నిరంతర పర్యవేక్షణలో ధాన్యం సేకరణ
ABN , Publish Date - Oct 11 , 2026 | 03:41 AM
డిజిటల్ పర్యవేక్షణతో అక్రమాలను అరికట్టడం, మధ్యవర్తుల దోపిడీని నివారించి రైతుల ప్రయోజనాలను కాపాడటమే లక్ష్యంగా ఈ ఖరీఫ్ సీజన్ ధాన్యం సేకరణ కోసం ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.
రైతుల ప్రయోజనాలను కాపాడటమే లక్ష్యం
డిజిటల్ పర్యవేక్షణతో అక్రమాల నివారణ
ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లకు మార్గదర్శకాలు
అమరావతి, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): డిజిటల్ పర్యవేక్షణతో అక్రమాలను అరికట్టడం, మధ్యవర్తుల దోపిడీని నివారించి రైతుల ప్రయోజనాలను కాపాడటమే లక్ష్యంగా ఈ ఖరీఫ్ సీజన్ ధాన్యం సేకరణ కోసం ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. రైతులకు కనీస మద్దతు ధర చెల్లించడం, ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో పారదర్శకతను పెంచడం, మిల్లింగ్ ప్రక్రియను క్రమబద్ధీకరించడం, బ్యాంకు గ్యారెంటీలు, జరిమానాలు, నిరంతర తనిఖీలు, బ్లాక్ లిస్టింగ్ వంటి చర్యలతో దుర్వినియోగాన్ని అరికట్టాలని నిర్ణయించింది. తద్వారా నాణ్యమైన బియ్యాన్ని ప్రజా పంపిణీ వ్యవస్థకు అందించనుంది. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ శనివారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర ప్రకారం రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేయనున్నారు. 2026-27 ఖరీఫ్ సీజన్‌కు సాధారణ రకం ధాన్యం క్వింటాల్‌కు రూ.2,441, ఏ-గ్రేడ్ ధాన్యం క్వింటాల్‌కు రూ.2,461 కనీస మద్దతు ధరలుగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ, ఏపీ మార్క్‌ఫెడ్‌లు రాష్ట్రస్థాయి ధాన్యం సేకరణ సంస్థలుగా వ్యవహరిస్తాయి.
జిల్లా స్థాయిలో జాయుంట్ కలెక్టర్ల అధ్యక్షతన జిల్లా ధాన్యం సేకరణ కమిటీలను ఏర్పాటు చేసి సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. జిల్లా కలెక్టర్లు ధాన్యం సేకరణ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని సూచించింది. రైసు మిల్లుల వాస్తవ మిల్లింగ్ సామర్థ్యం, యంత్రాలు, డ్రయ్యర్లు, నిల్వ సదుపాయాలు, గతంలో బియ్యం సరఫరా చేసిన పనితీరును పరిశీలించి ఈ సీజన్‌లో ధాన్యాన్ని కేటాయించాలని పేర్కొంది. ప్రతి మిల్లుకు దాని మిల్లింగ్ సామర్థ్యంలో గరిష్ఠంగా 75 శాతం వరకు ధాన్యాన్ని కేటాయించాలని నిర్దేశించింది. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు.. ధాన్యం సేకరణ సజావుగా జరగడానికి మిల్లర్లు నాణ్యమైన, ఒకసారి ఉపయోగించిన గోనె సంచులను ముందుగానే అందించాలి.
కేటాయించిన ధాన్యంలో కనీసం 30 శాతం లక్ష్యానికి సరిపడా గోనె సంచులను సంబంధిత రైతు సేవా కేంద్రాల్లో ముందుగా సిద్ధం చేయాలి. గోనె సంచులను సకాలంలో సరఫరా చేయని మిల్లులకు ధాన్యం కేటాయింపు తగ్గించడంతో పాటు అవసరమైతే మిల్లింగ్ కార్యకలాపాల నుంచి తప్పించేందుకు చర్యలు తీసుకుంటారు. ధాన్యం కేటాయించే ముందు మిల్లర్లు తప్పనిసరిగా ఈ-బ్యాంక్ గ్యారెంటీలు సమర్పించి ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవాలి. గతంలో ప్రభుత్వ ధాన్యం లేదా బియ్యం బకాయిలు ఉన్న మిల్లులను ఆ బకాయిలు, జరిమానాలు చెల్లించేవరకు సీఎంఆర్ కార్యకలాపాల్లోకి అనుమతించరు. మిల్లుల విద్యుత్తు వినియోగా న్ని పర్యవేక్షించడం, ధాన్యం, బియ్యం రవాణా వాహనాల ను జీపీఎస్ ద్వారా ట్రాక్ చేయడం, మిల్లర్లు ధాన్యం కొనుగోలు, ఉత్పత్తి, విక్రయాలు, నిల్వలకు సంబంధించిన ఏ, బీ రిజిష్టర్లను నిర్వహించి ప్రతిరోజూ ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేసేలా అధికార యంత్రాంగం నిరంతరం పర్యవేక్షించాలి.
పీడీఎస్ బియ్యం రీ సైక్లింగ్‌కు పాల్పడే మిల్లులపై కఠిన చర్యలు తీసుకుంటారు. ధాన్యం సేకరణ నుంచి బియ్యం సరఫరా వరకు మొత్తం ప్రక్రియను జిల్లా కలెక్టర్లు, పౌరసరఫరాల అధికారులు, సంబంధిత తనిఖీ బృందాలు నిరంతరం పర్యవేక్షించాలని ప్రభుత్వం ఆదేశించింది.
ఈ వార్తలనూ చదవండి:
ఎవరు అడ్డొచ్చినా నెట్టుకుంటూ పోతాం
దసరాలోపు 2వ విడత తల్లికి వందనం..!