Share News

పూర్తి నగదు రహిత వైద్యం కావాలి

ABN , Publish Date - Sep 18 , 2026 | 04:17 AM

ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు ఎంప్లాయిస్‌ హెల్త్‌ స్కీం (ఈహెచ్‌ఎస్) కింద ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో పూర్తి స్థాయిలో నగదు రహిత వైద్య సేవలు అందేలా తక్షణం చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు కోరాయి. వైద్యారోగ్యశాఖ కార్యదర్శి వీరపాండ్యన్‌ గురువారం అమరావతి సచివాలయంలో జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌లోని సంఘాలతో సమావేశం నిర్వహించారు.

పూర్తి నగదు రహిత వైద్యం కావాలి

  • ఈహెచ్‌ఎస్‌ కింద తక్షణ చర్యలు తీసుకోవాలి

  • వైద్యారోగ్యశాఖ కార్యదర్శితో సమావేశంలో ఉద్యోగ సంఘాల నేతల వెల్లడి

అమరావతి, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు ఎంప్లాయిస్‌ హెల్త్‌ స్కీం (ఈహెచ్‌ఎస్) కింద ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో పూర్తి స్థాయిలో నగదు రహిత వైద్య సేవలు అందేలా తక్షణం చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు కోరాయి. వైద్యారోగ్యశాఖ కార్యదర్శి వీరపాండ్యన్‌ గురువారం అమరావతి సచివాలయంలో జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌లోని సంఘాలతో సమావేశం నిర్వహించారు. హెల్త్‌కార్డుల అంశంలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. ఉద్యోగులు తమ కుటుంబ వైద్య అవసరాల కోసం ప్రతి నెలా జీతాల నుంచి చందా చెల్లిస్తున్నప్పటికీ, అవసరమైన సమయంలో పూర్తి స్థాయి వైద్య సేవలు అందడం లేదని, సొంతంగా లక్షలు ఖర్చు చేసినప్పటికీ.. అవి పూర్తిగా తిరిగి రాక ఇబ్బందులు పడుతున్నారనే అంశాన్ని సంఘాల నేతలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. చందాలను నేరుగా ట్రస్టుకు జమ చేసే అంశంపై ఇచ్చిన హామీని హెల్త్‌ సెక్రటరీకి గుర్తుచేశారు. మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ పరిమితి రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచాలని కోరారు. హెల్త్‌కార్డులు లేనివారికి వెంటనే మంజూరు చేయాలని, హైదరాబాద్‌లోని ప్రముఖ ఆస్పత్రుల్లో ఈహెచ్‌ఎస్‌పై వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని, రిటైర్డ్‌ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పెన్షన్‌ పొందే ఎస్‌టీవో నుంచి మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ దరఖాస్తు చేసుకునేందుకు మార్గదర్శకాలు జారీచేయాలని కోరారు.


ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తోంది

ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తోందని, హెల్త్‌కార్డుల వ్యవస్థను సమర్థవంతంగా మార్చేందుకు సమగ్ర చర్యలు చేపట్టాలని కోరినట్లు ఏపీ జేఏసీ చైర్మన్‌, ఏపీఎన్జీజీవో రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్‌ తెలిపారు. అక్టోబరు 1నుంచి నిధులు అందుబాటులోకి రానున్న నేపథ్యంలో పెండిండ్‌ బిల్లుల చెల్లింపులు, హెల్త్‌ కార్డుల సీలింగ్‌ పెంపు వంటి అంశాలపై చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. వైద్యారోగ్యశాఖలోని వివిధ కేడర్ల పదోన్నతులు, ల్యాబ్‌ టెక్నిషియన్‌ గ్రేడ్‌ అప్‌గ్రేడేషన్‌ తదితర 32 ప్రధాన డిమాండ్లపై అధికారులతో ఫలప్రదమైన చర్చలు జరిగాయని తెలిపారు. డైరెక్టర్‌ ఆఫ్‌ సెకండరీ హెల్త్‌ పరిధిలో 2014కు ముందు నియమితులైన ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రక్రియ ఇప్పటికే పూర్తయిందని, 2014 తర్వాత నియమితులై క్రమబద్ధీకరణ కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగుల సమస్యలను కూడా పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరామన్నారు. అన్ని కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో అన్ని ప్రొసీజర్స్‌ను అనుమతించేలా చూడాలని కోరామని ఏపీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు హృదయరాజు తెలిపారు. ఈహెచ్‌ఎస్‌ పూర్తిస్థాయి అమలుకు తక్షణమే అఫీషియల్‌ కమిటీ సమావేశం నిర్వహించాలని కోరినట్లు ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు చెప్పారు. ఉద్యోగులకు హెల్త్‌కార్డుల ద్వారా లేదా ఇన్సూరెన్స్‌ విధానంలో పూర్తి స్థాయిలో నగదు రహిత వైద్య సేవలు అందేలా చూడాలని, పదవీ విరమణ చేసిన సీపీఎస్‌ ఉద్యోగులకు తక్షణమే హెల్త్‌కార్డులు మంజూరు చేయాలని, సచివాలయంలోని ప్రభుత్వ డిస్పెన్సరీని ఆధునికీకరించాలని కోరామని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గొలిమి రామకృష్ణ తెలిపారు.

ఈ వార్తలనూ చదవండి:

భలే మంచి బేరం !

బీజేపీది ద్వంద్వ వైఖరి: బొత్స

Updated Date - Sep 18 , 2026 | 04:17 AM