పవన్ చెప్పినా.. రాజీనామాకు నో!
ABN , Publish Date - Nov 25 , 2026 | 03:54 AM
తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మున్సిపల్ వైస్‌చైర్మన్ ఎన్నికలో కూటమి పార్టీల మధ్య ఏర్పడిన వివాదం కొనసాగుతోంది.
మొండికేసిన నిడదవోలు జనసేన నేత కల్యాణ్ చక్రవర్తి
మున్సిపల్ వైస్‌చైర్మన్ పదవి వీడేందుకు ససేమిరా!
ఆత్మకూరులో ఎట్టకేలకు శిరీష ప్రమాణస్వీకారం
నిడదవోలు, ఆత్మకూరు, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మున్సిపల్ వైస్‌చైర్మన్ ఎన్నికలో కూటమి పార్టీల మధ్య ఏర్పడిన వివాదం కొనసాగుతోంది. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పినా రాజీనామా చేసేందుకు ఆ పార్టీ నేత కల్యాణ్ చక్రవర్తి ససేమిరా అంటున్నారు. పొత్తులో భాగంగా ఇక్కడ వైస్ చైర్మన్ పదవిని టీడీపీకి కేటాయించగా.. సోమవారం మున్సిపల్ కౌన్సిల్ హాల్‌లో జరిగిన ఎన్నికలో అనూహ్యంగా ఇద్దరు వైసీపీ కౌన్సిలర్ల మద్దతుతో జనసేన నేత కల్యాణ్ చక్రవర్తి వైస్‌చైర్మన్‌గా ఎన్నికైన విషయం తెలిసిందే.
దీనిపై సోమవారం రాత్రే మంత్రి కందుల దుర్గేశ్‌ను డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ వివరణ కోరారు. కల్యాణ్ చక్రవర్తితో రాజీనామా చేయించాలని ఆదేశించారు. అయితే, రాజీనామా చేసేది లేదని కల్యాణ్ చక్రవర్తి తేల్చి చెప్పడంతో ఉత్కంఠ కొనసాగుతోంది. మంగళవారం చైర్‌పర్సన్ మురాల జ్యోతి, వైస్ చైర్మన్ కల్యాణ్ చక్రవర్తి, జనసేన కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయానికి వచ్చి చైర్మన్ చాంబర్‌లో కొద్దిసేపు ఉండి వెళ్లారు. మరోవైపు 24 గంటల్లో అధిష్ఠానం నిర్ణయం తీసుకోకపోతే ఆమరణ నిరాహారదీక్షకు దిగుతానని నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి బూరుగుపల్లి శేషారావు ప్రకటించారు. రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది.
నెల్లూరు జిల్లా ఆత్మకూరులో సంక్షోభానికి తెర
నెల్లూరు జిల్లా ఆత్మకూరు వైస్ చైర్‌పర్సన్ ఎన్నికపై ఏర్పడిన సంక్షోభానికి తెరపడింది. కూటమి పెద్దల జోక్యంతో స్థానిక నేతల మధ్య రాజీ కుదిరింది. జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిర్ణయించిన కొలగాని శిరీష ఎట్టకేలకు వైస్‌చైర్‌పర్సన్ పదవిని దక్కించుకున్నారు.
ప్రిసైడింగ్ అధికారి, ఆర్డీవో పావని మంగళవారం ఉదయం 11 గంటలకు మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయగా, మధ్యాహ్నం 2 గంటల వరకు దేవదాయ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, టీడీపీ, బీజేపీ, జనసేన కౌన్సిలర్లు సమావేశం మందిరానికి రాకపోవడంతో ఉత్కంఠ పెరిగింది. చివరకు 2.45 గంటల ప్రాంతంలో ఆనంతోపాటు 15 మంది కౌన్సిలర్లు కౌన్సిల్ హాల్‌లోకి ప్రవేశించారు. అయితే ఎన్నిక ప్రక్రియను వైసీపీ కౌన్సిలర్లు అడ్డుకున్నారు. సోమవారంనాటి ఎన్నికను ఎందుకు రద్దు చేశారో ఆర్డీవో చెప్పి తీరాలన్నారు. ఆనం జోక్యం చేసుకుని అధికారుల నిర్లక్ష్యం, అవగాహన లోపంతోనే వైస్ చైర్‌పర్సన్ ఎన్నికలో గందరగోళం ఏర్పడిందన్నారు. అనంతరం అధికారులు ఎన్నిక ప్రక్రియ చేపట్టగా 17 మంది కౌన్సిలర్ల మద్దతుతో కొలగాని శిరీష వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు.
ఈ వార్తలనూ చదవండి:
ఎస్‌ఐపీబీ సమావేశంలో కీలక నిర్ణయాలు
అభ్యర్థులకు ఎస్ఈసీ డెడ్‌లైన్.. డిసెంబర్ 21లోగా ఎన్నికల ఖర్చుల లెక్కలు ఇవ్వండి