నాటుసారాపై ఉక్కుపాదం!
ABN , Publish Date - Aug 29 , 2026 | 04:49 AM
నాటుసారాపై ఎక్సైజ్ శాఖ ఉక్కుపాదం మోపుతోంది. సారా స్థావరాలపై నిఘా పెట్టి ధ్వంసం చేస్తోంది.
నాటుసారాపై ఉక్కుపాదం!
4 నెలల్లో 16,130 లీటర్ల సారా ధ్వంసం
2,95,325 లీటర్ల బెల్లం ఊట కూడా...
1,289 కేసులు నమోదు.. 1,338 మంది నిందితులు
ఏప్రిల్- జూలై మధ్య 3,055 లీటర్ల ఎన్‌డీపీఎల్ సీజ్
రూ.99 బ్రాండ్ల మద్యం తగ్గుదలతో మళ్లీ సారాకు మొగ్గు
(అమరావతి-ఆంధ్రజ్యోతి): నాటుసారాపై ఎక్సైజ్ శాఖ ఉక్కుపాదం మోపుతోంది. సారా స్థావరాలపై నిఘా పెట్టి ధ్వంసం చేస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూలై వరకు నాటుసారాపై ఎక్సైజ్‌లోని అన్ని విభాగాలు కలిసి 1,289 కేసులు నమోదు చేశాయి. వాటిలో 1,338 మంది నిందితులుగా ఉన్నారు. పలు స్థావరాలపై దాడులు చేసి 16,130 లీటర్ల నాటుసారాను అధికారులు స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు. సారా ఉత్పత్తి కోసం సిద్ధం చేసిన 2,95,325 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. సారా తయారీకి సమీకరించిన 76,489 కిలోల బెల్లాన్ని సీజ్ చేశారు. 111 వాహనాలు పట్టుబడ్డాయి. అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, అన్నమయ్య, కోనసీమ, తూర్పుగోదావరి, కాకినాడ, కర్నూలు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో నాటుసారా మళ్లీ పెరుగుతోండటంతో ఆ జిల్లాలపై మరింత నిఘా పెట్టి అరికట్టే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ర్టాన్ని నాటుసారా రహితంగా ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. పోలీసులతో కలసి ఎక్సైజ్ విభాగం సంయుక్త దాడులు నిర్వహించి స్థావరాలను పూర్తిగా నిర్మూలించింది. దీంతో మద్యం అమ్మకాలు పెరిగాయి. అయితే ఈ దాడులు ఆపిన తర్వాత నుంచి మళ్లీ నాటుసారా స్థావరాలు వెలుస్తున్నాయి. తక్కువ ధరకే అందుబాటులోకి వస్తుండటంతో దానివైపు మొగ్గుతున్నారని గుర్తించిన ప్రభుత్వం ఆ ప్రాంతాల్లో క్వార్టర్ రూ.99 మద్యం తీసుకొచ్చింది. ఈ ప్రయోగం సత్ఫలితాలను ఇచ్చింది. సారాకు బదులుగా ప్రభుత్వం ద్వారా వచ్చే మద్యం కొనుగోళ్లు పెరిగాయి. అయితే ఇటీవల క్వార్టర్ రూ.99 బ్రాండ్ల మద్యం కొంతమేర తగ్గడంతో వినియోగదారులు మళ్లీ సారాకు మళ్లుతున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సుదీర్ఘకాలం నుంచి నాటుసారా తయారీపై ఆధారపడిన కుటుంబాలకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పిస్తే వారు మళ్లీ అటువైపు మొగ్గే అవకాశం ఉండదు.
పెరుగుతున్న ఎమ్మార్పీ ఉల్లంఘనలు
మరోవైపు మద్యం అమ్మకాల్లో ఎమ్మార్పీ ఉల్లంఘనలు పెరుగుతున్నాయి. ఇటీవల ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఎమ్మార్పీ కంటే అదనంగా వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి. విశాఖలోనూ రెండు బ్రాండ్ల అమ్మకాల్లో ఉల్లంఘనలు పెరుగుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. మద్యం షాపుల పాలసీ చివరి దశకు వచ్చిన నేపథ్యంలో వ్యాపారులు అదనపు వసూళ్లతో మరింత సొమ్ము చేసుకుంటున్నారు. కొన్నిచోట్ల అధికారులు కూడా చూసీచూడనట్లు వదిలేస్తున్నారన్న ఆరోపణలున్నాయి.
తగ్గిన ఎన్‌డీపీఎల్
మద్యం ధరలు తగ్గించడం, నిఘా పెంచడంతో రాష్ట్రంలోకి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ భారీగా తగ్గింది. ఏప్రిల్ నుంచి జూలై వరకు 3,055 లీటర్ల ఎన్‌డీపీఎల్‌ను సీజ్ చేశారు. 470 లీటర్ల బీర్ పట్టుబడింది. గత ప్రభుత్వంలో భారీగా ధరలు పెంచడంతో తెలంగాణ, కర్ణాటక నుంచి పెద్దఎత్తున ఎన్‌డీపీఎల్ రాష్ట్రంలోకి వచ్చేది. సరిహద్దు పంచుకునే ప్రాంతాల్లో దీని ప్రభావం విపరీతంగా ఉండేది. కూటమి ప్రభుత్వం మద్యం ధరలు తగ్గించడంతో ఎన్‌డీపీఎల్ చాలావరకు తగ్గింది.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రమాదం నుంచి ఎలా బయటపడ్డాడో చూస్తే.. అవాక్కవుతారు..
రైల్వే ట్రాక్‌పై చిక్కుకుపోయిన ఒంటె.. వీడియో వైరల్