Share News

ఏపీ పారిశ్రామిక కేంద్రంగా సీమ

ABN , Publish Date - Nov 29 , 2026 | 01:00 AM

రాయలసీమను ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఐటీ, ఎలక్ట్రానిక్స్ ఆర్టీజీఎస్‌, విద్యా శాఖల మంత్రి లోకేశ్‌ పేర్కొన్నారు. సీమ అభివృద్ధికి తమతో చేతులు కలపాలని పారిశ్రామిక సంస్థలకు ఆయన పిలుపునిచ్చారు.

ఏపీ పారిశ్రామిక కేంద్రంగా సీమ

  • దేశానికి తయారీ గమ్యస్థానంగా ఎదుగుతున్న ఓర్వకల్లు మెగా ఇండస్ట్రియల్‌ హబ్‌

  • ఈ ప్రాంతంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను పరిచయం చేసిన జైరాజ్‌ ఇస్పాత్‌ స్టీల్‌ప్లాంట్‌

  • సీమ అభివృద్ధికి మాతో చేతులు కలపండి

  • పారిశ్రామిక సంస్థలకు లోకేశ్‌ పిలుపు

అమరావతి, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): రాయలసీమను ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఐటీ, ఎలక్ట్రానిక్స్ ఆర్టీజీఎస్‌, విద్యా శాఖల మంత్రి లోకేశ్‌ పేర్కొన్నారు. సీమ అభివృద్ధికి తమతో చేతులు కలపాలని పారిశ్రామిక సంస్థలకు ఆయన పిలుపునిచ్చారు. కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు మెగా ఇండస్ట్రియల్‌ హబ్‌ తయారీ రంగంలో దేశానికి ప్రధాన గమ్యస్థానంగా వేగంగా మారుతోందని పేర్కొన్నారు. ఈ మేరకు ఓర్వకల్లు హబ్‌ అభివృద్ధి చెందుతున్న తీరుపై శనివారం తన ‘ఎక్స్‌’ ఖాతాలో పోస్టు చేశారు. ‘‘2016లో కర్నూలు జిల్లా ఓర్వకల్లు మెగా ఇండస్ట్రియల్‌ హబ్‌లో జైరాజ్‌ ఇస్పాత్‌ సంస్థకు మా ప్రభుత్వం భూములు కేటాయించింది. 2018 మేలో సీఎం చంద్రబాబు ఈ పరిశ్రమకు శంకుస్థాపన చేశారు. నాడు ఖాళీగా ఉన్న భూముల్లో నేడు ఆసియాలోనే తొలిసారిగా ఎండ్‌లెస్‌ కాస్టింగ్‌ అండ్‌ రోలింగ్‌ లైన్‌ సాంకేతిక పరిజ్ఞానంతో సమీకృత ఉక్కు పరిశ్రమ కార్యకలాపాలు కొనసాగిస్తోంది.


ఈ ప్లాంట్‌ ప్రస్తుతం 430 ఎకరాల విస్తీర్ణంలో రూ.2,100 కోట్లకు పైగా పెట్టుబడితో ఏర్పాటైంది. రెండో దశలో భాగంగా మరో 600 ఎకరాల్లో రూ.3,378 కోట్ల పెట్టుబడితో జైరాజ్‌ ఇస్పాత్‌ తన కార్యకలాపాలను విస్తరించనుంది. దీని ద్వారా మరో 934 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఈ పరిశ్రమలో పనిచేస్తున్న వారిలో 65 శాతం మంది స్థానికులే కావడం నాకు ఎంతో సంతోషాన్నిచ్చింది. మేనేజర్‌గా పనిచేస్తున్న ఎస్‌. శ్రీనివాసు, ఇంజనీర్‌గా పనిచేస్తున్న డి.సింధూజ వంటి వారు ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా సొంత ప్రాంతంలోనే పనిచేస్తున్నారు. యువతకు వారి సొంత ప్రాంతంలోనే ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యం.

ఓర్వకల్లులో పారిశ్రామిక అభివృద్ధికి జైరాజ్‌ ఇస్పాత్‌ పునాది వేసింది. ఈ ప్రాంతంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ఇతర కంపెనీలకు పరిచయం చేసింది. రిలయన్స్‌ కేవలం 12 నెలలలోనే ఆసియాలోనే అతిపెద్ద పానీయాల తయారీ పరిశ్రమను ఇక్కడ అందుబాటులోకి తీసుకొచ్చింది. సౌర విద్యుత్‌ పరికరాల తయారీ సంస్థలు కూడా ఇక్కడ పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్నాయి. మరోవైపు ఓర్వకల్లు డ్రోన్‌ సిటీ రూపుదిద్దుకుంటోంది. వివిధ రంగాలకు చెందిన పరిశ్రమల రాకతో ఓర్వకల్లు దేశంలోనే ఒక ముఖ్యమైన తయారీ రంగ గమ్యస్థానంగా ఎదుగుతోంది.

పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం, పెట్టుబడులను ఆకర్షించడం, స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలను పెంచడంపై మా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాయలసీమను ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అందరం కలిసి కృషి చేద్దాం’’ అని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు.


  • శరవేగంగా అమరావతి నిర్మాణం

  • వీడియో షేర్‌ చేసిన లోకేశ్‌

రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణ వేగాన్ని మంత్రి లోకేశ్‌ వీడియో ద్వారా వివరించారు. ప్రతి వంద రోజులకు ప్రజా రాజధాని మరో అడుగు ముందుకు సాగుతోందని తెలిపారు. పట్టుదలతో పనిచేసే ప్రభుత్వం, అంకితభావంతో పనిచేసే బృందం ఉంటే ఎలాంటి లక్ష్యాన్నైనా సాధించవచ్చని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనుల వేగాన్ని చూపిస్తూ ‘నాడు-నేడు’ పేరుతో ఓ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు.

ఈ వార్తలనూ చదవండి:

అమరావతి నిర్మాణాలపై వైసీపీ తప్పుడు ప్రచారం.. నిజాలు తేల్చిన ఏపీ ఫ్యాక్ట్‌ చెక్..

నేడే రెండో విడత పల్లె సమరం

Updated Date - Nov 29 , 2026 | 01:07 AM