Share News

నిండా రెండేళ్లు! వికాసం దిశగా ‘ఏపీ ఈజ్ బ్యాక్’

ABN , Publish Date - Jun 12 , 2026 | 04:45 AM

ఐదేళ్ల అరాచక చర్యలు... ఆర్థిక కష్టాలు... ‘రివర్స్‌’ విధానాలకు తెరపడి నేటికి రెండేళ్లు! ‘ఐ యామ్‌ బ్యాక్‌’ అంటూ నవ్యాంధ్ర తెరపైకి వచ్చి రెండేళ్లు! చంద్రబాబు ముఖ్యమంత్రిగా కూటమి సర్కారు కొలువు తీరి రెండేళ్లు!....

నిండా రెండేళ్లు! వికాసం దిశగా ‘ఏపీ ఈజ్ బ్యాక్’

  • భారీగా పెట్టుబడుల ఆకర్షణ

  • సంక్షేమంలో దేశంలోనే నంబర్ 1

  • పట్టాలెక్కిన అమరావతి రాజధాని

  • పూర్తి దిశగా పోలవరం ప్రాజెక్ట్

  • ఎన్నో మెరుపులు.. కొన్ని విరుపులు

ఐదేళ్ల అరాచక చర్యలు... ఆర్థిక కష్టాలు... ‘రివర్స్‌’ విధానాలకు తెరపడి నేటికి రెండేళ్లు! ‘ఐ యామ్‌ బ్యాక్‌’ అంటూ నవ్యాంధ్ర తెరపైకి వచ్చి రెండేళ్లు! చంద్రబాబు ముఖ్యమంత్రిగా కూటమి సర్కారు కొలువు తీరి రెండేళ్లు! 2024 జూన్‌ 12వ తేదీన కొలువు తీరిన క్షణం నుంచి ప్రతిక్షణం పోరాటమే! రాష్ట్రాన్ని తిరిగి గాడిన పెట్టాలనే ఆరాటమే! జీతాలే సరిగా ఇవ్వలేని పరిస్థితి నుంచి... సంక్షేమంలో దేశంలోనే ‘ఏపీ నంబర్‌ 1’ అనే దశకు రాష్ట్రం చేరుకుంటోంది. ‘సంపద పెంచాలి. సంక్షేమం అందించాలి’ అనే మంత్రమే వినిపిస్తోంది. పెట్టుబడుల వేటలో ముందుకు దూసుకుపోతోంది. ఐదేళ్ల జగన్‌ పాలనలో పదిహేనేళ్లు వెనకబడిపోయిన రాష్ట్రానికి నేడు భవిష్యత్తు కనిపిస్తోంది.

అయితే.. అన్నీ మెరుపులే కాదు! వెంటాడే కష్టాలూ ఉన్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కారణంగా.. ఇచ్చిన హామీలన్నింటినీ పూర్తి స్థాయిలో నెరవేర్చడం కష్టతరంగా మారింది. పాలన, విధానాల్లో దిద్దుకోవాల్సిన లోపాలూ అనేకం ఉన్నాయి.

విధ్వంస విధానాలకు చరమగీతం

  • వైసీపీ హయాంలో భూబకాసురులు రైతులు, సామాన్య ప్రజల భూములను అడ్డగోలుగా దోచుకున్నారు. దీనికి అధికారాన్ని అడ్డం పెట్టుకుని 22ఏ అస్త్రాన్ని ప్రయోగించారు. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా తరతరాలుగా అనుభవిస్తున్న సామాన్యులకు చెందిన లక్షలాది ఎకరాలు నిషేధిత భూముల జాబితాల్లోకి చేరిపోయాయి. రీసర్వే పేరుతో రైతులను మరిన్ని ఇబ్బందులకు గురి చేశారు. ఈ చిక్కుముడులన్నింటినీ కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా విడదీస్తూ వస్తోంది. 22ఏ నిషేధిత జాబితాలోని భూములకు విముక్తి కల్పించేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటి వరకు 1.60 లక్షల ఎకరాలకు విముక్తి కలుగగా, మరో 1.90 లక్షల ఎకరాలకు విముక్తి కలిగించే దిశగా కసరత్తు జరుగుతోంది.

  • గత వైసీపీ పాలనలో రైతుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ను కూటమి అధికారంలోకి రాగానే రద్దు చేశారు.

  • భవన నిర్మాణ కార్మికులను కడగండ్ల పాలు చేసి రోడ్డునపడేసిన గత ప్రభుత్వ ఇసుక విధానాన్ని రద్దు చేసి, ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చారు.

  • ప్రజలకు భారంగా మారిన చెత్తపన్ను రద్దు చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో పేరుకుపోయిన 83 లక్షల మెట్రిక్‌ టన్నుల చెత్త తొలగింపునకు చర్యలు తీసుకున్నారు.

  • సామాన్యుల ఇళ్లపై నిఘానేత్రాలుగా మారిన వలంటీర్ల వ్యవస్థకు ముగింపు పలికి ప్రభుత్వానికి ఆర్థికభారాన్ని తగ్గించడంతోపాటు సామాన్య ప్రజలకు ఉపశమనం కలిగించారు.

13.jpg

నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని గుల్ల చేసిన వైసీపీ హయాం నాటి అస్తవ్యస్త మద్యం పాలసీకి చెక్‌ పెట్టి పారదర్శకత, నాణ్యతకు పెద్దపీట వేస్తూ నూతన ఎక్సైజ్‌ విధానాన్ని తీసుకొచ్చారు.


ఏపీ ఈజ్‌ బ్యాక్‌!

  • వైసీపీ హయాంలో ఐదేళ్లపాటు అడ్రస్‌ లేకుండా పోయిన అభివృద్ధి మళ్లీ రాష్ట్రంలో కనిపిస్తోంది. రాష్ట్ర పారిశ్రామిక ముఖచిత్రం శరవేగంగా మారుతోంది.

  • రెండేళ్ల కాలంలో సుమారు 800 కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపాయి. రూ.23లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు వివిధ కంపెనీలు ముందుకొచ్చాయి. ఇవన్నీ సాకారమైతే వీటి ద్వారా 23 లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది.

  • ఏడాది కాలంలో దేశానికి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో (ఎఫ్‌డీఐ) 25.3 శాతం రాష్ట్రానికే రావడం విశేషం.

  • అనకాపల్లిలో రూ.1.35 లక్షల కోట్లతో అర్సెల్లార్‌ మిట్టల్‌ స్టీల్‌ ప్లాంట్‌కు శంకుస్థాపన జరిగింది.

  • రామాయపట్నంలో రూ.96,862 కోట్లతో బీసీపీఎల్‌ రిఫైనరీ ఏర్పాటు కానుంది.

  • కాకినాడలో ఏఎం గ్రీన్‌ సంస్థ సుమారు 2 గిగావాట్‌ సామర్థ్యంతో భారీ గ్రీన్‌ హైడ్రోజన్‌, గ్రీన్‌ అమ్మోనియా ప్లాంట్‌ను నిర్మిస్తోంది. ఇది పూర్తయితే దేశంలోనే అతిపెద్దదిగా, ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ప్లాంట్‌గా నిలవనుంది.

  • ఐదేళ్ల విధ్వంస పాలనతో శిథిలమైన రాజధాని అమరావతి మళ్లీ ఊపిరి పోసుకుంటోంది. పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

    9.jpg4.jpg


ఆర్థికలోటు.. సామాన్యులకు శాపం

ఐదేళ్ల వైసీపీ విధ్వంస పాలన కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి అటు అభివృద్ధి పనులకు నిధులు సర్దుబాటు చేసుకుంటూ... ఇటు సంక్షేమ పథకాల అమలులో దూ కుడు ప్రదర్శిస్తోంది. నిధుల కోసం అప్పులపైనే ఆధారపడాల్సిన పరిస్థితి. రుణ భారం రోజురోజుకూ పెరుగుతోంది. కీలకమైన పథకాల అమలుపై దీని ప్రభావం పడుతోంది. మరీ ముఖ్యంగా... ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.4వేల కోట్ల వరకు పేరుకుపోయాయి. దీంతో కాలేజీల యాజమాన్యాలు ‘ఫీజు కడితేనే సర్టిఫికెట్లు’ అంటూ విద్యార్థులను ముప్పుతిప్పలు పెడుతున్నాయి. ‘ఎన్టీఆర్‌ వైద్య సేవ’ బకాయిలూ పేరుకుపోవడంతో తరచూ నెట్‌వర్క్‌ ఆస్పత్రులు సమ్మె బాట పడుతున్నాయి.

12.jpg

పొలిటికల్‌ గవర్నెన్స్‌ ఏదీ?

కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా చాలామంది అధికారుల్లో నిర్లిప్తత పోలేదు. పొలిటికల్‌ గవర్నెన్స్‌ అనే మాట పదే పదే చంద్రబాబు నోటి వెంట వినడమే తప్ప... అధికారులు దాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు. చాలా శాఖల్లో సంబంధిత మంత్రులకు, అధికారులకు మధ్య సమన్వయలోపం స్పష్టంగా కనిపిస్తోంది. ఇటు ప్రభుత్వంలో, అటు పార్టీలో కన్సల్టెంట్ల హవా నడుస్తోంది. ముఖ్యమంత్రి మొదలు మంత్రుల వరకు కన్సల్టెంట్ల గీసిన గీత దాటడం లేదు. చంద్రబాబు క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లినప్పుడు ప్రచారం కోసం ఆయనతో చేయిస్తున్న పనులూ పాతకాలపు గిమ్మిక్కులను గుర్తుకు తెస్తున్నాయనే వాదన వినిపిస్తోంది. వినూత్న ఆలోచనల పేరుతో వింత విధానాలకు తెరలేపకుండా... క్షేత్రస్థాయిలో పరిస్థితులకు అనుగుణంగా మెలగడం మంచిదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.


7.jpg

బస్సులు కావాలి...

‘స్త్రీశక్తి’ కింద రూ.2565 కోట్ల సబ్సిడీని ఆర్టీసీకి ఇంత వరకు విడుదల చేయలేదు. ఇదే పరిస్థితి కొనసాగితే ఆర్టీసీ కుదేలయ్యే దుస్థితి వస్తుంది. మహిళల ఉచిత ప్రయాణానికి తగిన స్థాయిలో కొత్త బస్సులను సమకూర్చుకోలేదు. దీంతో బస్సుల్లో రద్దీ పెరుగుతోంది. టికెట్‌ కొని బస్సు ఎక్కేవారికి ఇబ్బందులు తప్పడం లేదు.

6 లో 2 పెండింగ్‌

ఎన్నికలకు ముందు కూటమి ‘సూపర్‌ సిక్స్‌’ హామీలు ప్రకటించింది. వాటిలో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, దీపం-2, స్త్రీ శక్తి (మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం) పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నారు. అయితే... యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు లేదా నెలకు రూ.3వేలు నిరుద్యోగ భృతి, ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఆడబిడ్డ నిధి ఇస్తామన్న హామీలపై స్పష్టత లేదు.

మంచి పనులు...

  • రెండేళ్లలో గ్రామీణ ప్రాంతాల్లో 2వేల కిలోమీటర్ల సిమెంట్లు రోడ్లు, పదివేల కిలోమీటర్ల తారు రోడ్లు వేశారు.

  • ఏజెన్సీ ప్రాంతాల్లో రూ.వెయ్యి కోట్లతో రహదారులు నిర్మించారు.

  • ధాన్యం అమ్మిన రైతుల ఖాతాల్లో గతంలో నెలల తరబడి డబ్బులు జమ అయ్యేవి కావు. ఇప్పుడు 24 గంటల్లోనే డబ్బులు పడుతున్నాయి.

  • సుదీర్ఘకాలం తర్వాత... మరోసారి కూటమి హయాంలో పోలీసు శాఖలో 6100 మందిని నియమించారు.

  • సంక్షేమ గురుకులాలు, హాస్టళ్లలో విద్యార్థుల ఆరోగ్య రక్షణపైనా దృష్టి సారించారు. ఎప్పటికప్పుడు నాణ్యమైన వైద్యసేవలు అందిస్తున్నారు.

  • అధిక ధరలకు ఎడాపెడా విద్యుత్‌ కొనుగోళ్లు జరిపే గతకాలపు పద్ధతికి తెరపడింది. ఈ రెండేళ్లలో విద్యుత్‌ చార్జీలు పెంచకపోగా... ట్రూడౌన్‌ ద్వారా తగ్గించడం ఒక పెద్ద విజయం.

3.jpg

జగన్‌ హయాంలో ఊసేలేని ఉపాధ్యాయ నియామకాలు మళ్లీ జరిగాయి. రికార్డు స్థాయిలో 16వేలకుపైగా టీచర్‌ పోస్టులను భర్తీ చేశారు.


6.jpg

లక్షణంగా సంక్షేమం

రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలోనే సంచలనాలను సృష్టిస్తున్నాయి. రెండేళ్లలో సంక్షేమ పథకాల కోసం సుమారు లక్ష కోట్లు ఖర్చు చేసి ఉంటారని అంచనా! ఇది ఏదో ఒక వర్గానికి పరిమితం కాదు. అన్ని వర్గాలకూ సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. పేదల కడుపు నింపడంలో ‘అన్న క్యాంటీన్లు’ సూపర్‌ సక్సెస్‌ అయ్యాయి. కూటమి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 269 అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసి ఇప్పటి వరకు రూ.230 కోట్లు వాటిపై వెచ్చించింది. మహిళల కోసం తీసుకొచ్చిన ‘స్త్రీ శక్తి’తో మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారు. ఈ పథకాన్ని ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటిదాకా 71 కోట్ల ప్రయాణాలు చేయడం ద్వారా మహిళలు ఈ పథకం ద్వారా రూ.2565 కోట్ల మేర లబ్ధి పొందారు.

10.jpg

సామాజిక పింఛన్లలో విప్లవం

రెండేళ్ల కాలంలో ఎన్టీఆర్‌ భరోసా పేరుతో ఇచ్చిన సామాజిక భద్రతా పింఛన్ల మొత్తం రూ.65,887 కోట్లు. పొరుగు రాష్ట్రాలతో సహా దేశంలోని మరే రాష్ట్రం కూడా ఈ విషయంలో ఏపీ దరిదాపుల్లో కూడా లేదు. సంక్షేమ పథకాల అమలులో ఏపీ రోల్‌ మోడల్‌గా నిలుస్తోంది.

8.jpg


ఇంకా ఎన్నెన్నో...

  • ‘దీపం-2’ కింద 4.26 కోట్ల సిలిండర్లను ఉచితంగా అందించారు. దీని నిమిత్తం రూ.3100 కోట్లను కూటమి ప్రభుత్వం భరిస్తోంది.

  • ‘అన్నదాత సుఖీభవ’ పథకం కింద 46 లక్షల మంది రైతులకు ఇప్పటి వరకు రూ.8985 కోట్లను జమ చేశారు. దీని ద్వారా ఒక్కో రైతుకు రూ.20వేల చొప్పున లబ్ధి చేకూరుతోంది.

  • ‘ఆటోడ్రైవర్ల సేవలో’ భాగంగా ఏడాదికి రూ.15వేలు చొప్పున ఇప్పటి వరకు రూ.435 కోట్లు వారి ఖాతాల్లో జమ చేశారు.

1.jpg

పిల్లల తల్లులందరికీ వందనం

జగన్‌ హయాంలో ఇంటికి ఒకరికి మాత్రమే అమలు చేసిన పథకం... ‘అమ్మ ఒడి’! కూటమి సర్కారు... ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటుంటే... అందరికీ ‘తల్లికి వందనం’ అమలు చేస్తోంది. రాష్ట్రంలో 67.27 లక్షల మంది పిల్లలకు ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. 47 లక్షల మంది తల్లుల ఖాతాల్లో ఇప్పటి వరకు రూ.10వేల కోట్లను జమ చేశారు. ఒక సంక్షేమ పథకానికి సంబంధించి ఇంత మొత్తం కేటాయించడం రికార్డు.

11.jpg


అది మాత్రమే చాలదు...

‘బటన్‌ నొక్కి డబ్బులిస్తే చాలు... మళ్లీ మళ్లీ అధికారం మనదే’ అని జగన్‌ గట్టిగా భావించారు. కానీ.. సంక్షేమం ఒక్కటే చాలదని, ప్రభుత్వాన్ని ప్రజలు అన్ని కోణాల్లో చూసి తీర్పు చెబుతారని 2024 ఎన్నికలు స్పష్టం చేశాయి. ప్రజలకు పప్పు బెల్లాల్లా డబ్బులు పంచేసి మనం ఏం చేసినా గెలిపించేస్తారనే జగన్‌ ఆశలకు జనం గండి కొట్టారు. శ్రుతి మించిన అవినీతి, శాంతి భద్రతల్లో వైఫల్యం, ఎమ్మెల్యేల అరాచకాలు... వీటన్నింటి వల్లే వైసీపీకి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారు. కూటమి సర్కారు, నేతలు దీనిని నిత్యం గుర్తుంచుకోవాల్సిన అవసరముంది. కొందరు మంత్రులు చేస్తున్న అవినీతి పనులు, పలువురు ఎమ్మెల్యేల తీరు ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొచ్చేలా ఉంది.

ఇవీ జరగాలి...

  • అన్ని రకాల సామాజిక పింఛన్లను భారీగా పెంచి ఇస్తున్నప్పటికీ... రెండేళ్లలో కొత్త పింఛన్లు మంజూరు చేయలేదు.

  • కొత్తగా ఇళ్ల స్థలాలు, ఇళ్ల ఊసు కూడా లేదు.

  • వైసీపీ హయాంలో అనర్హులకు కేటాయించిన పింఛన్లను ఇప్పటికీ తొలగించకపోవడం... జగనన్న ఇళ్లు, కాలనీల్లో చోటు చేసుకున్న అక్రమాలపై చర్యలు తీసుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది.

  • వైసీపీ హయాంలో ఏర్పడిన రీసర్వే సమస్యలను ఇప్పటికీ పరిష్కరించలేకపోతున్నారు.

  • క్వాంటం వ్యాలీ, డేటా సెంటర్లు, ఏఐ... ఇలాంటి భారీ సాంకేతికత వల్ల సామాన్యులకు కలిగే లబ్ధి, స్థానికులకు కలుగుతున్న ఉపాధిపై ప్రజలకు స్పష్టత ఇవ్వాలి.

ఉద్యోగులపై దృష్టి పెట్టండి

వైసీపీ హయాంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఉద్యోగుల జీతాలు, రిటైర్డ్‌ ఉద్యోగుల పింఛన్లు ప్రతినెలా వారాల తరబడి జాప్యం అవుతూ వచ్చాయి. పీఆర్సీ అమలులో జగన్‌ సర్కార్‌ మొండి వైఖరి, సీపీఎస్‌ రద్దు చేస్తానన్న హామీపై వెనకడుగు వంటి చర్యలు ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల్లో జగన్‌ సర్కార్‌పై వ్యతిరేకతను పెంచాయి. కూటమి సర్కారు ఉద్యోగుల విషయంలో సానుకూల ధోరణితోనే ముందుకు వెళుతోంది. వేలకోట్ల బకాయిలు విడుదల చేసింది. వారి సమస్యలపై మరింత దృష్టి సారించాల్సిన అవసరముంది.

అమరావతి లేఅవుట్లను వదిలేస్తే ఎలా?

ఐదు కోట్ల రాష్ట్ర ప్రజల ఆకాంక్ష అయిన రాజధాని అమరావతి విషయంలో ప్రభుత్వం ఇంకా పాఠాలు నేర్చుకోవడం లేదు. ఇప్పటికీ ప్రభుత్వ భవనాలు, క్వార్టర్ల పనులపైనే దృష్టి సారిస్తున్నారు. ప్రైవేటు, ప్రజల కార్యకలాపాలు (పబ్లిక్‌ యాక్టివిటీ) ఊపందుకోవాలంటే... లేఔట్లను అభివృద్ధి చేయాలి. అవి లేకుండా అమరావతిలో ఎవరూ ఇల్లు కట్టుకోలేరు. వ్యాపారాలు మొదలుపెట్టలేరు.

Updated Date - Jun 12 , 2026 | 06:50 AM