Share News

CM Chandrababu Naidu: హైడ్రోజన్‌ వ్యాలీగా ఏపీ

ABN , Publish Date - Jan 18 , 2026 | 04:12 AM

రాబోయే రోజుల్లో రాష్ట్రం హైడ్రోజన్‌ వ్యాలీగా మారుతుందని సీఎం చంద్రబాబు తెలిపారు. సౌర, పవన, జలవిద్యుత్‌, పంప్డ్‌ స్టోరేజ్‌లాంటి విద్యుదుత్పత్తికి....

CM Chandrababu Naidu: హైడ్రోజన్‌ వ్యాలీగా ఏపీ

  • అన్ని రాష్ట్రాలకూ వచ్చిన పెట్టుబడుల్లో 25శాతం మనకే..

  • యూనిట్‌ విద్యుత్‌ కొనుగోలు ఖర్చు 1.19కి తగ్గిస్తాం

  • ఈ ఏడాదే డ్రోన్‌ అంబులెన్స్‌ సేవలు అందుబాటులోకి

  • సంపద సృష్టికి ఏపీని మించిన రాష్ట్రం లేదు

  • కాకినాడలో ‘గ్రీన్‌ అమ్మోనియా’ ప్లాంట్‌లో

  • భారీ యంత్రాలను ప్రారంభించిన చంద్రబాబు, పవన్‌

  • ‘సన్‌రైజ్‌ ఏపీ’లో భాగంగా సోలార్‌ ఎనర్జీకి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. అలాగే పంప్డ్‌ స్టోరేజ్‌, విండ్‌ పవర్‌కు రాష్ట్రం అనుకూలం. ఈ మూడూ గ్రీన్‌ అమ్మోనియం తయారీకి అనుకూలంగా ఉంటాయి. అలాగే దేశంలో మొదటి క్వాంటమ్‌ కంప్యూటర్‌ అమరావతిలో రాబోతోంది.

- సీఎం చంద్రబాబు

కాకినాడ, జనవరి 17(ఆంధ్రజ్యోతి): రాబోయే రోజుల్లో రాష్ట్రం హైడ్రోజన్‌ వ్యాలీగా మారుతుందని సీఎం చంద్రబాబు తెలిపారు. సౌర, పవన, జలవిద్యుత్‌, పంప్డ్‌ స్టోరేజ్‌లాంటి విద్యుదుత్పత్తికి, గ్రీన్‌ హైడ్రోజన్‌, గ్రీన్‌ అమ్మోనియా ఉత్పత్తికి రాష్ట్రం ఎంతో అనుకూలంగా మారిందన్నారు. గ్రీన్‌ ఎనర్జీ(హరిత ఇంధనం)పై చర్చ వస్తే ప్రపంచవ్యాప్తంగా త్వరలో కాకినాడ పేరు వినిపించనుందని తెలిపారు. కాకినాడలో ‘ఏఎం గ్రీన్‌’ కంపెనీ నిర్మిస్తున్న గ్రీన్‌ అమ్మోనియా ప్లాంట్‌లో భారీ యంత్రాల ఏర్పాటును సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌లు శనివారం బటన్‌ నొక్కి ప్రారంభించారు. ఈ ప్రాజెక్టును మొత్తం మూడు దశల్లో అభివృద్ధి చేయనున్నారు. తొలిదశలో వచ్చే ఏడాదికి 5 లక్షల టన్నులు, 2028 నాటికి పది లక్షల టన్నులు.. మూడో దశకు వచ్చేసరికి పూర్తిస్థాయి సామర్థ్యం 15 లక్షల టన్నుల గ్రీన్‌ అమ్మోనియాను ఉత్పత్తి చేయనున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. ఆయన ఏమన్నారంటే...


కొనుగోలు ధర తగ్గిస్తాం..

‘హబ్‌ అండ్‌ స్పోక్‌’ పద్ధతిలో సోలార్‌, విండ్‌, పంప్డ్‌ స్టోరేజ్‌ విద్యుత్‌ను ఉత్పత్తి చేసేలా కంపెనీలను ప్రోత్సహిస్తున్నాం. విద్యుత్‌ రంగంలో పెనుమార్పులకు శ్రీకారం చుడుతున్నాం. మరింత సామర్థ్యం పెంచుకుని ట్రాన్స్‌మిషన్‌ నష్టాలను తగ్గిస్తాం. అదే సమయంలో టెక్నాలజీని ఉపయోగించుకుని మరింత ముందుకు వెళ్తున్నాం. దీనిలో భాగంగా రూ.5.19 ఉన్న యూనిట్‌ విద్యుత్‌ కొనుగోలు ధరను రూ.4.80కి తగ్గించాం. వచ్చే మూడేళ్లలో యూనిట్‌ సరాసరి కొనుగోలు వ్యయాన్ని రూ.1.90కి తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నాం. సబ్‌స్టేషన్ల వారీగా విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని ఆలోచిస్తున్నాం. దీనికి బ్యాటరీలు వినియోగిస్తాం. ఫలితంగా ట్రాన్స్‌మిషన్‌ నష్టాలు తగ్గుతాయి. విద్యుత సౌకర్యం ఉన్నందునే గూగుల్‌ విశాఖకు డేటా సెంటర్‌ పెడుతోంది. రాష్ట్రంలో తీర ప్రాంతంలో 20 పోర్టులు రాబోతున్నాయి.

పెట్టుబడుల వరద

పాలనలో గతం కంటే సంక్షేమానికి మరింత పెద్దపీట వేస్తూనే అభివృద్ధి పనులు చేస్తున్నాం. నూతన పారిశ్రామిక విధానంతో ‘స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌’ అమలు చేస్తున్నాం. ఇటీవల బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా నిర్వహించిన సర్వేలో దేశంలో వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో 25 శాతం పెట్టుబడులు మన రాష్ట్రానికే వచ్చినట్టు తేలింది. పెట్టుబడుల సదస్సులో రూ.13.20 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకున్నాం. తద్వారా యువతకు 16 లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయి. ఇప్పటివరకు జరిగిన ఏపీ పెట్టుబడుల ప్రమోషన్‌ బోర్డు ద్వారా రూ.8.78 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపాం. వీటి ద్వారా 8.40 లక్షల ఉద్యోగాలు రానున్నాయి.

నేను నిత్య విద్యార్థిని!

నేను నిత్యవిద్యార్థిని. కొత్త విషయాలు ఎక్కడున్నా నేర్చుకుని వాటిని ఆచరణలోకి పెట్టడానికి ప్రయత్నిస్తా. 2047కి రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్‌గా మార్చు తాం. దేశంలో సంపద సృష్టికి ఏపీని మించిన రాష్ట్రం లేదు. రాష్ట్ర పారిశ్రామిక విధానాలతో వందలాది మంది పారిశ్రామికవేత్తలను తయారు చేస్తున్నాం. పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తల కలలు నెరవేర్చడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రాష్ట్రంలో ‘స్పేస్‌ సిటీ’(అంతరిక్ష నగరం) ఏర్పాటు చేస్తున్నాం. త్వరలో ఉపగ్రహాలను కూడా ప్రయోగించబోతున్నాం. అలాగే, డ్రోన్‌ సిటీని కూడా అందుబాటులోకి తెస్తాం. భవిష్యత్తులో డ్రోన్‌ ట్యాక్సీలు రావలసిన అవసరం ఉంది. ఇప్పుడున్న రహదారులు భవిష్యత్తులో రద్దీగా మారనుండడంతో డ్రోన్‌ ట్యాక్సీలకు డిమాండ్‌ ఉంటుంది. ఇటీవల అన్నామలై యూనివర్సిటీ నుంచి ఓ వ్యక్తి వచ్చి డ్రోన్‌ అంబులెన్స్‌ల ప్రాధాన్యతను వివరించారు. ఈ ఏడాదే డ్రోన్‌ అంబులెన్స్‌ సేవలు అందుబాటులోకి తీసుకువస్తాం.


35 లక్షల మంది వచ్చారు

రాష్ట్రంలో సంక్రాంతి మూడు రోజులు కోడిపందేలు జోరుగా జరిగాయి. సంక్రాంతికి బయట నుంచి రాష్ట్రానికి 35 లక్షల మందికి పైగా వచ్చారు. హైదరాబాద్‌ నుంచే మూడు లక్షల కార్లు వచ్చాయి. మనం ఎక్కడున్నా జన్మభూమిని మరిచిపోకూడదని పిలుపునిచ్చాను. జల్లికట్టు ఉత్సాహంగా జరుగుతోంది. జగ్గన్నతోట ప్రభల తీర్థం వైభవంగా జరిగింది. ఒకపక్క సంప్రదాయాలను కాపాడుతూనే మరోవైపు సాంకేతికతకు పెద్దపీట వేస్తున్నారు.

అప్పుడూ.. ఇప్పుడూ చరిత్రే..

కాకినాడలో ఏఎం గ్రీన్‌ కంపెనీ.. తొలి విడతలో 2027, జూన్‌ నాటికి 5 లక్షల టన్నుల గ్రీన్‌ అమ్మోనియాను ఉత్పత్తి చేయనుంది. చరిత్ర తిరగరాయడంలో తెలుగువారు ముందుండటం అభినందనీయం. 1982-83లో ఎన్టీఆర్‌ ఈ ప్రాంతంలో పర్యటించినప్పుడు ఇక్కడి ప్రజలు ఎరువుల ప్లాంటు కోరగా, ఎన్నికలప్పుడు హామీ ఇచ్చి ఎన్‌ఎ్‌ఫసీఎల్‌ ద్వారా అప్పట్లో ‘గ్రే అమ్మోనియా’ ప్లాంట్‌ ఏర్పాటు చేయించారు. ఇప్పుడు మళ్లీ అదే ప్రాంతంలో గ్రీన్‌ అమ్మోనియా ప్లాంటు ఏర్పాటైంది. ఇదొక పెనుమార్పు. వ్యవసాయ రంగానికి గ్రీన్‌ అమ్మోనియాతో ఎంతో మేలు కలగనుంది. ఇటీవల రాష్ట్రంలో నీటి శాంపిళ్లను పరీక్షిస్తే అత్యధిక శాతం నైట్రోజన్‌ ఉన్నట్టు తేలింది. ఇలా అత్యధికంగా నైట్రోజన్‌ ఉన్న రాష్ట్రాల్లో ఏపీ ఏడో స్థానంలో ఉంది. భూమిలో ఉప్పునీటి సాంద్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఏపీ ఆరో స్థానంలో ఉంది. దీంతో గ్రీన్‌ హైడ్రోజన్‌, గ్రీన్‌ అమ్మోనియా ప్లాంట్‌ ద్వారా భవిష్యత్తులో కలుషిత నీటి స్థాయిలను తగ్గించవచ్చు.


2.jpg

ప్రపంచం కాకినాడ వైపే!

కాకినాడలో ఏర్పాటుచేయబోయే ప్లాంట్‌లో తయారుచేసే హైడ్రోజన్‌ను నిల్వచేయలేం, దాన్ని గ్రీన్‌ అమ్మోనియాగా మార్చి రవాణా చేయవచ్చు. దేశంలో 500 గిగావాట్ల గ్రీన్‌ విద్యుదుత్పత్తి చేయాలని నిర్ణయం తీసుకుంటే దీనిలో మన రాష్ట్ర వాటాయే 160 గిగావాట్లు. భవిష్యత్తులో గ్రీన్‌ హైడ్రోజన్‌, గ్రీన్‌ అమ్మోనియా, గ్రీన్‌ మిథనాల్‌, గ్రీన్‌ మాలిక్యులర్స్‌. గ్రీన్‌ ఎనర్జీ అంటే ప్రపంచమంతా కాకినాడ వైపు చూస్తుంది.

ప్రాజెక్టు స్వరూపం ఇదీ..

  • 10 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.90 వేల కోట్లు) పెట్టుబడి.

  • మొత్తం 3 దశల్లో ప్రాజెక్టు అభివృద్ధి.

  • తొలిదశలో 2027 నాటికి ఏడాదికి 5 లక్షల టన్నుల ఉత్పత్తి.

  • 2వ దశలో 2028 నాటికి 10 లక్షల టన్నుల ఉత్పత్తి.

  • 3వ దశలో 15 లక్షల టన్నుల ఉత్పత్తే లక్ష్యం.


ఈ వార్తలు కూడా చదవండి:

Arya Vysya Corporation Chairman: కన్యకాపరమేశ్వరి ఆత్మార్పణ దినాన్ని రాష్ట్ర పండుగగా జరుపుకొందాం

Maoists Arrested: మాకేమీ తెలియదు...

Updated Date - Jan 18 , 2026 | 06:50 AM