పల్లె మురిసింది
ABN , Publish Date - Sep 18 , 2026 | 12:28 AM
జిల్లాలో పల్లె రహదారులకు మహర్దశ పట్టింది. కూటమి ప్రభుత్వ హయాంలో గ్రామీణ రోడ్లకు కొత్త రూపు వచ్చింది. గత ఆర్థిక సంవత్సరంలో పల్లె పండగ -2.0 కింద రూ.107.17 కోట్లతో 197.2 కిలోమీటర్ల పొడవున సిమెంట్ రోడ్లు మంజూరయ్యాయి.
గ్రామీణ రహదారులకు మహర్దశ
పల్లె పండగ-2.0 కింద రూ.107.17 కోట్లతో 1,612 సీసీ రోడ్లు మంజూరు
ఇప్పటికే 1,373 పూర్తి
రాకపోకలు సజావుగా సాగుతుండడంతో గ్రామీణ వాసుల ఆనందం
(అనకాపల్లి- ఆంధ్రజ్యోతి)
జిల్లాలో పల్లె రహదారులకు మహర్దశ పట్టింది. కూటమి ప్రభుత్వ హయాంలో గ్రామీణ రోడ్లకు కొత్త రూపు వచ్చింది. గత ఆర్థిక సంవత్సరంలో పల్లె పండగ -2.0 కింద రూ.107.17 కోట్లతో 197.2 కిలోమీటర్ల పొడవున సిమెంట్ రోడ్లు మంజూరయ్యాయి. వీటి నిర్మాణంతో గ్రామీణ రోడ్ల రూపురేఖలు మారిపోయాయి.
గత వైసీపీ ప్రభుత్వంలో గ్రామీణ రహదారులు పూర్తిగా దెబ్బతిని అధ్వానంగా ఉన్నా పట్టించుకోలేదు. గోతులమయంగా ఉన్న రోడ్లలో వాహనచోదకులు ఇబ్బందులు పడినా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులకు అధిక ప్రాధాన్యం ఇచ్చింది. పల్లె పండగ- 2.0 కింద రహదారుల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని రహదారుల నిర్మాణానికి చర్యలు చేపట్టారు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో రూ.101.17 కోట్ల వ్యయంతో 197.2 కిలోమీటర్ల పొడవున వివిధ మండలాల్లోని గ్రామాల్లో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టారు. పల్లె పండగ -2.0 కింద గత ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 1,612 సిమెంట్ రోడ్లు మంజూరు కాగా, ఇప్పటి వరకు 1,373 రోడ్ల నిర్మాణ పనులు పూర్తయ్యాయి. 216 రహదారుల పనులు వివిధ దశల్లో కొనసాగుతుండగా, స్థానిక పరిస్థితులు, ఇతర అడ్డంకుల వల్ల 23 రహదారుల పనులు మాత్రం ప్రారంభంకాలేదు.
సజావుగా రాకపోకలు
సిమెంట్ రోడ్లతో పాటు జిల్లాలో సుమారు 4.18 కిలోమీటర్ల పొడవున 7 తారురోడ్ల నిర్మాణ పనులు కూడా చేపట్టారు. వీటికి సుమారు రూ.5.60 కోట్లు ఖర్చు చేశారు. పీఆర్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో సాగిన ఈ పనులతో గ్రామాల్లో అంతర్గత రహదారులు, కాలనీలకు వెళ్లే మార్గాలు మెరుగుపడ్డాయి. దీంతో గ్రామాల్లోని వివిధ ప్రాంతాలకు రాకపోకలు సజావుగా సాగుతున్నాయి. మిగిలిన పనులు కూడా త్వరలోనే పూర్తి చేస్తామని పీఆర్ ఈఈ జగదీశ్ తెలిపారు. ఈ ఏడాది చేపట్టబోయే పనులకు కూడా అంచనాలు రూపొందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.