Share News

సీమలో ఆందోళనకరంగా భూగర్భ జలాలు

ABN , Publish Date - Nov 28 , 2026 | 05:44 AM

తీవ్ర వాయుగుండం, ‘అర్నబ్‌’, ‘మురసు’ తుఫాన్ల ప్రభావంతో కురిసిన వర్షాల వల్ల కొన్ని జిల్లాలు మినహా కోస్తాలో మిగిలిన జిల్లాల్లో భూగర్భ జలాల పరిస్థితి మెరుగుపడింది.

సీమలో ఆందోళనకరంగా భూగర్భ జలాలు

  • రాయలసీమలో 50.62 అడుగుల లోతులో

  • మార్కాపురం జిల్లాలో 77.54 అడుగుల లోతులో

  • తుఫాన్ల ప్రభావంతో వర్షాల కారణంగా కొన్ని జిల్లాలు మినహా కోస్తాలో మెరుగు

  • సగటున 25.98 అడుగుల లోతున నీరు

  • విశ్రాంత వాతావరణ అధికారి పీవీ రామారావు విశ్లేషణ

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): తీవ్ర వాయుగుండం, ‘అర్నబ్‌’, ‘మురసు’ తుఫాన్ల ప్రభావంతో కురిసిన వర్షాల వల్ల కొన్ని జిల్లాలు మినహా కోస్తాలో మిగిలిన జిల్లాల్లో భూగర్భ జలాల పరిస్థితి మెరుగుపడింది. రాయలసీమలో మాత్రం ఎటువంటి మార్పు లేదు. ఈ నెల 20వ తేదీ నాటికి రాష్ట్రంలో సగటున 33.03 అడుగులు, ప్రత్యేకించి చూస్తే కోస్తాలో 25.98, రాయలసీమలో 50.62 అడుగుల లోతున భూగర్భ జలమట్టాలు ఉన్నాయి. కోస్తాలోని మార్కాపురం జిల్లాలో సగటున 77.54 అడుగులుగా నమోదైంది. రెండు తుఫాన్లతో అతలాకుతలమైన తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లోనూ భూగర్భ జలాల పరిస్థితి మెరుగుపడలేదు.

ఎల్‌నినో ప్రభావంతో నెలకొన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో భూ గర్భ జల మట్టాలు, వర్షపాతంపై విశ్రాంత వాతావరణ అధికారి పీవీ రామారావు విశ్లేషణ చేశారు. ఎల్‌నినో ప్రభావంతో నైరుతి సీజన్‌లో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో తీవ్ర వర్షాభావం కొనసాగింది. సెప్టెంబరు నెలాఖరులో తీవ్ర వాయుగుండం ఆదుకున్నప్పటికీ నైరుతి నాలుగు నెలల సీజన్‌ ముగిసే నాటికి కోస్తాలో 21 శాతం, రాయలసీమలో 40 శాతం లోటు వర్షపాతం నమోదైంది. ఈశాన్య రుతుపవనాల ప్రవేశం తరువాత రెండు తుఫాన్లు కోస్తాంధ్రలో తీరం దాటడంతో కురిసిన విస్తారమైన వర్షాలతో కోస్తాలో వర్షపాతం లోటు ఈ నెల 20వ తేదీ నాటికి జీరోకు చేరుకుంది. రాయలసీమలో మాత్రం 43 శాతం లోటు నమోదైంది.


కోస్తాలోని ప్రకాశం జిల్లాలో 65 శాతం, నెల్లూరులో 55 శాతం లోటు నమోదైంది. విశాఖపట్నంలో ఈశాన్య రుతుపవనాల సీజన్‌లో 30 శాతం అధిక వర్షపాతం నమోదైంది. తుఫాన్లు ఏర్పడినా రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఒకే మాదిరిగా వర్షాలు కురిసే అవకాశం ఉండదని అర్నబ్‌, మురసు తుఫాన్ల ద్వారా వెల్లడైంది. ఒక తీవ్ర వాయుగుండం, రెండు తుఫాన్ల వల్ల కోస్తాంధ్రలో 34 సెం.మీ. వర్షపాతం నమోదు కాగా, రాయలసీమలో కేవలం 3.9 సెం.మీ. నమోదు కావడం గమనార్హం. విశాఖపట్నంలో నైరుతి సీజన్‌లో సగటు 51 సెం.మీ. గాను 75 సెం.మీ., ఈశాన్య రుతుపవనాల సీజన్‌లో 22 సెం.మీ.లకు గాను 42 సెం.మీ. వర్షపాతం నమోదైంది. నైరుతి సీజన్‌లో 48 శాతం, ఈశాన్య సీజన్‌లో 91 శాతం అధిక వర్షపాతం కురవడంతో విశాఖ జిల్లాలో భూగర్భ జలాలు మెరుగుపడ్డాయి. జిల్లాలో సగటు 17.45 అడుగుల లోతున నీరు ఉంది.


రెండు ప్రాంతాల్లో వైరుధ్యం

ఈశాన్య రుతుపవనాల సీజన్‌లో తుఫాన్లకు ఉత్తర/ఈశాన్యంగానే వర్షాలు కురుస్తుంటాయి. ఈ నేపథ్యంలో అర్నబ్‌, మురసు తుఫాన్ల ప్రభావంతో బాపట్ల నుంచి శ్రీకాకుళం వరకు భారీ వర్షాలు కురిశాయి. దక్షిణ, నైరుతి భాగంలో ఉన్న ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో కొద్ది వర్షమే కురిసింది. దీంతో రాయలసీమతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వర్షాభావం కొనసాగింది. అంతకు ముందు నైరుతి రుతుపవనాల సీజన్‌లో కూడా తీవ్ర దుర్భిక్షం నెలకొనడంతో ఖరీఫ్‌ సాగు దెబ్బతింది.

ఈ ఏడాది జూన్‌ నాటికి ఏపీ మొత్తం 32.93 అడుగులుగా ఉండగా, ఈ నెల 20 నాటికి 33.03 అడుగులు ఉంది. కోస్తాలో జూన్‌ నాటికి 31 అడుగులుగా నమోదు కాగా ఈ నెల 20వ తేదీ నాటికి 25.98 అడుగులు, రాయలసీమలో జూన్‌లో 37.7 అడుగులు ఉండగా ఈ నెల 20వ తేదీకి ఏకంగా 50.62 అడుగులకు పడిపోయింది. జూన్‌ వరకు పరిస్థితి మెరుగ్గా ఉన్నప్పటికీ నైరుతి సీజన్‌లో తీవ్ర కరువుతో భూగర్భ జలాలు గణనీయంగా పడిపోయాయి. ఈ నెల 20వ తేదీ నాటికి అనంతపురం జిల్లాలో 51.17 అడుగులు, శ్రీసత్యసాయి జిల్లాలో 69.58 అడుగులు, అన్నమయ్య జిల్లాలో 50.28 అడుగులు, కోస్తాంధ్రలోని మార్కాపురంలో 77.54, ప్రకాశంలో 25.1, నెల్లూరులో 21.9, ఏలూరులో 64.88, తూర్పు గోదావరి జిల్లాలో 63 అడుగులు లోతులో భూగర్భ జలాలు ఉన్నాయి. అయితే నీరు ఎంత లోతులో ఉందనే ఒక్క అంశం ఆధారంగా ఆ జిల్లాలో కరువు తీవ్రతను నిర్ణయించలేము.

భూగర్భ జలాల నాణ్యత, బావుల సామర్థ్యం, స్థానికంగా, భౌగోళికంగా ఉండే పరిస్థితులు ప్రభావం చూపుతాయి. ఎల్‌నినో రాయలసీమపై తీవ్ర ప్రభావం చూపిందని విశ్రాంత వాతావరణ అధికారి పీవీ రామారావు విశ్లేషించారు. ఖరీఫ్‌ పంటల సాగులో, కొన్ని పట్టణ ప్రాంతాల్లో తాగునీటికి ఇబ్బందులు ఉంటాయన్నారు. వచ్చే వేసవిలో భూగర్భ జలాలపై తీవ్రమైన ఒత్తిడి కొనసాగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే వచ్చే వేసవికి ముందస్తు తాగునీటి ప్రణాళిక అవసరమని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.

ఈ వార్తలనూ చదవండి:

డీలిమిటేషన్ బిల్లుతో అన్ని రాష్ట్రాలకు న్యాయం.. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు: సీఎం చంద్రబాబు

బిహార్ ఎమ్మెల్యే కూతురి పెళ్లి.. చీపుర్లతో ఊడ్చేంత డబ్బు..

Updated Date - Nov 28 , 2026 | 05:48 AM