పీఆర్సీకి కమిషనర్!
ABN , Publish Date - Sep 05 , 2026 | 04:09 AM
ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లోని 11 ఉద్యోగ సంఘాలతో భేటీ అవుతున్నారు. వారు ప్రస్తావిస్తున్న అంశాలపై సమగ్రంగా చర్చించనున్నారు. ఉద్యోగులు గత కొంతకాలంగా ఎదురు చూస్తున్న 12వ వేతన సంఘానికి(పీఆర్సీ) కమిషనర్‌ను నియమించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
కి ప్రభుత్వం సానుకూలం
ఉద్యోగుల ఆశలకు సర్కారు రెక్కలు
డీఏల చెల్లింపులు, హెల్త్‌కార్డులపై స్పష్టత
నేడు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌తో సీఎం భేటీ
గతంలోనూ ఉద్యోగుల ఫ్రెండ్లీ సీఎంగా బాబు
2014-19లో 43% ఫిట్‌మెంట్ మంజూరు
సీపీఎస్ ఉద్యోగులకు గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్
జగన్ వచ్చాక.. ఉద్యోగుల జీవితాల్లో భారీ కుదుపు
23 శాతం రివర్స్ పీఆర్సీ ప్రకటించి పక్కా మోసం
హెచ్‌ఆర్‌ఏల్లోనూ భారీ కోత.. 24%-16% మధ్యే
రిటైర్డ్ ఉద్యోగులకు నాటి సర్కారు 30 వేల కోట్ల బాకీ
అమరావతి, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లోని 11 ఉద్యోగ సంఘాలతో భేటీ అవుతున్నారు. వారు ప్రస్తావిస్తున్న అంశాలపై సమగ్రంగా చర్చించనున్నారు. ఉద్యోగులు గత కొంతకాలంగా ఎదురు చూస్తున్న 12వ వేతన సంఘానికి(పీఆర్సీ) కమిషనర్‌ను నియమించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అలాగే, 2 డీఏలను చెల్లించేందుకు గ్రీన్‌సిగ్నల్ రావచ్చని భావిస్తున్నారు. అదేవిధంగా హెల్త్‌కార్డుల సమస్యకు కూడా పరిష్కారం లభించే అవకాశాలు ఉన్నాయి. వాస్తవానికి గత ప్రభుత్వ హయాంలోనే పీఆర్సీ కమిషన్ వేశారు. అప్పట్లో కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన మన్మోహన్ సింగ్.. రిటైరైన తర్వాత కొత్తవారిని నియమించలేదు. దీంతో తాజాగా ఈ విషయంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
కమిషనర్‌ను నియమించేందుకు ప్రభుత్వం సానుకూలంగానే ఉంది. ఇక, హెల్త్‌కార్డుల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఉద్యోగుల వేతనాల నుంచి కట్ చేస్తున్న సొమ్ము ప్రభుత్వ ఖాతాకు చేరుతోంది. ఇకనుంచి అలాకాకుండా ప్రభుత్వ, ఉద్యోగుల వాటాలు నేరుగా వైద్యసేవా ట్రస్టుకు వెళ్లేలా, అక్కడ నుంచి ఆస్పత్రులకు చెల్లించేలా మార్పు చేయనున్నారు. దీనిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) అధ్యక్షతన వేసిన కమిటీ పలుమార్లు సమావేశమైంది. గత ప్రభుత్వం బకాయి పెట్టిన రూ.30,000 కోట్లలో రూ.21,000 కోట్లను ప్రస్తుత ప్రభుత్వం 21 నెలల్లోనే చెల్లించింది. అలాగే 3 డీఏలను కూడా ఇచ్చారు. ఈ-డీపీసీ తీసుకొచ్చారు. జీపీఎఫ్, ఏపీజీఎల్‌ఐ, సీపీఎస్ ఖాతాల చెల్లింపులు క్రమం తప్పకుండా చేస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 62 ఏళ్లకు పెంచారు.
విభేదించేవారు 10 శాతం లోపే!
జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లో ఉన్న 11 ఉద్యోగ సంఘాల్లో రెండు సంఘాలు మాత్రమే ఉద్యమంలో ఉన్నాయి. మొత్తం ఉద్యోగుల్లో ఈ 2 సంఘాల ఉద్యోగులు 10 శాతం కూడా లేరు. 90 శాతం వరకు ఉద్యోగులు సీఎం చంద్రబాబును నమ్ముతున్నారు. వీరంతా ఉద్యమాలకు దూరంగా ఉంటున్నారు.
2014-19లో 10వ పీఆర్సీలో 43 శాతం ఫిట్‌మెంట్ మంజూరు చేశారు. 10 నెలల పీఆర్సీ బకాయిలను(ఒక్కో ఉద్యోగికి రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు) చెల్లించారు. సీపీఎస్ ఉద్యోగుల కుటుంబాలకు గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేసిన మొదటి రాష్ట్రంగా ఏపీ నిలిచింది. ఉద్యోగి మరణిస్తే కారుణ్య నియామకానికి అవకాశం లేనప్పుడు ఆ కుటుంబాలకు రూ.10లక్షల వరకు ఎక్స్‌గ్రేషియాను పెంచారు. అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు పెంచారు. కాంట్రాక్టు ఉద్యోగులకు మినిమం టైమ్‌స్కేల్‌ను వర్తింపజేసి ఉద్యోగ భద్రత కల్పించారు. ప్రతి నెల 1నే జీతాలు చెల్లించారు. ఉద్యోగులకు సంబంధించి జీపీఎఫ్, డీఏ ఎరియర్లు, లోన్లు పెండింగ్‌లో పెట్టలేదు. 20శాతం ఐఆర్‌ను మంజూరు చేశారు. సీపీఎస్ ఖాతాల్లో ప్రతి నెలా ఉద్యోగి వాటా, ప్రభుత్వ వాటా జాప్యం లేకుండా జమ చేశారు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు 50 శాతానికి పైగా వేతనాలు పెంచారు.
జగన్ పాలనలో నష్టం..
2019లో వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఉద్యోగులను అన్ని విధాలా నష్టపరిచిందని ఆయా సంఘాలు చెప్పిన విషయం తెలిసిందే. 2019, ఏప్రిల్ నుంచి ఇస్తామన్న 27 శాతం మధ్యంతర భృతి(ఐఆర్)ని జూలై నుంచి ఇచ్చారు. కనీసం 27 శాతం ఐఆర్‌ను ఫిట్‌మెంట్‌గా ఇవ్వకపోగా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 23 శాతం రివర్స్ పీఆర్సీతో ఉద్యోగులను మోసం చేశారు. ఇంకా మిగిలిన 4 శాతం ఐఆర్‌ను వెనక్కి కట్టించాలని చూసి ఉద్యోగులు చేసిన ఉద్యమంతో ఆగిపోయారు. అంతేకాదు, పెండింగ్ డీఏలను విడుదల చేసి అదే పీఆర్సీలో వచ్చిన పెరుగుదల అంటూ మభ్యపెట్టారు. దీంతో తమకు పాత జీతమే కావాలంటూ ఉద్యోగులు డిమాండ్ చేసే స్థాయికి తీసుకొచ్చారు. 2014-19లో హెచ్‌ఆర్‌ఏలు 30 శాతం, 24 శాతం ఉండగా వైసీపీ హయాంలో వాటిని 24 శాతం, 16 శాతానికి తగ్గించారు.
2004, సెప్టెంబరు 1 కంటే ముందు వచ్చిన నోటిఫికేషన్ల ప్రకారం ఉద్యోగాలు తెచ్చుకున్న దాదాపు 11,000 మంది ఉద్యోగులకు పాత పింఛను పథకాన్ని(ఓపీఎస్) వర్తింపజేయాలని కేంద్ర ప్రభుత్వం 2020లోనే ఆదేశించింది. అయినప్పటికీ వైసీపీ ప్రభుత్వం అమలు చేయలేదు. ఇటీవల కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుని 11 వేల మందికి లబ్ధి చేకూర్చింది. వైసీపీ హయాంలో 8 డీఏలు పెండింగ్‌లో ఉంచారు. జీపీఎఫ్ ఖాతాల నుంచి ఉద్యోగుల డబ్బులు కూడా ఇవ్వలేదు. దీంతో ఉద్యోగుల పిల్లల పెళ్లిళ్లు వాయిదా పడిన సందర్భాలు అనేకం ఉన్నాయి. సీపీఎస్ ఖాతాల్లో జగన్ ప్రభుత్వం వాటా జమ చేయకపోగా ఉద్యోగుల 10 నెలల వాటాను దారిమళ్లించింది. రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన ప్రయోజనాలు ఇవ్వకపోగా చంద్రబాబు మంజూరు చేసిన అడిషనల్ క్వాంటం పెన్షన్‌ను ఎత్తేసి రిటైర్డ్ ఉద్యోగులకు అన్యాయం చేశారు. రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన సుమారు రూ.30,000 కోట్ల బకాయిలను వైసీపీ ప్రభుత్వం చెల్లించలేదు.
ఆర్థిక డిమాండ్లపై స్పందించాలి: బొప్పరాజు
విజయవాడ(గాంధీనగర్): ఉద్యోగ సంఘాలను ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించడంపట్ల ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదరరావు హర్షం వ్యక్తం చేశారు. జూలై 22న జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో జేఏసీ లేవనెత్తిన 30 డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా చర్చించాలని కోరారు. తమ ఉద్యమ కార్యాచరణలో భాగంగా శనివారం మధ్యాహ్నం భోజన విరామంలో ‘డిమాండ్స్ డే’ నిరసనలు కొనసాగుతాయని తెలిపారు.
ఈ వార్తలను కూడా చదవండి
వార్డుల పునర్విభజనకు పచ్చజెండా