Share News

చెల్లింపులపైనా ఏడుపులేనా!?

ABN , Publish Date - Nov 18 , 2026 | 03:40 AM

లెక్కలన్నీ కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్నా... ప్రభుత్వం ఎప్పటికప్పుడు వివరాలు ప్రకటిస్తున్నా ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై వైసీపీ అబద్ధాలు ఆగడంలేదు. జగన్‌ గద్దె దిగేనాటికి...

చెల్లింపులపైనా ఏడుపులేనా!?

  • విద్యార్థుల ఫీజులతో వైసీపీ రాజకీయం

  • నాడు రీయింబర్స్‌మెంట్‌ విధానం మార్చిన జగన్‌

  • కాలేజీలను కాదని తల్లుల ఖాతాల్లోకి

  • బటన్‌ నొక్కినా జమ కాని నిధులు

  • నేడు క్రమం తప్పకుండా ఇస్తున్న ప్రభుత్వం

  • విద్యార్థితో సంబంధం లేకుండా కళాశాలలకే

  • ప్రతి నెలా రూ.250 కోట్ల చొప్పున విడుదల

  • రెండున్నరేళ్లలో రూ.4,962 కోట్లు చెల్లింపు

  • 2025-26లో ఒక్క త్రైమాసికమే పెండింగ్‌

  • అయినా.. బకాయిలంటూ వైసీపీ రగడ

  • జగన్‌ హయాంలో 3,828 కోట్ల బకాయిలు

  • జగన్‌ పత్రిక రాతలను ఖండించిన కాలేజీలు

విద్యార్థుల ఫీజులపై వైసీపీ గగ్గోలు పెడుతోంది. సకాలంలో రీయింబర్స్‌మెంటు చేయడం లేదని రాజకీయం చేస్తోంది. కానీ, తమ హయాంలో జరిగిన తతంగాన్ని, విద్యార్థులు పడిన ఇబ్బందులను జగన్‌ మరిచిపోయినట్టున్నారని అధికార పార్టీ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వం క్రమం తప్పకుండా ఫీజులు చెల్లిస్తున్నా.. ఇవ్వడం లేదని విమర్శల ‘రాజకీయం’ చేస్తుండడాన్ని తిప్పికొడుతున్నారు.

(అమరావతి - ఆంధ్రజ్యోతి): లెక్కలన్నీ కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్నా... ప్రభుత్వం ఎప్పటికప్పుడు వివరాలు ప్రకటిస్తున్నా ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై వైసీపీ అబద్ధాలు ఆగడంలేదు. జగన్‌ గద్దె దిగేనాటికి రూ.3,828 కోట్ల మేరకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు పేరుకుపోయాయి. ఆ బకాయిలను కూటమి ప్రభుత్వమే తీర్చింది.

రెండున్నరేళ్లలో ప్రభుత్వం మొత్తంగా రూ.4,962 కోట్లు విడుదల చేసింది. 2024-25లో రూ.1451 కోట్లు, 2025-26లో రూ.1665 కోట్లు, 2026-27లో ఇప్పటివరకు రూ.1846 కోట్లు ఇచ్చింది. గత జగన్‌ పాలనలో ఏడాదిలో 4 విడతలు ఫీజులు విడుదల చేయగా... ఇప్పుడు ప్రతినెలా రూ.250 కోట్లు చొప్పున విడుదల చేస్తున్నారు. ఇలా క్రమం తప్పకుండా చేస్తున్నప్పటికీ రూ.9,600 కోట్లు బకాయిలు పెట్టారని జగన్‌ తప్పుడు ఆరోపణలు చేయడంపై అధికార పార్టీ నేతలు మండిపడుతున్నారు.


జగన్‌ హయాంలోనే అస్తవ్యస్తం!

ఫీజుల చెల్లించాలని కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి చేయకూడదనే ఉద్దేశంతో నేరుగా కాలేజీల ఖాతాల్లోనే ప్రభుత్వాలు నిధులు జమ చేసేవి. జగన్‌ అధికారంలోకి వచ్చాక ఆ విధానాన్ని మార్చేశారు. రీయింబర్స్‌మెంటు నిధులను విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి జమచేశారు. ఎప్పుడూ త్రైమాసికం ముగిసిన వెంటనే ఫీజులు విడుదల చేయలేదు.

ప్రతిసారీ కనీసం రెండు మూడు క్వార్టర్ల ఫీజులు బకాయి ఉండేవి. కానీ, కాలేజీ యాజమాన్యాలు మాత్రం రీయింబర్స్‌మెంటు సొమ్ము తల్లిదండ్రుల ఖాతాల్లో జమ అవుతాయి కాబట్టి... ప్రభుత్వం ఎప్పుడు ఇచ్చినా తమకు మాత్రం సకాలంలో కట్టాలని ముందుగానే వసూలు చేసుకునేవి. ఇలా దాదాపు తల్లిదండ్రులంతా ప్రభుత్వం నుంచి ఫీజులు విడుదల కాకముందే కాలేజీలకు సొంత డబ్బులు చెల్లించక తప్పేది కాదు.

మరోవైపు... గత ప్రభుత్వంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధుల విడుదలకు కూడా భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసి జగన్‌ బటన్‌ నొక్కేవారు. చాలాసార్లు బటన్‌ నొక్కిన నెలరోజులకు కూడా తల్లుల ఖాతాల్లోకి ఫీజులు జమయ్యేవి కావు. కానీ, బటన్‌ నొక్కిన వెంటనే కాలేజీలు మాత్రం విద్యార్థుల నుంచి ముక్కుపిండి ఫీజులు వసూలు చేసేవి.

ఈ ప్రభుత్వంలో...

ప్రస్తుత ప్రభుత్వం తల్లుల ఖాతాల్లోకి ఫీజులు జమచేయడం వల్ల కాలేజీలు విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నాయని గ్రహించి... కళాశాలల ఖాతాల్లోనే జమచేసే పాత విధానం ప్రవేశపెట్టింది. దీంతో ఫీజుల విషయంపై కాలేజీలు విద్యార్థులను అడిగే ఆస్కారమే లేదు. గత ప్రభుత్వం సకాలంలో ఫీజులు ఇవ్వనందున ఫీజు కట్టలేదనే కారణంతో కాలేజీలు సర్టిఫికెట్లు నిలిపివేసివి. ఇప్పుడు ఆ పరిస్థితి తలెత్తకుండా విద్యా సంవత్సరం చివర్లో ఫైనలియర్‌ విద్యార్థుల వరకు మొత్తం ఫీజులను ప్రభుత్వం చెల్లిస్తోంది.


పీజీకి రద్దు చేసింది జగనే..

గతంలో పీజీ కోర్సులు చదివిన వారికి కూడా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం అమల్లో ఉండేది. అయితే, ఆ కోర్సులకు జగన్‌ ప్రభుత్వం పథకాన్ని నిలిపివేసింది. యూనివర్సిటీ కాలేజీల్లో పీజీ చదివే విద్యార్థులకు మాత్రమే పథకం అమలయ్యేలా నిబంధనలు మార్చింది. ఫలితంగా రాష్ట్రంలో పీజీ చదివేవారి సంఖ్య తగ్గిపోయింది. విద్యార్థులకు ‘వసతి దీవెన’ పథకం కింద ఏడాదికి రూ.20 వేలు ఇస్తామని ప్రకటించిన జగన్‌ చివరికి రూ.10 వేలతో సరిపెట్టడం గమనార్హం.

వైసీపీ అధికారం ముగిసే సమయానికి మూడు క్వార్టర్ల ఫీజులు పెండింగ్‌లో ఉంచింది. కానీ, తమ ప్రభుత్వంలో ప్రతి క్వార్టర్‌కు సకాలంలోనే ఫీజులు చెల్లించామని జగన్‌ జంకులేకుండా చెబుతున్నారు. అదే నిజమైతే... ఆయన దిగిపోయే నాటికి ఉన్న బకాయిలు ఎవరివి? వైసీపీ హయాంలో రూ.3,828 కోట్లు బకాయిల లెక్కలు చూపిస్తున్నా బుకాయించడమేమిటి?

ఇటీవల చిత్తూరు జిల్లాలో ఓ ఇంజనీరింగ్‌ విద్యార్థి ఆత్మహత్యాయత్నం ఘటనను ఫీజుల వైపు మళ్లించిన జగన్‌.. దానికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ కారణమంటూ విమర్శించారు. దీనిపై లోకేశ్‌ వాస్తవాలతో ఫ్యాక్ట్‌ చెక్‌ విడుదల చేసి గట్టి జవాబిచ్చారు.

ఈ వార్తలనూ చదవండి:

పరీక్షల పరేషాన్‌

అక్వాన్ తుపానుపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు

Updated Date - Nov 18 , 2026 | 03:49 AM