయనగర్ వద్ద ఒక చిరుత పులి సంచరిస్తూ స్థానికుల కంట పడింది. వరుసగా చిరుతలు, ఎలుగుబంట్లు నగరంలోకి ప్రవేశిస్తుండటంతో అటవీ సరిహద్దు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ చైర్మన్‌గా రాజీవ్‌ కుమార్‌

నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన రహదారి.. భారీగా నిలిచిన పర్యాటకుల వాహనాలు

For More Business News And Telugu News

Updated Date - Jun 30 , 2026 | 07:21 PM