తక్షణ సాయం అందించండి!
ABN , Publish Date - Nov 07 , 2026 | 01:26 AM
వరుస తుఫాన్లతో ఏపీకి భారీనష్టం వాటిల్లిందని, ఉపశమనం కోసం తక్షణం మధ్యంతర ఆర్థిక సాయం అందించాలని సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.
కేంద్ర హోం మంత్రికి సీఎం లేఖ
అమరావతి, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): వరుస తుఫాన్లతో ఏపీకి భారీనష్టం వాటిల్లిందని, ఉపశమనం కోసం తక్షణం మధ్యంతర ఆర్థిక సాయం అందించాలని సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు శుక్రవారం లేఖ రాశారు. వారం వ్యవధిలోనే రెండు వరుస తుఫాన్ల కారణంగా ఏపీపై తీవ్ర ప్రభావం పడిందని తెలిపారు. ‘మురసు తుఫాన్ వల్ల రూ.1,919.59 కోట్లు నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశాం. భారీవర్షాలు, పెను గాలులకు విద్యుత్, రహదారుల వంటి మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి. గతనెల 27న అర్నబ్ తుఫాన్ సృష్టించిననష్టం నుంచి కోలుకుంటున్న సమయంలోనే మురసు విరుచుకుపడడంతో రైతులు, మత్స్యకారులు ఒకే సీజన్‌లో రెండుసార్లు నష్టపోయారు. మురసు తుఫాన్‌కు 1,43,122 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి.
1,86,063 మంది రైతులు ప్రభావితమయ్యారు. వ్యవసాయ రంగానికి రూ.874.96 కోట్ల నష్టం వాటిల్లింది. ఉద్యాన పంటలు 6,504 హెక్టార్లలో దెబ్బతినగా.. 12,178 మంది రైతులు నష్టపోయారు. ఈ రంగానికి రూ.337.10కోట్ల నష్టం జరిగింది.
పశుసంవర్ధక, ఆక్వా, గృహనిర్మాణ, ఇరిగేషన్, విద్యుత్, పంచాయతీరాజ్, మున్సిపల్, విద్య, వైద్యారోగ్య శాఖలకు తీవ్ర నష్టం వాటిల్లింది. రైతులు, మత్స్యకారులు, గృహాలు దెబ్బతిన్న కుటుంబాలు, ఇతర బాధిత వర్గాలను ఆదుకునేందుకు, దెబ్బతిన్న అత్యవసర మౌలిక సదుపాయాలు, సేవల పునరుద్ధరణకు తక్షణమే మధ్యంతర ఆర్థిక సాయం సాయం అందితే.. రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొనేలా చర్యలు తీసుకుంటాం’ అని పేర్కొన్నారు. వరద నీరు తగ్గిన తర్వాత నష్టాలపై పూర్తి స్థాయి అంచనాలు వేసి.. మరో 15 రోజుల్లో కేంద్రానికి సమగ్ర నివేదిక సమర్పిస్తామని ఆ లేఖలో ముఖ్యమంత్రి తెలిపారు.
ఈ వార్తలనూ చదవండి:
సీఎం విజయ్‌కు ఫోన్ చేసి అదే చెప్పా: సీఎం చంద్రబాబు