దాడి చేసిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టం: అనిత
ABN , Publish Date - Sep 25 , 2026 | 03:48 AM
యువతకు ఉద్యోగాలు కూటమి నైజం.. రౌడీయిజం జగన్ నైజమని హోంమంత్రి వంగలపూడి అనిత విమర్శించారు. గురువారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. వైసీపీ హయాంలో జరిగిన గ్రూప్-1 అక్రమాలతో తాడేపల్లి ప్యాలెస్ పెద్దల వేల కోట్ల రూపాయలు సంపాదించారని...
అమరావతి, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): యువతకు ఉద్యోగాలు కూటమి నైజం.. రౌడీయిజం జగన్ నైజమని హోంమంత్రి వంగలపూడి అనిత విమర్శించారు. గురువారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. వైసీపీ హయాంలో జరిగిన గ్రూప్-1 అక్రమాలతో తాడేపల్లి ప్యాలెస్ పెద్దల వేల కోట్ల రూపాయలు సంపాదించారని, ఈ కుంభకోణం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు డీఎస్సీపై తప్పుడు ప్రచారాలు చేయిస్తూ, రౌడీ మూకలతో గురువులపై దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు. ‘డీఎస్సీ నియామక ప్రక్రియ ఎంత పారదర్శకంగా జరిగిందో మంత్రి లోకేశ్ స్వయంగా అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వెల్లడించారు. ఇంకా అనుమానాలు ఉంటే బహిరంగ చర్చకూ సిద్ధమేనని మూడుసార్లు సవాల్ విసిరినా జగన్ ముందుకు వచ్చే ధైర్యం చేయలేకపోయారు. తాడేపల్లి ప్యాలెస్ డైరెక్షన్‌లో వైసీపీ మూకలు ఉపాధ్యాయులపై పాశవిక దాడికి తెగబడటం దుర్మార్గం. వారిలో 70 శాతం మంది నేరచరిత్ర కలిగిన రౌడీషీటర్లు, పోక్సో కేసులు, హత్యాయత్నం కేసులు, బ్లేడ్ బ్యాచ్‌లతో సంబంధాలున్నవారే. ఉపాధ్యాయులపై దాడులుచేసిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు’ అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా దాడులకు పాల్పడిన వారి ఫొటోలు, నేరచరిత్రతో సహా మీడియాకు వివరించారు.
ఈ వార్తలనూ చదవండి...