34శాతం అమలు చేసి తీరుతాం
ABN , Publish Date - Sep 12 , 2026 | 04:25 AM
స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. వైసీపీ నేతలు రిజర్వేషన్లపై విషప్రచారం చేస్తూ బీసీలను అయోమయానికి గురిచేస్తున్నారని ఆరోపించారు.
రిజర్వేషన్లపై వైసీపీ తప్పుడు ప్రచారం
కోర్టులో కేసులు వేసి అడ్డుకునేందుకు ప్రయత్నం: పల్లా
విశాఖపట్నం, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. వైసీపీ నేతలు రిజర్వేషన్లపై విషప్రచారం చేస్తూ బీసీలను అయోమయానికి గురిచేస్తున్నారని ఆరోపించారు. శుక్రవారం నగరంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించడం వైసీపీకి ఇష్టం లేదు. అందుకే దీనిపై కోర్టులో కేసులు వేసి అడ్డుకునేందుకు యత్నిస్తోంది. బీసీలకు రక్షణ కల్పించడం, వారి రాజకీయ ప్రాతినిధ్యాన్ని కాపాడేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. బీసీలకు ప్రయోజనం కల్పించే విషయంలో కూటమి ప్రభుత్వం వెనక్కి తగ్గేది లేదు. ప్రభుత్వానికి ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక గొడ్డలి పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి కూటమి ఐక్యతను దెబ్బతీసేందుకు కుయుక్తులు పన్నుతున్నారు. టీడీపీ, జనసేన పేరిట విదేశాల్లో ఫేక్ ఖాతాలు సృష్టించి మిత్రపక్షాల మధ్య చిచ్చుపెట్టేలా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అసెంబ్లీకి రాకుండా సంతకాలు పెట్టి వెళ్లిపోతుండడంతో స్పీకర్ డిజిటల్ సంతకాలు విధానం అమలు చేశారు.
స్థానిక నాయకుల సమ్మతితోనే విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ చిన్న శ్రీనును పార్టీలోకి తీసుకున్నాం. ఎవరైనా పార్టీ సిద్ధాంతాలకు లోబడే నడుచుకోవాలి. స్థానిక ఎన్నికల విషయంలో కూటమి పార్టీల నేతలు కూర్చుని నిర్ణయం తీసుకుంటారు. జీవీఎంసీ ఎన్నికల్లో వారసులనే కాకుండా సమర్థత, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని సీట్లు కేటాయిస్తాం’ అని పల్లా తెలిపారు. విలేకరుల సమావేశంలో తూర్పు నియోజకవర్గ శాసనసభ్యుడు వెలగపూడి రామకృష్ణబాబు, విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చోడే వెంకటపట్టాభి, లొడగల కృష్ణ పాల్గొన్నారు.
ఈ వార్తలనూ చదవండి...
స్థానిక నాయకత్వం ఆమోదంతోనే చిన్న శ్రీనును పార్టీలోకి తీసుకున్నాం:
ఏపీ 2026-27 ఎక్సైజ్ పాలసీని ప్రకటించిన ఏపీ సర్కార్..