Share News

ఆర్నబ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు

ABN , Publish Date - Oct 29 , 2026 | 10:11 AM

ఆర్నబ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను వేగవంతం చేయడంతో పాటు అంటువ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

ఆర్నబ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
Arnab Cyclone

అమరావతి, అక్టోబర్ 29: ఆర్నబ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచి.. అంటువ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు. తుపాను కారణంగా ప్రభావితమైన ప్రాంతాల్లో ప్రజలకు ఆరోగ్యపరమైన ఇబ్బందులు తలెత్తకుండా పారిశుద్ధ్య పనులను వేగవంతం చేయాలని సూచించారు.

ఇందులో భాగంగా ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశారు. తొమ్మిది జిల్లాల నుంచి మొత్తం 475 మంది సిబ్బందిని ఈ బృందాల్లో నియమించారు. తుపాను ప్రభావం ఉన్న ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, పరిస్థితులకు అనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తుపాను అనంతరం ప్రజారోగ్యానికి ఎలాంటి ముప్పు వాటిల్లకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంపై ప్రభుత్వం దృష్టి సారించింది.


డా. బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి జిల్లాలకు ప్రత్యేకంగా 100 టాస్క్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో తాగునీటి నాణ్యతను పరిశీలించేందుకు ప్రత్యేక వాటర్ టెస్టింగ్ బృందాలను కూడా నియమించారు. ఈ రెండు జిల్లాల్లో నీటి నాణ్యత పరీక్షల కోసం 48 మంది సాంకేతిక సిబ్బందిని అందుబాటులో ఉంచారు. తాగునీటి ద్వారా వ్యాధులు వ్యాపించకుండా నీటి నాణ్యతను పరీక్షించడం, పారిశుద్ధ్య పరిస్థితులను మెరుగుపరచడం వంటి చర్యలకు ఈ బృందాలు ప్రాధాన్యం ఇవ్వనున్నాయి. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనేలా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని పవన్ కల్యాణ్ ఆదేశించారు. ప్రజారోగ్య పరిరక్షణకు అవసరమైన చర్యలను వేగంగా అమలు చేయాలని స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి:

అప్రాధాన్య పోస్టుకు జయేశ్‌ రంజన్‌

దీపావళి తర్వాత భారీ ప్రక్షాళన

ఆ జూనియర్‌ లెక్చరర్లను సర్వీసులోకి తీసుకోండి

Read Latest AP News And Telangana News

Updated Date - Oct 29 , 2026 | 10:44 AM