మాచర్లలో బంగ్లాదేశీ
ABN , Publish Date - Sep 01 , 2026 | 05:11 AM
పల్నాడు జిల్లా మాచర్లలో ఆయుర్వేద వైద్యునిగా అందరికీ తెలిసిన వ్యక్తి చివరకు బంగ్లాదేశ్ వాసిగా తేలడం కలకలం రేపింది. దాదాపు 34 ఏళ్ల క్రితం బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా దేశంలోకి చొరబడ్డాడు. మొలల వైద్యం చేస్తూ మాచర్లలో కుటుంబంతో స్థిరపడ్డాడు. ఎన్నికల ప్రత్యేక, సవరణ ప్రక్రియ (సర్)లో భాగంగా తాజాగా జరిపిన తనిఖీల్లో ఈయన విషయం బయటపడింది. ఆ వివరాల్లోకి వెళితే..
‘సర్’ ప్రక్రియతో 34 ఏళ్ల తర్వాత వెలుగులోకి..
అక్రమంగా చొరబడి ఆయుర్వేద వైద్యునిగా చలామణి
మాచర్ల అడ్ర్‌సతోనే పాస్‌పోర్టు, ఆధార్, పాన్
కోల్‌కతా వాసినని స్థానికులకు తెలిపిన వైనం
వెరిఫికేషన్‌లో బయటపడిన బంగ్లా మూలాలు
బెదిరించి ముడుపులు గుంజిన పోలీసులు..
విషయం బయటపడటంతో సస్పెన్షన్ వేటు
మాచర్ల, ఆగస్టు 31(ఆంధ్రజ్యోతి): పల్నాడు జిల్లా మాచర్లలో ఆయుర్వేద వైద్యునిగా అందరికీ తెలిసిన వ్యక్తి చివరకు బంగ్లాదేశ్ వాసిగా తేలడం కలకలం రేపింది. దాదాపు 34 ఏళ్ల క్రితం బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా దేశంలోకి చొరబడ్డాడు. మొలల వైద్యం చేస్తూ మాచర్లలో కుటుంబంతో స్థిరపడ్డాడు. ఎన్నికల ప్రత్యేక, సవరణ ప్రక్రియ (సర్)లో భాగంగా తాజాగా జరిపిన తనిఖీల్లో ఈయన విషయం బయటపడింది. ఆ వివరాల్లోకి వెళితే.. ఎంకే రాయ్ 1992లో బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా దేశంలోకి ప్రవేశించారు. అటు తిరిగి ఇటు తిరిగి చివరకు మాచర్ల చేరుకున్నారు. ఆయుర్వేద వైద్యం చేస్తూ చిన్నగా పేరు, పరపతి పెంచుకున్నారు. పట్టణంలో ఆర్థికంగా బలపడ్డారు. తాను పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతా నుంచి వచ్చానని రాయ్ చెప్పేవారు. ఆధార్, పాన్ కార్డ్, పాస్‌పోర్టు, బ్యాంకు ఖాతాలు ఇక్కడే పొందారు. ‘సర్’ ప్రక్రియలో భాగంగా ఓటరు వెరిఫికేషన్ ప్రక్రియను అధికారులు మొదలుపెట్టారు. ఈ క్రమంలో స్థానికత కోసం పూర్వీకుల అడ్రస్ గురించి ఆరా తీసేందుకు రాయ్‌ను జిల్లా ఎస్పీ పిలిపించి విచారించారు. ఇదే సమయంలో రాయ్ పాస్‌పోర్టు రెన్యువల్‌కు వచ్చింది. ఈ క్రమంలో నరసరావుపేట స్పెషల్ బ్రాంచ్‌కు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు విచారించగా, ఆయన బంగ్లాదేశ్ హిందువు అని బయటపడింది. అయితే, రాయ్‌ను వారిద్దరు నరసరావుపేటకు పిలిపించి బేరసారాలు మొదలుపెట్టారు.
వారికి రాయ్ భారీగా ముడుపులు చెల్లించారు. ఆ ఇద్దరికీ, కౌంటర్ ఇంటిలిజెన్స్ కానిస్టేబుల్‌కు మధ్య ముడుపుల పంపకాల్లో తేడాలు వచ్చాయి. ఈ క్రమంలో ఆ కానిస్టేబుల్ రాయ్‌ను మరింత డబ్బు డిమాండ్ చేశాడు. అందుకు ఆయన అంగీకరించకపోవడంతో గుట్టు బయటపెట్టేశాడు. కాగా, ముందు ఒక్కడిగా మాచర్లకు వచ్చిన రాయ్, ఇక్కడ తన కుటుంబాన్ని విస్తరించారు. బంగ్లాదేశ్ యువతిని పెళ్లాడి ఇక్కడకు తెచ్చారు. ఏడాది క్రితం అత్తను కూడా బంగ్లాదేశ్ నుంచి పిలిపించుకున్నారని చెబుతున్నారు. మరోవైపు, ఆ ఇద్దరు కానిస్టేబుళ్లను పోలీసు శాఖ సస్పెండ్ చేసింది.
ఈ వార్తలను కూడా చదవండి
2027 యూపీ ఎన్నికలు.. డింపుల్ యాదవ్ కేంద్రంగా అఖిలేష్ కీలక వ్యూహం..
పెట్రోల్‌లో ఇథనాల్ శాతం వెల్లడించాలని పిటిషన్.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం..