డీఎస్సీపై విచారణకు సిద్ధం.. వైసీపీకి మంత్రి మండిపల్లి కౌంటర్
ABN , Publish Date - Jul 25 , 2026 | 05:35 PM
ఏపీలో డీఎస్సీ నియామకాలపై వైసీపీ చేస్తున్న ఆరోపణలపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆధారాలు లేకుండా ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాలు మానుకోవాలని, విచారణకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
అమరావతి, జులై 25: ఏపీలో డీఎస్సీ నియామకాలపై వైసీపీ చేస్తున్న ఆరోపణలపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి నారా లోకేశ్‌పై వైసీపీ చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని మంత్రి మండిపడ్డారు. వైసీపీకి ఆరోపణలు చేయడం తప్ప ఆధారాలు చూపించే అలవాటు లేదని విమర్శించారు. తాడేపల్లిలో జగన్ ఇంటి సమీపంలోనే ఉండి లోకేశ్ డీఎస్సీపై సవాల్ విసిరారని, దానిపై స్పందించేందుకు జగన్ ఎందుకు ముందుకు రాలేదని ప్రశ్నించారు. డీఎస్సీ నియామకాలపై ఎలాంటి అనుమానాలు ఉన్నా చట్టబద్ధంగా విచారణకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.
ప్రభుత్వం నుంచి అధికారికంగా వివరాలు ఇచ్చినప్పటికీ వైసీపీ రాజకీయ దివాళాకోరుతనంతో విమర్శలు చేస్తోందని మంత్రి మండిపల్లి అన్నారు. తప్పుడు ప్రచారాలతో యువతను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను వెంటనే మానుకోవాలని సూచించారు. నిరాధార ఆరోపణలతో ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీయడమే వైసీపీ లక్ష్యమని ఆరోపించారు. డీఎస్సీ నియామకాలు చేపట్టలేని వారు రాజకీయ రంగు పులిమి విమర్శలు చేయడం సరికాదని, ప్రజా సమస్యలపై చర్చించకుండా తప్పుడు ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు.
ఇవి కూడా చదవండి...
అమెరికా బెదిరింపులకు లొంగేది లేదు.. SCO సమ్మిట్‌లో ఇరాన్ ప్రకటన
Read Latest AP News And Telugu News