Arya Vysya Corporation Chairman: కన్యకాపరమేశ్వరి ఆత్మార్పణ దినాన్ని రాష్ట్ర పండుగగా జరుపుకొందాం
ABN , Publish Date - Jan 18 , 2026 | 05:57 AM
కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినాన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించి కూటమి ప్రభుత్వం ఆర్యవైశ్యుల పట్ల తన చిత్తశుద్ధిని చాటుకుంది.
డూండీ రాకేశ్
అమరావతి, జనవరి 17(ఆంధ్రజ్యోతి): ‘కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినాన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించి కూటమి ప్రభుత్వం ఆర్యవైశ్యుల పట్ల తన చిత్తశుద్ధిని చాటుకుంది. ఈ నెల 20న రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కన్యకాపరమేశ్వరి ఆలయాల్లో అమ్మవారి ఆత్మార్పణ దినాన్ని రాష్ట్ర పండుగగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం’ అని ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండీ రాకేశ్ పేర్కొన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే సీఎం చంద్రబాబు తూర్పుగోదావరి జిల్లా పెనుగొండలోని కన్యకాపరమేశ్వరి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కూటమి ప్రభుత్వం 25 రాష్ట్ర పండుగలను ప్రకటిస్తే వాటిలో మూడు ఆర్యవైశ్యులకు చెందినవే ఉన్నాయి. ఇది కూటమి ప్రభుత్వం ఆర్యవైశ్యులకు ఇచ్చిన గౌరవం. పొట్టి శ్రీరాములు పేరుతో స్మృతివనం నిర్మించాలని సీఎంని కోరగా స్పందించి అమరావతి నడిబొడ్డున 6.8 ఎకరాలను కేటాయించారు. మార్చి 16న పొట్టి శ్రీరాములు 58 రోజుల దీక్షకు ప్రతీకగా 58 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించనున్నాం. పెనుగొండ గ్రామాన్ని వాసవీ పెనుగొండగా మారుస్తూ ప్రభుత్వం జీవోను విడుదల చేసిందన్నారు.