రైతు భూమికి రక్ష
ABN , Publish Date - Sep 18 , 2026 | 03:39 AM
భూముల సర్వేలో రైతుల ప్రమేయం ఉండాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. టార్గెట్‌ల పేరిట రైతులు, ఉద్యోగుల పట్ల తొందరపాటు చర్యలు వద్దని తేల్చి చెప్పింది. గురువారం మంగళగిరిలోని సీసీఎల్‌ఏ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్లు, సబ్ కలెక్టర్లు, ఆర్డీవోల వర్క్‌షాప్ జరిగింది. రెండు రోజులు జరిగే ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) జి. సాయిప్రసాద్ ప్రారంభించారు.
టార్గెట్ పేరిట తొందర పాటు చర్యలొద్దు
రైతుల ప్రమేయంతోనే రీ సర్వే జరగాలి
పీజీఆర్‌ఎస్‌లో ప్రజా సంతృప్తి పెరగాలి
రీ సర్వే విధుల్లోని ఉద్యోగుల్ని తిట్టకండి
వారిని గౌరవించడం నేర్చుకోండి
జేసీలకు సీఎస్ దిశా నిర్దేశం
సీసీఎల్ ఏలో 2 రోజుల వర్క్‌షాప్ ప్రారంభం
కిందిస్థాయి అధికారులు, ఉద్యోగులను గౌరవించండి. వారితో మానవీయంగా వ్యవహరించండి. అకారణంగా తిడితే మీ (జేసీలను ఉద్దేశించి) ఇమేజే పోతుంది. గౌరవం మీకున్నట్లే కింది అధికారులు, ఉద్యోగులకు కూడా ఉంటుంది. కాబట్టి తోటి ఉద్యోగులతో సఖ్యతగా మెలగండి. నోటికి పని చెప్పి చెడ్డపేరు తెచ్చుకోవద్దు. టార్గెట్ల పేరిట తొందరపెట్టొద్దు. - సాయిప్రసాద్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
అమరావతి, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): భూముల సర్వేలో రైతుల ప్రమేయం ఉండాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. టార్గెట్‌ల పేరిట రైతులు, ఉద్యోగుల పట్ల తొందరపాటు చర్యలు వద్దని తేల్చి చెప్పింది. గురువారం మంగళగిరిలోని సీసీఎల్‌ఏ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్లు, సబ్ కలెక్టర్లు, ఆర్డీవోల వర్క్‌షాప్ జరిగింది. రెండు రోజులు జరిగే ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) జి. సాయిప్రసాద్ ప్రారంభించారు. సర్వే-సరిహద్దుల చట్టం-1923 ప్రకారం రైతులకు నోటీసులు ఇచ్చి, వారి సమక్షంలో భూముల కొలతలు వేయాలని, ఇది ప్రతీ సర్వేయర్ అమలు చేయాల్సిన ప్రాథమిక సూత్రం అని స్పష్టం చేశారు. రీ సర్వేలో టార్గెట్ సమీపించిందని గ్రామ, మండల సర్వేయర్లను ఉరుకులు పరుగులు పెట్టించి వారితో తప్పులు చేయించవద్దని ఆయన జేసీలు, ఆర్డీవోలకు నిర్దేశించారు. ‘‘నిబంధనల ప్రకారం రీ సర్వే జరగాలి. షెడ్యూల్ ప్రకారం కొలతలు వేయాలి. ఎక్కడో ఒకచోట ఏవో కారణాలతో కొంత ఆలస్యం కావొచ్చు. అంతమాత్రాన పనిలో విఫలమయ్యారంటూ సర్వేయర్లను తిడుతూ, తొందరపెట్టొద్దు. దానివల్ల తప్పులు జరిగే అవకాశం ఉంది. అందుకు ఎట్టి పరిస్థితుల్లో అవకాశంఇవ్వొద్దు. కొన్ని టార్గెట్ ప్రకారం జరగకపోవచ్చు. ఒకటి రెండు రోజులు ఆలస్యం అయినా సర్వే పక్కాగా జరిగేలా చూడాలి’’ అని సీఎస్ సూచించారు.
ఇకపై జేసీ, ఆర్డీవోలు విధిగా ప్రతి వారం ఒక అర్ధగంట పాటు తహసీల్దార్‌లతో భూముల సర్వే పురోగతిపై చర్చించాలని సాయిప్రసాద్ ఆదేశించారు. రీ సర్వే పేరిట గ్రామ సర్వేయర్లపై ఉండే ఒత్తిడిని తగ్గించాలని సూచించారు. మ్యుటేషన్ పూర్తయిన తర్వాత పట్టాదారుకు కూడా అడంగల్ కాపీ అందించే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తన మ్యుటేషన్ పూర్తయిందని పట్టాదారుకు తెలియడంతోపాటు, ఎంత వ్యవధిలో తన పని పూర్తయిందో, రికార్డుల్లో తన పేరు ఉందో లేదో స్పష్టత ఇవ్వాలన్నారు. ప్రస్తుతం బ్లాక్ చెయున్ టెక్నాలజీ అమలు పైలెట్ దశలో ఉందని, ఈ నెలాఖరు నుంచే రాష్ట్రమంతా రీ సర్వేతోపాటే అమలవుతుందని, ఈ దిశగా జేసీలు చర్యలు తీసుకోవాలని సీఎస్ ఆదేశించారు. ఇదిలా ఉండగా, రీ సర్వేపై అడిగిన కొన్ని అంశాలకు సరైన సమాధానాలు ఇవ్వనందుకు అనకాపల్లి జిల్లా అధికారులపై సీఎస్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. రీ సర్వే ప్రజంటేషన్‌లో జీటీ అని ఎందుకు చేర్చారని, దాని అర్థం ఏమిటని ప్రశ్నించారు. జీటీ అంటే గ్రౌండ్ ట్రూతింగ్ అని ఓ సర్వే అధికారి బదులివ్వగా, అంత షార్ట్‌ఫామ్ ఎందుకు, అందరికీ అర్థమయ్యే భాష వాడాలని సూచించినట్లు తెలిసింది.
హౌసింగ్‌పై దృష్టిపెట్టండి
పేదలకు ఇంటిస్ధలాలపై దృష్టి పెట్టాలని జేసీలు, ఆర్డీవోలను సీఎస్ ఆదేశించారు. అర్హత గల పేదలకు ఇంటి స్ధలాలిస్తామని ప్రభుత్వం ప్రకటించినందున ఖాళీ స్ధలాల లభ్యతపై ఆరా తీయాలన్నారు. ప్రజలు తమకు సెంటు లేదా సెంటున్నర స్ధలం చాలనుకుంటే, ఇప్పటికే సిద్ధంగా ఉన్న వాటిని కేటాయించవచ్చని, ఇందుకు హౌసింగ్ డిపార్ట్‌మెంట్‌తో సమన్వయం చేసుకోవాలన్నారు. సీసీఎల్‌ఏ జయలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో అదనపు సీసీఎల్‌ఏ వెంకటమురళి, సర్వే, సెటిల్‌మెంట్ డైరెక్టర్ రోణంకి కూర్మనాధ్, జాయింట సెక్రెటరీలు చేతన్, వీరబ్రహ్మం, జిల్లాల జేసీలు, సబ్‌కలెక్టర్‌లు, ఆర్డీఓలు, సర్వే, సెటిల్‌మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్లు పాల్గొన్నారు.
ఉద్యోగులను తిట్టకండి
దిగువస్థాయి అధికారులు, ఉద్యోగులపై కలెక్టర్లు మాటలతో విరుచుకుపడుతున్న ఉదంతాలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో సీఎస్ జేసీలకు కొన్ని జాగ్రత్తలు చెప్పారు. దిగువస్థాయి అధికారులు, ఉద్యోగులను ఏ కారణంతోనూ తిట్టవద్దని, వారితో అమర్యాదగా ప్రవర్తించరాదని హితోపదేశం చేశారు. ఇటీవల ఓ కలెక్టర్ తన దగ్గర పనిచేసే జేసీ, సబ్‌కలెక్టర్, ఆర్డీవో, ఎంపీడీవో, తహసీల్దార్లను పచ్చిబూతులు తిడుతు అమర్యాదగా, అగౌరవంగా వ్యవహరిస్తున్న ఉదంతాన్ని ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అలా నోటికి పనిచెబుతూ ఉద్యోగులపై అకారణంగా విరుచుకుపడుతున్నవారు ఇంకా అనేకం ఉన్నారని ప్రభుత్వానికి ఫిర్యాదు అందింది. ఈ నేపథ్యంలో ఈ అంశంపై తాజాగా సీఎస్ కొన్ని సూచనలు చేశారు. ’’మీ కిందిస్థాయి అధికారులు, ఉద్యోగులను గౌరవించండి. వారితో మానవీయంగా వ్యవహరించండి. అకారణంగా తిడితే మీ ఇమేజే పోతుంది. గౌరవం మీకున్నట్లే కింది అధికారులు, ఉద్యోగులకు కూడా ఉంటుంది. కాబట్టి తోటి ఉద్యోగులతో సఖ్యతగా మెలగండి. నోటికిపనిచెప్పి చెడ్డపేరు తెచ్చుకోవద్దు’’ అని సీఎస్ సాయిప్రసాద్ సూచించారు.
ఈ వార్తలనూ చదవండి: