బ్రిక్స్ వారోత్సవాల్లో ఏపీ వైద్య ఆరోగ్య శాఖకు అగ్రస్థానం
ABN , Publish Date - Nov 16 , 2026 | 08:08 PM
బ్రిక్స్ సుస్థిర జీవనశైలి వారోత్సవాల్లో ఏపీ వైద్య ఆరోగ్య శాఖకు అగ్రస్థానం దక్కింది. 50,080 కార్యక్రమాలతో ప్రథమ స్థానంలో నిలిచింది.
అమరావతి, నవంబర్ 16: భారత్ అధ్యక్షతన నిర్వహించిన 'బ్రిక్స్ సుస్థిర జీవనశైలి వారోత్సవాల్లో' ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. నవంబర్ 1 నుంచి 7 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఈ వారోత్సవాల్లో ప్రజల భాగస్వామ్యం, కార్యక్రమాల నిర్వహణలో వైద్య ఆరోగ్య శాఖ అద్భుత ప్రతిభ కనబరిచింది.
వైద్య, ఆరోగ్య శాఖ ప్రథమ స్థానం: రాష్ట్రంలోని 21 ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో మొత్తం 96,891 కార్యక్రమాలు నిర్వహించగా, వీటిలో 19.52 లక్షల మంది ప్రజలు భాగస్వాములయ్యారు. ఇందులో ఒక్క వైద్యారోగ్య శాఖే 50,080 కార్యక్రమాలు నిర్వహించి (మొత్తం కార్యక్రమాల్లో 32.02 శాతం) ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ శాఖ నిర్వహించిన కార్యక్రమాల్లో 6,28,151 మంది ప్రజలు పాల్గొన్నారు.
రెండు, మూడు స్థానాలు: గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ రెండో స్థానంలో నిలవగా, పర్యావరణం, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ మూడో స్థానాన్ని దక్కించుకున్నాయి. ఈ మూడు శాఖల పరిధిలోనే 13.40 లక్షల మంది ప్రజలు (మొత్తం భాగస్వాముల్లో 68.7 శాతం) పాల్గొనడం విశేషం.
లైఫ్ పోర్టల్లోనూ నంబర్ వన్: కేంద్ర ప్రభుత్వ 'మిషన్ లైఫ్' (Mission LiFE) పోర్టల్లో కార్యక్రమాల డేటా ఎంట్రీ చేయడంలోనూ ఏపీ వైద్యారోగ్య శాఖ ప్రథమ స్థానంలో నిలిచింది.
అవగాహన అంశాలు: విద్యుత్ ఆదా, నీటి పొదుపు, సుస్థిర ఆహారం, వ్యర్థాల తగ్గింపు, ఆరోగ్యకరమైన జీవనశైలిపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించారు. అలాగే ప్లాస్టిక్ వినియోగం, ఎలక్ట్రానిక్ వ్యర్థాల (E-waste) తగ్గింపుపై ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా వైద్యారోగ్య శాఖ అధికారులను మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రత్యేకంగా అభినందించారు. (AP Health Department BRICS)
మందులు, వైద్య సామగ్రి కొనుగోలుకు రూ.75 కోట్లు.. టెండర్లపై మంత్రి సత్యకుమార్ కీలక ఆదేశాలు
అమరావతి, నవంబర్ 16: రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యారోగ్య సేవలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు ఏపీ వైద్యారోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అత్యవసరమైన 31 రకాల మందులు, వైద్య సామగ్రి కొనుగోలు కోసం రూ.75 కోట్ల విలువైన ప్రతిపాదనలకు బిడ్ ఫైనలైజేషన్ కమిటీ (BFC) ఆమోదం తెలిపింది.
కొనుగోళ్ల వివరాలు: ఆమోదం పొందిన నిధులతో రెండేళ్ల అవసరాలకు సరిపడా 26 రకాల మందుల కొనుగోలుకు రూ.29 కోట్లు వెచ్చించనున్నారు. అలాగే, మరో ఐదు రకాల అత్యవసర మందులను మూడు నెలల అవసరాల నిమిత్తం రూ.15 కోట్లతో కొనుగోలు చేయనున్నారు. వీటితో పాటు రాష్ట్రంలోని 25 వేల మంది ఏఎన్ఎంలు (ANMs), ఎంఎల్హెచ్పీలకు (MLHPs) రెండుసార్లు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ముడిసరుకుల ధరల పెరుగుదల కారణంగానే మందుల ధరలు కొంత పెరిగినట్లు బిడ్ ఫైనలైజేషన్ కమిటీ వివరణ ఇచ్చింది.
పైరవీలకు లొంగవద్దని మంత్రి ఆదేశం: మందుల కొనుగోలు టెండర్ల ప్రక్రియపై వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. టెండర్ల ఖరారు విషయంలో ఎలాంటి పైరవీలు, ఒత్తిళ్లు, బెదిరింపులకు లొంగవద్దని ఆయన స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారమే అత్యంత పారదర్శకంగా టెండర్లపై నిర్ణయాలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రధాని మోదీతో సీఎం రేవంత్రెడ్డి భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ
కాళేశ్వరం ప్రాజెక్టులో గేట్లు మూసి నీటిని నిల్వ చేసే అవకాశం లేదు: మంత్రి తుమ్మల
సజ్జనార్ ఆస్తుల కొనుగోళ్లపై విచారణ జరిపించాలి: రాజాసింగ్