అవన్నీ వదంతులే.. యూపీఐపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వ వర్గాలు
ABN , Publish Date - Sep 17 , 2026 | 07:56 PM
ఎమ్‌డీఆర్ చార్జీలపై జీఎస్టీని వ్యాపారులు భరించాలంటూ వస్తున్న వార్తలన్నీ ప్రభుత్వ వర్గాలు తాజాగా ఖండించాయి. ఎమ్‌డీఆర్‌పై జీఎస్టీని ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ రూపంలో రాబట్టుకోవచ్చని పేర్కొన్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: రెండు వేలకు పైబడిన మర్చెంట్ యూపీఐ లావాదేవీలపై ఎమ్‌డీఆర్ చార్జీలు విధించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే నెల నుంచి ఈ చార్జీలు అమల్లోకి రానున్నాయి. అయితే, ఎమ్‌డీఆర్ చార్జీలపై జీఎస్టీని వ్యాపారులు భరించాలంటూ వస్తున్న వార్తలను ప్రభుత్వ వర్గాలు తాజాగా ఖండించాయి. ఎమ్‌డీఆర్‌పై జీఎస్టీని ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ రూపంలో రాబట్టుకోవచ్చని పేర్కొన్నాయి.
‘యూపీఐపై జీఎస్టీ అనేది వదంతి మాత్రమే. దాన్ని ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ రూపంలో రాబట్టుకోవచ్చు. ఏదైనా సమస్య తలెత్తితే జీఎస్టీ మండలి దృష్టిసారిస్తుంది’ అని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఎమ్‌డీఆర్ విధింపుతో నగదు లావాదేవీలు పెరుగుతాయని కూడా ప్రభుత్వం భావించట్లేదని సమాచారం. యూపీఐ లావాదేవీలు తగ్గవని కూడా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
కొత్త రూల్స్ ప్రకారం, అక్టోబర్ 15 నుంచి రూ.2 వేలకు పైబడిన యూపీఐ మర్చెంట్ లావాదేవీలపై 0.4 శాతం ఎమ్‌డీఆర్ చార్జీని విధించనున్నారు. అయితే, ఒక్కో లావాదేవీపై ఎమ్‌డీఆర్ చార్జీ గరిష్ఠంగా రూ.300లు మాత్రమే ఉండాలి. ఇక రైల్వే, టెలికమ్, ఇన్సూరెన్స్, ఇంధనం వంటి లావాదేవీల్లో ఒక్కో ట్రాన్సాక్షన్‌కు రూ.5 చొప్పున ఎమ్‌డీఆర్ విధిస్తారు. ఇక ఈ వ్యవస్థలో లొసుగులకు చెక్ పెట్టేందుకు కేంద్రం పేమెంట్ అగ్రిగేటర్‌లతో కూడా సంప్రదింపులు జరుపుతోంది. ఇదిలా ఉంటే ఎమ్‌డీఆర్‌పై జీఎస్టీతో (18 శాతం) ఏటా రూ.4 వేల కోట్ల వరకూ ప్రభుత్వానికి నిధులు సమకూరే అవకాశం ఉందని ఏఎమ్ఆర్‌జీ గ్లోబల్ సంస్థ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. రిజిస్టర్డ్ వాణిజ్య సంస్థలకు మాత్రం ఐటీసీ వల్ల జీఎస్టీ భారం కొంత వరకూ తగ్గుతుందని అన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
స్వల్ప లాభాలతో ముగిసిన నిఫ్టీ.. ఒడిదుడుకుల్లో సెన్సెక్స్
యూపీఐ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయినా డబ్బులు కట్ అయ్యాయా? ఇలా చేయండి