బంగాళాఖాతంలో మరో వాయుగుండం.. ఏపీకి భారీ వర్ష సూచన
ABN , Publish Date - Sep 19 , 2026 | 03:23 PM
ఉత్తర అండమాన్ పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండగా.. ఇది క్రమంగా బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వివరాల్లోకి వెళితే..
అమరావతి, సెప్టెంబర్ 19: ఉత్తర అండమాన్.. దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. ఈ అల్పపీడనం పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ క్రమంగా బలపడే అవకాశం ఉందని పేర్కొన్నారు. సోమవారం తూర్పు మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా, మంగళవారం నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని అంచనా వేశారు. బుధవారం ఉదయానికి పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ ఒడిశా–ఉత్తరాంధ్ర తీరాలకు సమీపంలోని పశ్చిమ మధ్య.. దానికి ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం ప్రాంతానికి చేరుకునే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
ఈ వాతావరణ వ్యవస్థ ప్రభావంతో కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. తీర ప్రాంతాల్లో గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరారు. సముద్రం తీవ్ర అల్లకల్లోలంగా మారే అవకాశం ఉన్నందున ఇప్పటికే వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే తీరానికి తిరిగి రావాలని.. కొత్తగా ఎవరూ సముద్రంలోకి వెళ్లవద్దని సూచించారు.
ఇవి కూడా చదవండి...
హైదరాబాద్‌లో అంతర్జాతీయ చోరీ మొబైల్ ఫోన్ల డిస్పోజల్ రాకెట్ గుట్టురట్టు
మల్లూరు లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిపై మంత్రి సీతక్క ఆదేశాలివే
Read Latest Telangana News And Telugu News