Share News

బాలిక మృతిని సీరియ్‌సగా తీసుకోరా?

ABN , Publish Date - Nov 12 , 2026 | 02:02 AM

మలేరియా మాత్రలు వికటించి బాలిక మృతిచెందడం, పలువురు విద్యార్థులు అస్వస్థకు గురైన ఘటనను అధికారులు సీరియ్‌సగా తీసుకున్నట్లు కనిపించడం లేదని హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది.

బాలిక మృతిని సీరియ్‌సగా తీసుకోరా?

  • స్టేటస్‌ రిపోర్ట్‌ను ఎస్‌ఐ దాఖలు చేయడమేంటి?

  • పూర్తి వివరాలతో అఫిడవిట్‌ వేయండి

  • వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి, పోలవరం డీఎంహెచ్‌వో, ఎస్పీకి ధర్మాసనం ఆదేశం

అమరావతి, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): మలేరియా మాత్రలు వికటించి బాలిక మృతిచెందడం, పలువురు విద్యార్థులు అస్వస్థకు గురైన ఘటనను అధికారులు సీరియ్‌సగా తీసుకున్నట్లు కనిపించడం లేదని హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై ఎస్‌ఐ స్టేటస్‌ రిపోర్ట్‌ దాఖలు చేయడంపై ధర్మాసనం మండిపడింది. ఇది కోర్టు పట్ల అవిధేయత ప్రదర్శించడమేనని వ్యాఖ్యానించింది. కనీసం డీఎస్పీ లేదా ఎస్పీ స్థాయి అధికారి దాఖలు చేయాల్సిన నివేదికను ఎస్‌ఐ సమర్పించారంటే కేసును ఎంత సీరియ్‌సగా తీసుకున్నారో అర్థమవుతోందని పేర్కొంది. ఆ స్టేటస్‌ రిపోర్ట్‌లో కనీస వివరాలు లేవని ఆక్షేపించింది.

బాలిక మృతికి సంబంధించిన కారణాలు నివేదికలో చెప్పలేదని, మృతురాలి వైద్య రికార్డులు, ఫోరెన్సిక్‌ నివేదికను స్టేటస్‌ రిపోర్టుకు జత చేయకపోవడంపై అభ్యంతరం తెలిపింది. ఈ వ్యవహారంపై తీసుకున్న చర్యలను అఫిడవిట్‌ రూపంలో తమ ముందు ఉంచాలని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి, పోలవరం జిల్లా డీఎంహెచ్‌వో, జిల్లా ఎస్పీని ఆదేశించింది. ఈ కేసుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు స్పష్టం చేసింది. పోలవరం జిల్లా డీఎంహెచ్‌వో, ఎస్పీని వ్యాజ్యంలో ప్రతివాదులుగా చేర్చింది. తదుపరి విచారణను పది రోజులకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ లిసాగిల్‌, జస్టిస్‌ చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది.


పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగుప్పలో మలేరియా మాత్రలు వికటించి సెప్టెంబరు 1న జమున అనే ఏడేళ్ల విద్యార్థిని మృతి చెందగా, మరో 53 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనపై తెలంగాణకు చెందిన నల్లపు మణిదీప్‌ అనే న్యాయవాది సుప్రీంకోర్టుకు లేఖ రాశారు. విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు... ఈ వ్యవహారంపై విచారణ జరపాలని ఏపీ హైకోర్టును ఆదేశించింది. దీంతో హైకోర్టు సుమోటో కేసు నమోదు చేసింది. ఈ పిల్‌ బుధవారం మరోసారి విచారణకు రాగా.. కోర్టు ఆదేశాల మేరకు స్టేటస్‌ రిపోర్ట్‌ దాఖలు చేశామని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) విష్ణుతేజ తెలిపారు.

ఆ నివేదికను పరిశీలించిన ధర్మాసనం.. స్థానిక ఎస్‌ఐ రిపోర్ట్‌ దాఖలు చేయడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఎస్‌జీపీ స్పందిస్తూ... తాజా వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేస్తామని, కొంత సమయం ఇవ్వాలని అభ్యర్థించారు.

ఈ వార్తలనూ చదవండి:

ఇదే స్ఫూర్తితో స్వచ్ఛాంధ్ర సాధనకు అంతా కలిసి పనిచేద్దాం: సీఎం చంద్రబాబు

15 ఏళ్ల తర్వాత లంచం కేసులో తీర్పు.. మాజీ సీఐకి ఏడాది జైలు

Updated Date - Nov 12 , 2026 | 02:06 AM