Maoists Arrested: మాకేమీ తెలియదు...
ABN , Publish Date - Jan 18 , 2026 | 06:02 AM
పోలీసు కస్టడీలో ముగ్గురు మావోయిస్టుల విచారణ శనివారంతో ముగిసింది. దీంతో అదే రోజు సాయంత్రం తమ కస్టడీలో ఉన్న వారిని పోలీసులు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో అప్పగించారు.
పోలీసు కస్టడీలో మావోయిస్టులు
ముగిసిన కస్టడీ... రాజమండ్రి సెంట్రల్ జైలులో అప్పగింత
విజయవాడ, జనవరి 17(ఆంధ్రజ్యోతి): పోలీసు కస్టడీలో ముగ్గురు మావోయిస్టుల విచారణ శనివారంతో ముగిసింది. దీంతో అదే రోజు సాయంత్రం తమ కస్టడీలో ఉన్న వారిని పోలీసులు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో అప్పగించారు. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం కానూరులోని కొత్త ఆటోనగర్‌లో చిక్కిన 28 మంది మావోయిస్టుల్లో ముగ్గురు ప్రధాన నిందితులు... యుద్ధం రఘు(ఏ1), జ్యోతి(ఏ2), దివాకర్(ఏ3)లను విచారణ నిమిత్తం రెండు రోజులపాటు పోలీసు కస్టడీకి హైకోర్టు అనుమతి ఇచ్చింది. కోర్టు ఆదేశాలతో పెనమలూరు పోలీసులు మావోయిస్టులు ముగ్గురినీ కేంద్ర కారాగారం నుంచి శుక్రవారం తమ అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. విచారణలో భాగంగా మావోయిస్టులు ఒక్కొక్కరికీ సుమారుగా 50 ప్రశ్నలు సంధించినట్లు తెలిసింది. అత్యధిక ప్రశ్నలకు తమకేమీ తెలియదని చెప్పిన వారు... కొన్ని ప్రశ్నలకు మాత్రం పొడిపొడిగా జవాబులు ఇచ్చినట్టు సమాచారం.