ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు.. వరుసగా 4 రోజులు సెలవులు
ABN , Publish Date - Oct 16 , 2026 | 08:47 PM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. ఎన్నికల విధుల్లో లేని ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా నాలుగు రోజుల పాటు సెలవులు వచ్చేలా కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
అమరావతి, అక్టోబర్ 16: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. ఎన్నికల విధుల్లో లేని ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా నాలుగు రోజుల పాటు సెలవులు వచ్చేలా కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. శని, ఆదివారాలు సాధారణ సెలవులు కాగా.. సోమవారాన్ని కూడా సెలవు రోజుగా ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి తోడు మంగళవారం దసరా సెలవు ఉండటంతో ఉద్యోగులకు వరుసగా నాలుగు రోజుల పాటు సెలవులు లభించనున్నాయి. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులతో కలిసి సమయం గడిపేందుకు.. వ్యక్తిగత పనులను పూర్తి చేసుకునేందుకు అవకాశం లభించనుంది. ఈ నిర్ణయంతో ఉద్యోగుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు విద్యాసాగర్, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రామకృష్ణ చేసిన విజ్ఞప్తుల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సోమవారాన్ని సెలవు రోజుగా ప్రకటించడంతో పాటు.. ఆ రోజుకు బదులుగా నవంబర్ 14వ తేదీని పనిదినంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ (GAD) నుంచి అధికారిక ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. అయితే ఈ సెలవులు ఎన్నికల విధుల్లో లేని ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే వర్తించనున్నాయి. ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత సెలవులకు సంబంధించిన పూర్తి వివరాలపై స్పష్టత రానుంది. వరుసగా నాలుగు రోజుల సెలవులు లభించనున్నాయన్న సమాచారంతో ఉద్యోగుల్లో ఆసక్తి నెలకొంది.
ఈ వార్తలు కూడా చదవండి..
రాజకీయ ప్రమేయం లేకుండా రిజర్వేషన్లు.. అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం: మంత్రి నారాయణ
స్థానిక ఎన్నికల్లో అభ్యర్థులు కూడా దొరకని దిక్కుతోచని స్థితిలో గొడ్డలి పార్టీ: మంత్రి కొల్లు రవీంద్ర
ఏపీకి భారీగా పెట్టుబడులు.. త్వరలో మూడు ప్రాంతాల్లో సదస్సులు
Read Latest AP News And Telangana News