ఆక్వాన్ తుపాను ఎఫెక్ట్.. విద్యుత్ అంతరాయం నివారణకు ఏపీసీపీడీసీఎల్ కీలక చర్యలు
ABN , Publish Date - Nov 16 , 2026 | 08:11 PM
ఆక్వాన్ తుపాను ముప్పు నేపథ్యంలో ఏపీసీపీడీసీఎల్ అప్రమత్తమైంది. తుపాను ప్రభావంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలకు శ్రీకారం చుట్టింది.
అమరావతి, నవంబరు 16: ఆక్వాన్ తుపాను నేపథ్యంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీసీపీడీసీఎల్) అప్రమత్తమైంది. తుపాను ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని క్షేత్రస్థాయిలో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సంస్థ సీఎండీ పి. పుల్లారెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ నెల 17, 18 తేదీల్లో విద్యుత్ లైన్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించాలని, వాలిన విద్యుత్ స్తంభాలను సరిచేసి, వదులుగా ఉన్న వైర్లను బిగించాలని సూచించారు. ప్రతి సబ్ డివిజన్ పరిధిలో అవసరమైన విద్యుత్ స్తంభాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలని, 9.1 మీటర్ల పొడవున్న రెండు లోడ్ల స్తంభాలు, 8 మీటర్ల స్తంభాలతో ఒక లోడును అందుబాటులో ఉంచుకోవాలని స్పష్టం చేశారు.
తుపాను సహాయక చర్యల కోసం అవసరమైన సిబ్బందిని సమీకరించడంతో పాటు పోల్ డిగ్గర్లు, జేసీబీలను సిద్ధంగా ఉంచుకోవాలని సీఎండీ ఆదేశించారు. తుపాను ప్రభావం పూర్తిగా తగ్గే వరకు విద్యుత్ శాఖ సిబ్బందికి సెలవులు రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ఎక్కడైనా విద్యుత్ అంతరాయాలు ఏర్పడితే అధికారులు, సిబ్బంది తక్షణమే స్పందించి సాధ్యమైనంత త్వరగా సరఫరాను పునరుద్ధరించాలని సూచించారు. ప్రజలకు విద్యుత్ సరఫరా విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు, సిబ్బంది పూర్తి అప్రమత్తతతో విధులు నిర్వహించాలని పి. పుల్లారెడ్డి ఆదేశించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రధాని మోదీతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ
కాళేశ్వరం ప్రాజెక్టులో గేట్లు మూసి నీటిని నిల్వ చేసే అవకాశం లేదు: మంత్రి తుమ్మల
సజ్జనార్ ఆస్తుల కొనుగోళ్లపై విచారణ జరిపించాలి: రాజాసింగ్