Share News

35 వేలకోట్లతో 36 ప్రాజెక్టులు!

ABN , Publish Date - Sep 13 , 2026 | 03:24 AM

దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే శంకుస్థాపన చేసిన చేతులతోనే ప్రారంభోత్సవాలు చేయాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్ప సాధనకు జలవనరుల శాఖ కార్యాచరణ సిద్ధం చేసింది.

35 వేలకోట్లతో 36 ప్రాజెక్టులు!

  • పెండింగ్‌ పనులు పూర్తిచేయడమే సర్కారు లక్ష్యం

  • వచ్చే మూడేళ్లూ సాగునీటి ప్రాజెక్టుల సంబరాలు

  • 17 లక్షల ఎకరాల కొత్తఆయకట్టుకు సాగునీరు

  • మరో 33.40 లక్షల ఎకరాల స్థిరీకరణ

  • జల వనరుల శాఖ కార్యాచరణ ప్రణాళిక

(అమరావతి-ఆంధ్రజ్యోతి): దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే శంకుస్థాపన చేసిన చేతులతోనే ప్రారంభోత్సవాలు చేయాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్ప సాధనకు జలవనరుల శాఖ కార్యాచరణ సిద్ధం చేసింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కరువు ప్రాంతంలో వెలిగొండ ప్రాజెక్టును ఇటీవల పూర్తి చేసిన సంగతి తెలిసిందే. నల్లమలసాగర్‌లోకి 10 టీఎంసీల కృష్ణా జలాలను నింపడంతో మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే స్ఫూర్తితో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న 36 సాగునీటి ప్రాజెక్టులను రూ.35,315 కోట్లతో వ్యయంతో పూర్తి చేసి రాష్ట్రంలో 17 లక్షల కొత్త ఆయకట్టుకు సాగు నీరందించడంతో పాటు 33.40 లక్షల ఎకరాలను స్థిరీకరించాలని జల వనరుల శాఖ నిర్ణయించింది. ఇక వరుసగా మూడేళ్లూ సాగునీటి ప్రాజెక్టుల సంబరాలు నిర్వహించేందుకు సంసిద్ధమవుతోంది. జూన్‌ నెలలో తుంగభద్ర జలాశయం గేట్లను బిగించడంతో సాగునీటి పథకాలకు మహర్దశ మొదలైందని జల వనరుల శాఖ చెబుతోంది. కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాలకు సాగునీరందించే ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీకి రూ.152 కోట్లతో కొత్త గేట్లను ఏర్పాటు చేసే పనులకు ముఖ్యమంత్రి పచ్చజెండా ఊపారు. గుంటూరు చానల్‌ అభివృద్ధి పనులను రూ.369 కోట్లతో ప్రారంభించారు. అనంతపురం జిల్లాకు ప్రయోజనం కలిగించే పేరూరు బ్రాంచ్‌ కెనాల్‌ పనులను రూ.1146 కోట్లతో చేపట్టేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. పోలవరం ఎడమ ప్రధాన కాలువ నుంచి అనకాపల్లి దాకా నీటిని తీసుకువెళ్లడం ద్వారా ఉత్తరాంధ్ర ప్రజలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న గోదావరి జలాల తరలింపును చంద్రబాబు సాకారం చేశారు. ఇదే క్రమంలో పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి, కాలువల విస్తరణకు, అనుసంధానం పనులకు జలవనరుల శాఖ ప్రణాళికలు వేసింది.


లక్ష్యాలు.. ప్రణాళికలు

  • రూ.166 కోట్ల వ్యయంతో ప్రకాశం జిల్లాకు మేలు చేసే పాలేరు రిజర్వాయరుకు ఈ నెల 26న శంకుస్థాపన చేయనున్నారు.

  • శ్రీసత్యసాయి, అన్నమయ్య జిల్లాలకు ప్రయోజనం చేకూర్చేలా రూ.760 కోట్లతో హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ రెండో దశ పనులను ఈ ఏడాది అక్టోబరులో ప్రారంభించి వచ్చే ఏడాది జూన్‌ నాటికి పూర్తి చేయనున్నారు.

  • మన్యం, శ్రీకాకుళం జిల్లాల చిరకాల కల అయున నేరడి బ్యారేజీని రూ.722 కోట్ల వ్యయంతో చేపట్టేందుకు నవంబరులో శంకుస్థాపన చేయనున్నారు.

  • పెన్నా-సర్వేపల్లి రిజర్వాయరు పనులు డిసెంబరు నాటికి పూర్తిచేయనున్నారు. మడ్డువలస రెండో దశ పనులను వచ్చే జూన్‌లో ప్రారంభిస్తారు.

  • పోలవరం సాగునీటి ప్రాజెక్టును వచ్చే ఏడాది మార్చినాటికి పూర్తి చేస్తారు. గోదావరి పుష్కరాల్లోపు ముఖ్యమంత్రి జాతికి అంకితం ఇవ్వనున్నారు.

  • హిరమండలం ఎత్తిపోతల పథకాన్ని వచ్చే ఏప్రిల్‌లో పూర్తి చేయనున్నారు.


  • వచ్చే జూన్‌ నాటికి నీవా బ్రాంచ్‌ కెనాల్‌ను, నాగావళి-చంపావతి నదుల అనుసంధానం, బుడమేరు మళ్లింపు పథకం, ముక్త్యాల ఎత్తిపోతల పథకం, వంశధార ఫేజ్‌-2, స్టేజ్‌-2 పనులు పూర్తి చేయనున్నారు.

  • రూ.3,643 కోట్లతో చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని వచ్చే జూలై నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

  • వచ్చే జూలై నాటికి రూ.484 కోట్లతో మహేంద్ర తనయ ఆఫ్‌షోర్‌ రిజర్వాయరు, రూ.249 కోట్లతో తోటపల్లి బ్యారేజీ పనులు పూర్తి చేస్తారు.

  • సోమశిల-స్వర్ణముఖి అనుసంధాన కాలువ పనులు వచ్చే ఏడాది డిసెంబరు నాటికి పూర్తి చేయనున్నారు.

  • 799 కోట్లతో మడకశిర బ్రాంచ్‌ కెనాల్‌ను, 808 కోట్లతో తారకరామ తీర్థసాగర్‌ను వచ్చే ఏడాది డిసెంబరు నాటికి పూర్తి చేస్తారు.

  • 2028 జూన్‌ నాటికి రూ.846 కోట్లతో భైరవానితిప్ప ప్రాజెక్టును, రూ.1770 కోట్లతో కర్నూలు జిల్లాకు మేలు చేసే వేదవతి ఎత్తిపోతలను పూర్తి చేస్తారు.

  • రూ.839 కోట్లలో అప్పర్‌ పెన్నా, రూ.1618 కోట్లతో హెచ్‌ఎన్‌ఎస్ నుంచి కడప నగరం దాకా జలాలను, రూ.3000 కోట్లతో తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కోనసీమకు లబ్ధిచేసేలా గోదావరి ఆధునికీకరణ పనులు, పల్నాడుకు లబ్ధి చేసేలా రూ.412 కోట్లతో వరికపూడిసెల, రూ.1200 కోట్లతో ఎస్‌ఆర్‌ఎంసీ అప్‌గ్రేడేషన్‌ చేపట్టి నంద్యాలకు ప్రయోజనం చేకూర్చే పథకాన్ని, రూ.2552 కోట్లతో జీఎన్‌ఎస్‌ఎస్‌ను కడప నుంచి కోడూరు దాకా చేపట్టి కడప, తిరుపతికి ప్రయోజనం చేకూర్చే పనులు 2028 డిసెంబరు నాటికి పూర్తి చేయనున్నారు.

  • యమిగానిపల్లె రిజర్వాయరు, మదనపల్లె రిజర్వాయరు, పాలార్‌ ఎత్తపోతల, బీనుగాని చెరువు పనులను రూ.822 కోట్లతో చేపట్టి 2028 మార్చి నాటికి పూర్తి చేస్తామని జల వనరుల శాఖ ప్రకటించింది.

ఈ వార్తలనూ చదవండి:

ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్‌ వైద్యం

‘స్థానిక’ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలి

Updated Date - Sep 13 , 2026 | 03:24 AM