Share News

ఐఐటియన్లతో జట్టు

ABN , Publish Date - Sep 18 , 2026 | 03:56 AM

రాష్ట్రాన్ని టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ‘‘మన టెక్నాలజీ.. మన స్వావలంబన’’ నినాదంతో సాంకేతిక నిపుణులతో ఓ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ఐటీ శాఖ సిద్ధమైంది. దేశంలోని 23 ఐఐటీల పూర్వ విద్యార్థులు దాదాపు నాలుగు లక్షల మందితో ఆ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

ఐఐటియన్లతో జట్టు

  • టెక్‌ హబ్‌గా ఏపీ

  • 4 లక్షల మంది అలుమ్నితో నెట్‌వర్క్‌

  • మేధో సంపత్తి సద్వినియోగానికి సీఎం ప్రతిపాదన

  • అమరావతిలో ఏటేటా సదస్సు నిర్వహణ

  • ఒకే వేదికపైకి సాంకేతిక నిపుణులు, పారిశ్రామికవేత్తలు

  • రాష్ట్రంలోనే ఏఐ ఆధారిత ఉత్పత్తుల అభివృద్ధి

  • డీప్‌ టెక్నాలజీలో ఐఐటీ పూర్వ విద్యార్థుల భాగస్వామ్యం

  • అక్టోబరు 3న 15 వేల మందితో పాన్‌ఐఐటీ ఏపీ సమ్మిట్‌

  • విజయవాడలో ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు

అమరావతి, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రాన్ని టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ‘‘మన టెక్నాలజీ.. మన స్వావలంబన’’ నినాదంతో సాంకేతిక నిపుణులతో ఓ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ఐటీ శాఖ సిద్ధమైంది. దేశంలోని 23 ఐఐటీల పూర్వ విద్యార్థులు దాదాపు నాలుగు లక్షల మందితో ఆ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇటీవల ఐఐటీ డైరెక్టర్ల బృందం ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమైంది. ఐఐటీల పూర్వవిద్యార్థుల(అలుమ్ని)తో ఒక కాంక్లేవ్‌ నిర్వహించే ఆలోచనలో ఉన్నామని ఆ డైరెక్టర్లు చంద్రబాబు వద్ద ప్రస్తావించారు. ఈ ప్రతిపాదనను సీఎం స్వాగతించారు. జాతీయస్థాయిలో ఉన్న ఐఐటియన్ల సంఖ్యపై ఆరా తీశారు. దాదాపు 4 లక్షల మందిదాకా ఉంటారని, ఇందులో అత్యధికులు విదేశాల్లో స్థిరపడ్డారని, మరికొందరు వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో ఉన్నారని సీఎంకు వివరించారు.


ఈ మేధో సంపత్తితో రాష్ట్ర ఆర్థిక స్వావలంబనకు దోహదపడేలా వాణిజ్య, ఆర్థిక కార్యకలాపాలను నిర్వహించాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఐఐటీ అలుమ్నితో ఒక చైన్‌ను ఏర్పాటు చేయడం ద్వారా.. దేశంలోనే అతిపెద్ద మేధో నెట్‌వర్క్‌ను రూపొందించవచ్చని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఈ నెట్‌వర్క్‌ ద్వారా ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌తో సహా.. సాంకేతిక మేధోసంపత్తిని దేశ ఆర్థిక ప్రయోజనాల కోసం సద్వినియోగం చేసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి సూచనలను ఐఐటియన్లు ఆమోదించారు. దేశంలో ఉన్న 23 ఐఐటీల డెరెక్టర్లు, పారిశ్రామికవేత్తలు, ఏఐ డీప్‌ టెక్నాలజీ నిపుణులతో ఒక సమ్మిట్‌ను నిర్వహిస్తామని ముఖ్యమంత్రికి చెప్పారు. ఇలా ఒకసారి కాకుండా దేశంలోని ఐఐటియన్లతో ప్రతియేటా అమరావతిలో పాన్‌ఐఐటీ ఆంధ్రప్రదేశ్‌ పేరిట సమిట్‌ను నిర్వహిస్తామని చంద్రబాబు వారికి తెలిపారు. దీనికి ప్యానల్‌ సెక్రటరీగా రాష్ట్రానికి చెందిన ఐటీ శాఖ కార్యదర్శిని నియమిస్తామన్నారు.

అంతేగాకుండా అమరావతి పాన్‌ఐఐటీ కౌన్సిల్‌ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తామని సీఎం వెల్లడించారు. ‘‘ప్రొడక్షన్‌ మనదే.. ప్రాఫిట్‌ మనదే’’ అనే విధంగా రాష్ట్రంలోనే ఏఐ ఆధారిత ఉత్పత్తులను తయారు చేసేలా ఐఐటియన్లు ముందడుగు వేయాలని అన్నారు. దేశంలోని 23 మంది ఐఐటీ డైరెక్టర్లతో సహా 15,000 మందితో పూర్వ విద్యార్థులతో అక్టోబరు 3న పాన్‌ఐఐటీ ఆంధ్రప్రదేశ్‌-2026 పేరిట విజయవాడ బీఆర్‌ అంబేడ్కర్‌ కళావేదికలో నిర్వహిస్తారు. ఈ భారీ సదస్సును ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభిస్తారు. సదస్సులో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి లోకేశ్‌, ఇతర మంత్రులు, ముఖ్యమంత్రి కార్యదర్శి ప్రద్యుమ్న, ఐటీశాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్‌, అమరావతి క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ సీఈవో శ్రీధర్‌తో పాటు ఇతర అధికారులు పాల్గొంటారు. ఈ సమ్మిట్‌లో వర్చువల్‌ విధానంలో నాలుగు లక్షలమందితో కూడిన ఐఐటియన్ల నెట్‌వర్క్‌ కూడా పాల్గొంటుంది. కార్పొరేట్ల సీఈవోలు, విశ్వవిద్యాలయాల వైస్‌చాన్స్‌లర్లు, విధాన నిర్ణయాల రూపకర్తలు, స్టార్ట్‌పల యాజమానులు తదితరులు హాజరవుతారు.


సదస్సులో ఐదు ప్యానెళ్లు

పాన్‌ ఐఐటీ ఆంధ్రప్రదేశ్‌ సమ్మిట్‌లో ఐదు ప్యానెళ్లు ఉంటాయి. ఎనర్జీ-ఫ్యూయల్‌, క్వాంటమ్‌-సెమీకండక్టర్‌, బయోవ్యాలీ-హెల్త్‌ యాక్సెస్‌, అగ్రిటెక్‌-వాటర్‌-బ్లూఎకానమీ, స్పేస్‌- డిఫెన్స్‌ వంటి ఐదు ప్యానెళ్లు పాన్‌ఐఐటీ ఆంధ్రప్రదేశ్‌ -2026లో ఏర్పాటవుతాయని సీఎం కార్యదర్శి ప్రద్యుమ్న గురువారం వెలగపూడి సచివాలయంలో మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ వివరించారు. ఐటీ ఆధారిత పలు అంశాలపై ప్యానల్‌ డిస్కషన్లు జరుగుతాయని వెల్లడించారు. ఈ సమ్మిట్‌ డిక్లరేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ఏఐ, డీప్‌ టెక్నాలజీలో దేశీయ ఐఐటియన్ల పరిజ్ఞానం వినియోగంపై చర్చ జరుగుతుందని చెప్పారు. విద్య, వైద్యం, వ్యవసాయం వంటి రంగాల్లో మౌలిక సేవల్లో ఏఐ డీప్‌ టెక్నాలజీ వినియోగంపైనా అర్థవంతమైన చర్చ ఉంటుందని తెలిపారు. 4 లక్షల మంది ఐఐటియన్లతో బలమైన నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయడం ద్వారా భారతదేశం పటిష్టవంతమైన నెట్‌వర్క్‌కు కేంద్రంగా మారుతుందని అభిప్రాయపడ్డారు.


సాంకేతిక విద్యార్థులకు దేశీయ క్వాంటమ్‌ కంప్యూటర్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ స్వదేశీ క్వాంటమ్‌ కంప్యూటర్లను క్యూశివ పేరిట క్యూబిట్‌ ఫోర్స్‌ సంస్థ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పటికే అమరావతిలోని ఎస్‌ఆర్‌ఎం వర్సిటీలోనూ, గన్నవరం మేధాటవర్స్‌లోనూ క్వాంటమ్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌లను ఆ సంస్థ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు యూనివర్సిటీల విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఐదు క్వాంటమ్‌ కంప్యూటర్లను క్యూబిట్‌ ఫోర్స్‌ తయారు చేసింది. గన్నవరం మేధాటవర్స్‌లో ఈ ఐదు కంప్యూటర్లను ఆ కంపెనీ సీఈవో ఎల్‌. వెంకట సుబ్రహ్మణ్యం బృందం రూపొందించింది. వీటిని వేలం వేసి దేశంలోని ఐదు విశ్వవిద్యాలయాలకు తరలిస్తారు. ఆంధ్రా యూనివర్సిటీ ఒక కంప్యూటర్‌ను సేకరించేందుకు సిద్ధమైంది. సాంకేతిక విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు ఇవి బాగా ఉపయోగపడతాయని ఐటీ నిపుణులు చెబుతున్నారు. క్యూశివలో అనే పేరులో అర్థాన్ని సంస్థ వివరించింది. క్యూ-క్వాంటం, ఎస్‌- సిస్టమ్‌, హెచ్‌- హర్డ్‌వేర్‌, ఐ-ఇంటిగ్రేషన్‌, వి-వ్యాలిడేషన్‌, ఎ-ఆర్కిటెక్చర్‌ అని తెలిపింది. ఈ ఐదు కంప్యూటర్‌లను ఈ ఏడాది అక్టోబరు 3న నిర్వహించే పాన్‌ఐఐటీ ఆంధ్రప్రదేశ్‌ 2026లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరిస్తారు. ఇప్పటికే వీటి కోసం విదేశాల నుంచి భారీగా డిమాండ్‌ రావడంతో మరిన్ని క్వాంటమ్‌ కంప్యూటర్లు తయారు చేయడానికి క్యూబిట్‌ ఫోర్స్‌ సిద్ధమవుతోంది.

ఈ వార్తలనూ చదవండి:

భలే మంచి బేరం !

బీజేపీది ద్వంద్వ వైఖరి: బొత్స

Updated Date - Sep 18 , 2026 | 04:00 AM