APSRTC Struggle: సంక్రాంతి ప్రయాణికులకు ఏపీఎస్ ఆర్టీసీ షాక్..
ABN , Publish Date - Jan 07 , 2026 | 02:52 AM
ఈ సంక్రాంతికి పొరుగు రాష్ట్రాల నుంచి స్వగామ్రాలకు వచ్చే ఏపీ వాసులకు ఆర్టీసీ షాక్ ఇవ్వనుంది! హైదరాబాద్ నుంచి వచ్చేవారి కోసం కేవలం 240 బస్సులు నడుపుతున్నట్లు ప్రకటించడాన్ని బట్టి ప్రయాణికులకు....
సంక్రాంతి ప్రయాణికులకు ఏపీఎస్ ఆర్టీసీ షాక్
హైదరాబాద్ నుంచి కేవలం 240 బస్సులు
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
ఈ సంక్రాంతికి పొరుగు రాష్ర్టాల నుంచి స్వగామ్రాలకు వచ్చే ఏపీ వాసులకు ఆర్టీసీ షాక్ ఇవ్వనుంది! హైదరాబాద్ నుంచి వచ్చేవారి కోసం కేవలం 240 బస్సులు నడుపుతున్నట్లు ప్రకటించడాన్ని బట్టి ప్రయాణికులకు ఇక్కట్లు తప్పవన్న ఆందోళన వ్యక్తమవుతోంది. సంక్రాంతి సమయంలో పల్లెలకు.. శివరాత్రికి శైవ క్షేత్రాలకు.. బ్రహ్మోత్సవాల సమయంలో తిరుపతికి.. ప్రత్యేక బస్సులు నడపడం ఆర్టీసీలో ఆనవాయితీ. అయితే గత రెండేళ్లుగా దిక్కులేనిదైన ఏపీఎస్‌ఆర్టీసీ తన ప్రయాణికుల్ని తాను కాపాడుకోలేక పోతోంది. సంక్రాంతికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు ఈడీ(ఆపరేషన్స్) అప్పల్రాజు పేరుతో మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. సంక్రాంతి ముందు 3,857 సర్వీసులు.. తర్వాత వెనుదిరిగే ప్రయాణికుల కోసం 4,575 సర్వీసులు కలిపి మొత్తం 8,432 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు వివరించింది.
తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు నుంచి వచ్చేవారి కోసం 357 బస్సులు మాత్రమే నడుపుతున్నట్లు వాస్తవం బయటపెట్టింది. ఇందులో హైదరాబాద్ నుంచి విజయవాడ, నెల్లూరు, కర్నూలు, తిరుపతి, విశాఖపట్నం, రాజమహేద్రవరం తదితర ప్రాంతాలకు సంక్రాంతికి వచ్చేవారి కోసం 240 బస్సులు మాత్రమే వేశారు. మిగిలినవాటిలో బెంగుళూరు నుంచి 102, చెన్నై నుంచి 15బస్సులు మాత్రమే ఉన్నాయి. తిరుగు ప్రయాణంలో హైదరాబాద్‌కు 1,800, బెంగుళూరుకు 200, చెన్నైకి 75 బస్సులు నడుపుతున్నట్లు ఈడీ తెలిపారు. గతంలో ప్రతి సంక్రాంతికి 3, 4వేల బస్సులు నడిపిన చరిత్ర ఆర్టీసీ సొంతం. అలాంటిది కేవలం 240 బస్సులతో సరిపెట్టడాన్ని బట్టి పరిస్థితి ఎంతలా దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. కొత్త బస్సులు రాకపోవడం, యాజమాన్యం పట్టించుకోకపోవడం, స్వప్రయోజనాలకే అధికారులు ప్రాధాన్యం ఇస్తుండటంతో ఈ దుస్థితి దాపురించింది. ఆర్టీసీ టికెట్లు ఆన్‌లైన్‌లో బుక్‌చేసే ప్రైవేటు ఏజెన్సీ చక్రం తిప్పిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.