Share News

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ చైర్మన్‌గా రాజీవ్‌ కుమార్‌

ABN , Publish Date - Jun 30 , 2026 | 03:56 AM

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు పార్ట్‌ టైమ్‌ చైర్మన్‌గా మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌రాజీవ్‌ కుమార్‌ నియమితులయ్యారు. సోమవారం సమావేశమైన బ్యాంకు డైరెక్టర్ల బోర్డు ఈ నియామకానికి ఆమోదం తెలిపింది.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ చైర్మన్‌గా రాజీవ్‌ కుమార్‌

న్యూఢిల్లీ: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు పార్ట్‌ టైమ్‌ చైర్మన్‌గా మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌రాజీవ్‌ కుమార్‌ నియమితులయ్యారు. సోమవారం సమావేశమైన బ్యాంకు డైరెక్టర్ల బోర్డు ఈ నియామకానికి ఆమోదం తెలిపింది. ఆర్‌బీఐ, బ్యాంకు వాటాదారుల ఆమోదంతో కుమా ర్‌ మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారు. ఈ నెల 30 నుంచి స్వతంత్ర డైరెక్టర్‌గా నాలుగేళ్లు బ్యాంకు బోర్డులోనూ కొనసాగుతారు. ఈ ఏడాది మార్చిలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు చైర్మన్‌ అతను చక్రవర్తి ఆకస్మికంగా రాజీనామా చేయడంతో ఈ పదవి ఖాళీగా ఉంది. బ్యాంకులో జరుగుతున్న కొన్ని కార్యకాపాలు ఇష్టంలేక నైతిక కారణాలతో వైదొలుగుతున్నట్లు చక్రవర్తి తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.

అపార అనుభవం

రాజీవ్‌ కుమార్‌ గతంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా, ప్రధాన ఎన్నికల కమిషనర్‌గానూ పని చేశారు. ఐఏఎస్‌ మాజీ అధికారి అయిన కుమార్‌కు ప్రభుత్వ విధానాల రూపకల్పన, ఆర్థిక సంస్కరణలు, వ్యవస్థల నిర్మాణంలో 40 ఏళ్లకుపైగా సుదీర్ఘ అనుభవం ఉంది. దేశ ఆర్థిక రంగాన్ని, ప్రభుత్వ రంగ బ్యాంకు (పీఎస్‌బీ)లను బలోపేతం చేయడంలోనూ కుమార్‌ కీలక పాత్ర పోషించారు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక సేవల కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన 15 రోజుల్లోనే దేశంలో నల్లధన చలామణికి చెక్‌ పెట్టేందుకు దేశంలోని 3.38 లక్షల డొల్ల కంపెనీల బ్యాంకు ఖాతాలను స్తంభింప చేయడంలోనూ కీలకపాత్ర పోషించారు. నిర్ణయాత్మక విధానాల రూపకల్పన, వాటి అమలులోనూ రాజీవ్‌ కుమార్‌కు మంచి పేరుంది.

Updated Date - Jun 30 , 2026 | 03:56 AM