పునర్నిర్మాణానికి 3 సూత్రాలు
ABN , Publish Date - Oct 07 , 2026 | 04:04 AM
‘ప్రతి కుటుంబానికీ భరోసా.. ప్రతి వర్గానికీ అండ.. ప్రతి ప్రాంతానికీ అవకాశం’ నినాదంతో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం జోరు పెంచింది. ఛిన్నాభిన్నమైన వ్యవస్థలను రెండేళ్ల పాలనలో చక్కదిద్దింది. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన...
సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన
పంట నుంచి ప్రపంచ మార్కెట్ వరకూ ‘హబ్’
రహదారులు, ప్రతి ఇంటికీ కుళాయితో గ్రామాల్లో వెలుగులు
కేంద్ర సహకారం, పవన్ కల్యాణ్ సమన్వయంతో వేల కోట్ల ప్రాజెక్టులు
ఏడు రోజులు.. తొమ్మిది కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
‘ప్రతి కుటుంబానికీ భరోసా.. ప్రతి వర్గానికీ అండ.. ప్రతి ప్రాంతానికీ అవకాశం’ నినాదంతో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం జోరు పెంచింది. ఛిన్నాభిన్నమైన వ్యవస్థలను రెండేళ్ల పాలనలో చక్కదిద్దింది. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన... త్రి సూత్ర ఆచరణతో రాష్ట్ర పునర్నిర్మాణ యజ్ఞంలో కీలక అడుగులు వేసింది. ప్రజల తక్షణ అవసరాలను తీర్చడానికి సంక్షేమ పథకాలతోపాటు, దీర్ఘకాలంలో వారి జీవన ప్రమాణాలు పెంచే కార్యక్రమాలనూ అమ లు చేస్తోంది. కేంద్ర సహకారం, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పొరపొచ్చాలకు ఆస్కారమివ్వని సమన్వయం తోడుకాగా... గత వారం రోజుల్లో 9కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అనేక భారీ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించారు. పింఛన్ నుంచి పట్టా వరకు... పంట నుంచి ప్రపంచ మార్కెట్ వరకు... పల్లెల్లో రహదారుల నుంచి ప్రతి ఇంటికీ తాగునీటి వరకు... ప్రజల జీవన ప్రమాణాలు పెంచే కార్యక్రమాలను కేంద్ర మంత్రులు, కూటమి సహచరులతో కలసి ప్రారంభించారు.
సమతుల్యతతో.. సంక్షేమం, అభివృద్ధి
పేద కుటుంబానికి 1న పింఛన్ అందాలి. నివసిస్తున్న ఇంటిపై శాశ్వత హక్కు ఉండాలి. ఇంటి ముందు రోడ్డు, ఇంటిలో తాగునీరు ఉండాలి. రైతు పండించిన పంటకు మార్కెట్, యువత నేర్చుకున్న నైపుణ్యానికి ఉపాధి అవకాశాలు దొరకాలి. ప్రభుత్వ కార్యాలయంలో ప్రజల పని సకాలంలో జరగాలి. ఆదిశగా వారం రోజులుగా ప్రణాళికాబద్ధంగా కార్యక్రమాలను నిర్వహించింది.
ఉద్యోగి నైపుణ్యం
పథకాలు ప్రజలకు సమర్థంగా చేరాలంటే వాటిని అమలు చేసే పరిపాలనా వ్యవస్థకు సామర్థ్యం అవసరం. అందుకు రూపొందించిన శిక్షణా కార్యక్రమాల సమాహారమే ‘ఐగాట్ - కర్మయోగి’. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు ఇప్పటికే 2కోట్ల కోర్సులు పూర్తి చేసుకున్నారు. నేర్చుకున్న అంశాలు కార్యాలయ పనితీరులో ప్రతిఫలిస్తే ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది.
స్వచ్ఛతకు ప్రోత్సాహం
గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛాంధ్ర-2026 అవార్డులను అందించింది. 22 విభాగాల్లో 91 రాష్ట్రస్థాయి, 1906 జిల్లా స్థాయి అవార్డులు అందించారు. ప్రజల భాగస్వామ్యంతో పరిశుభ్రతను నిరంతర ఆచరణగా మార్చాలన్నది ప్రభుత్వ లక్ష్యం.
పాన్ ఐఐటీ సదస్సులో...
విజయవాడలో నిర్వహించిన పాన్ ఐఐటీ ఏపీ-2026 సదస్సు... విజన్, ఆవిష్కరణలు, యువత అవకాశాలను అనుసంధానించే కార్యక్రమంగా నిలిచింది. 23 ఐఐటీల డైరెక్టర్లు, 50 మందికి పైగా పరిశ్రమల అధిపతులు-సీఈఓలు, 100 మంది వెంచర్ క్యాపిటలిస్టులు-ఇన్వెస్టర్లు హాజరయ్యారు. ప్రముఖ విద్యాసంస్థల మేధోసంపత్తి, గ్లోబల్ ఐఐటీ నెట్‌వర్క్‌ను రాష్ట్ర అభివృద్ధి, డీప్ టెక్ విస్తరణకు అనుసంధానించడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం. అమరావతి డిక్లరేషన్ ద్వారా పాన్ ఐఐటీ అలుమ్ని భాగస్వామ్యంతో అమరావతిలో శాశ్వత కౌన్సిల్ ఏర్పాటుకు నిర్ణయించారు. ల్యాబ్ టు మార్కెట్... విద్యాసంస్థల పరిశోధనలను పరిశ్రమలు, ఇన్వెస్టర్లతో అనుసంధానించి, వాటిని వాణిజ్య ఉత్పత్తులుగా మార్చడానికి రూ.500 కోట్ల వెంచర్ ఫండ్ ఏర్పాటు కీలకమైనది. ఈ సందర్భంగా 2027 ఫిబ్రవరి నుంచి అమరావతిలో క్వాంటం కంప్యూటర్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని సీఎం ప్రకటించారు.
హెల్తీ వెల్తీ హ్యాపీ ఏపీ
సంక్షేమ కార్యక్రమాలు, స్థిర ఆదాయ మార్గాలను అందించే అభివృద్ధి పథకాలు, మెరుగైన జీవన సౌకర్యాలు... అన్నింటిలోనూ అంతఃసూత్రం... ప్రతి కుటుంబం భద్రంగా, గౌరవంగా, మెరుగైన ఆదాయంతో జీవించేలా చూడడం. అది సాధ్యమైనప్పుడే సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన... లక్ష్యాలకు పూర్తి సార్థకత చేకూరుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. అప్పుడే హెల్తీ వెల్తీ హ్యాపీ ఏపీకి అది మార్గం సుగమమవుతుంది.
3 లక్షల ఇళ్లకు భూమిపూజ
2029 నాటికి రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సొంత ఇల్లు... అందుకు 19 లక్షల ఇళ్ల నిర్మాణం అన్నది ప్రభుత్వ లక్ష్యం. అందులో భాగంగా తాజాగా 3లక్షల ఇళ్లకు భూమిపూజ చేశారు. తెనాలిలో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో కలసి సీఎం పాల్గొన్నారు.
గ్రామాల్లో మళ్లీ వెలుగులు
‘పల్లె పండుగ’ పేరుతో రూ.11,085 కోట్లతో గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు శ్రీకారం చుట్టింది. ఉదయగిరిలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కలసి ఈ పనులు ప్రారంభించారు. 15,500 కి.మీటర్ల బీటీ, సీసీ రోడ్లు, 22,000 మినీ గోకులాలు, పశుగ్రాసానికి హరిత గోపాలం, 1,000 కి.మీ.మ్యాజిక్ డ్రైన్లు, బస్‌షెల్టర్లు, పంచాయతీ భవనాల నిర్మాణం, ఉద్యాన పంటల పెంపకానికి ప్రోత్సాహం వంటి అంశాలు దీనిలో ఉన్నాయి. రహదారి మార్కెట్‌ను రైతుకు చేరువచేస్తే... విద్యార్థికి పాఠశాల ప్రయాణాన్ని సులభం చేస్తుంది... అత్యవసర వేళ వేగంగా వైద్య సహాయం అందడానికి మార్గం సుగమమవుతుంది.
7 రోజులు.. 9 కార్యక్రమాలు
సెప్టెంబరు 29న ప్రభుత్వ ఉద్యోగుల కెపాసిటీ బిల్డింగ్ కోసం కర్మయోగి కార్యక్రమం
సెప్టెంబరు 29న గ్రామాల్లో వెలుగులు నింపే పల్లెపండుగ 3.0
సెప్టెంబరు 30న పేదలకు శాశ్వత హక్కులు కల్పించేలా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం పేదలకు పట్టాభిషేకం
అక్టోబరు 1న పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం
అక్టోబరు 2న రాయలసీమ దశదిశను మార్చే గ్లోబల్ హార్టికల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్‌కు శ్రీకారం
అక్టోబరు 2న స్వచ్ఛత ప్రాధాన్యతను చాటాలే స్వచ్ఛాంధ్ర అవార్డుల పంపిణీ
అక్టోబరు 3న టెక్నాలజీని అందిపుచ్చుకోవడానికి బెస్ట్ ప్రాక్టీసెస్, ఇన్నోవేషన్ కోసం పాన్ ఐఐటీ సదస్సు
అక్టోబరు 4న రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలన్న లక్ష్యంలో భాగంగా 3 లక్షల ఇళ్లకు శంకుస్థాపన
అక్టోబరు 5న జల్‌జీవన్ మిషన్ 2.0లో భాగంగా అమరజీవి జలధార కార్యక్రమం ప్రారంభం
హార్టికల్చర్ హబ్‌తో సీమలో సిరులు
‘రాయలసీమలో కరువు పరిస్థితులను అధిగమించాలి. రైతులకు స్థిరమైన రాబడి కల్పించి తలసరి ఆదాయాన్ని పెంచాలి...’ ఈ ఆలోచనకు ఆచరణాత్మక రూపమే గ్లోబల్ హార్టికల్చర్ హబ్. సంవత్సర కాలంగా నిర్విరామంగా చేస్తున్న కృషి ఫలించి, సీమను ‘ఫ్రూట్ బౌల్ ఆఫ్ ది వరల్డ్’గా తీర్చిదిద్దడానికి మార్గం ఏర్పడింది. రూ.లక్ష కోట్ల ప్రణాళికతో రూపకల్పన చేసిన ఈ హబ్ పనులను మదనపల్లెలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌తో కలసి సీఎం, డిప్యూటీ సీఎం ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వ నుంచి రూ.40 వేల కోట్లు, ప్రైవేటు పెట్టుబడుల ద్వారా మరో రూ.60 వేల కోట్లు సమీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. రాయలసీమలోని ఎనిమిది, ఉమ్మడి ప్రకాశం పరిధిలోని రెండు జిల్లాలు... మొత్తం 10 జిల్లాల్లో దీన్ని అమలు చేయనున్నారు. దీనితో 9.6 లక్షల మంది రైతులకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూరుతుంది. 49 లక్షల కుటుంబాలకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నది దీని లక్ష్యం. ఇదే కార్యక్రమంలో రిలయన్స్ సహకారంతో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్(ఐఎస్ఏ)కి శంకుస్థాపన జరగడం శుభపరిణామం.
పింఛన్‌తో రోజువారీ భరోసా... పట్టాతో జీవితకాల భద్రత
ఎన్టీఆర్ భరోసా పథకం కింద 28వ విడత పింఛన్ల పంపిణీలో సీఎం పాల్గొన్నారు. పింఛన్ల కోసం ఇప్పటి వరకు రూ.76 వేల కోట్లు పంపిణీ చేశారు. వృద్థులు, దివ్యాంగులు, ఇతర అర్హులైన లబ్ధిదారులకు ఈ సహాయం... వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి తోడ్పడుతోంది. ‘పేదల సేవలో’ కార్యక్రమం లబ్ధిదారులను నేరుగా కలుసుకోవడానికి, వారి పరిస్థితులను తెలుసుకోవడానికి ఉపయుక్తం. ఇది పాలనను, క్షేత్రస్థాయికి అనుసంధానించడానికి దోహదపడుతోంది. దశాబ్దాలుగా ప్రభుత్వ స్థలాల్లో ఎలాంటి ఆస్తి హక్కూ లేకుండా నివసిస్తున్న పేద కుటుంబాలు ఎన్నో. వారికి స్థిరమైన నివాస హక్కును కల్పించడమే లక్ష్యంగా ‘పేదలకు పట్టాభిషేకం’ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. విజయవాడ, విశాఖపట్నంలోని పలు నియోజకవర్గాలు, మంగళగిరిలో మొత్తం 60,646 మంది పేదలకు పట్టాలు ఇచ్చారు. వారి ఆత్మగౌరవానికి పట్టాభిషేకం చేశారు. మూడు చోట్లా కలిపి వాటి మార్కెట్ విలువ రూ.52,000 కోట్లు. పట్టాతో ఆ నిరుపేద కుటుంబాలకు తమ నివాసంపై నమ్మకం, రేపటి గురించి స్థిరమైన ఆలోచన ఏర్పడింది. పింఛన్ నేటి అవసరానికి అండగా ఉంటే, పట్టా భవిష్యత్ భద్రతకు పునాది వేస్తుంది.
జల్ జీవన్‌కు ప్రాణం పోశారు
గత ప్రభుత్వం కేంద్ర పథకాలనన్నింటినీ నిర్వీర్యం చేసింది. ముఖ్యంగా ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు ఇచ్చే జల్ జీవన్ మిషన్‌ను పూర్తిగా విస్మరించింది. అన్ని రాష్ర్టాలు రూ.లక్షల కోట్ల పనులు చేస్తే గత ప్రభుత్వం కేవలం రూ.2,600 కోట్ల పనులకే పరిమితం చేసింది. కేంద్రం సహకారంతో కూటమి ప్రభుత్వం రూ.30,156 కోట్లతో ప్రతి గడపకూ సురక్షితమైన తాగు నీరు అందించే లక్ష్యంతో ‘అమరజీవి జలధార’కు అంకురార్పణ చేసింది. కొత్తగా మరో 27 లక్షల గ్రామీణ కుటుంబాలకు ఇంటి కుళాయి కనెక్షను అందించడమే లక్ష్యం.
ఈ వార్తలనూ చదవండి..
అమరావతి పనుల్లో వేగం పెంచాలి.. ప్రతి నెల రూ. 2వేల కోట్ల పనులు పూర్తి చేయాలి: సీఎం
స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పోటీ చేసే స్థానాలు ఖరారు..!