Share News

నేరస్థుల రాజకీయ ముసుగు తీయండి

ABN , Publish Date - Oct 22 , 2026 | 05:36 AM

‘రాజకీయం పేరిట నేరాలకు పాల్పడేవారి ముసుగు తీయించండి. రప్పా రప్పా అంటూ రెచ్చిపోయే వారికి ఖాకీ పవర్‌ ఏంటో చూపించండి’ అని సీఎం చంద్రబాబు అన్నారు.

నేరస్థుల రాజకీయ ముసుగు తీయండి

అమరావతి, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): ‘రాజకీయం పేరిట నేరాలకు పాల్పడేవారి ముసుగు తీయించండి. రప్పా రప్పా అంటూ రెచ్చిపోయే వారికి ఖాకీ పవర్‌ ఏంటో చూపించండి’ అని సీఎం చంద్రబాబు అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా మంగళగిరిలోని పోలీస్‌ బెటాలియన్‌ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ‘శాంతి భద్రతల పరిరక్షణ మా ప్రభుత్వం ప్రధాన అజెండా. రాష్ట్రం ప్రశాంతంగా ఉంటేనే పెట్టుబడులు వస్తాయి. ఫలితంగా ఉపాధి లభిస్తుంది. రౌడీలు రాజకీయ ముసుగు వేసుకొని అక్కడక్కడ రెచ్చిపోతున్నారు. అటువంటి వారిని అణచి వేయాలి. రాజకీయాలు, నేరస్థులకు ఎట్టి పరిస్థితుల్లోనూ రక్షణ కవచాలు కాకూడదు. రోడ్లపై రెచ్చిపోయే రౌడీలు, సోషల్‌ మీడియాలో వేధించే సైకోలకు గట్టిగా బుద్ధి చెప్పాలి. పోలీసు యూనిఫామ్‌ చూడగానే నేరగాళ్లకు భయం, బాధితులకు భరోసా కలగాలి.

ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు దేశానికే ఆదర్శంగా నిలవాలి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రజలకు అండగా నిలవాలి. శాంతి భద్రతలు, అభివృద్ధి, ఉపాధి, ప్రజల సుఖ సంతోషాలు పరస్పరం ముడిపడి ఉన్నాయి. నేను అధికారంలో ఉన్న ప్రతిసారీ శాంత్రి భద్రతలకు ప్రాధాన్యం ఇచ్చా. ఫ్యాక్షన్‌ నియంత్రణ, నక్సలిజం అదుపు, మత కలహాలను అరికట్టడంలో ఏపీ పోలీసులు అసాధారణ ధైర్య సాహసాలు ప్రదర్శించారు. దేశ భద్రతకు భంగం కలిగించే కుట్రల్ని ఇటీవల ఏపీ కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ తిప్పికొట్టింది. ధైర్యంతో పాటు పోలీసులకు మానవత్వం కూడా ముఖ్యం. బాధితులకు, ఖాకీ యూనిఫామ్‌ చూడగానే భరోసా లభిస్తేనే సార్థకత. ప్రజల సమస్యలు సానుభూతితో విని, గౌరవంగా వ్యవహరించి, సత్వర న్యాయం జరిగేలా చూస్తే పోలీసులపై ప్రజల్లో మరింత నమ్మకం పెరుగుతుంది. మహిళలపై నేరాలకు పాల్పడాలంటే నేరగాళ్లు భయపడే పరిస్థితి రావాలి. మహిళకు భద్రత కల్పించలేకపోతే ప్రయోజం ఉండబోదు’ అని ముఖ్యమంత్రి అన్నారు.


సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి

‘టెక్నాలజీ వేగంగా విస్తరిస్తున్న కొద్దీ నేరాల రూపురేఖలు మారుతున్నాయి. ఒక్క ఫోన్‌కాల్‌ లేదా సైబర్‌ లింక్‌ పంపి ప్రజల్ని దోచేస్తున్న వారి ఆటకట్టించడంపై పోలీసులు దృష్టి సారించాలి. విద్యావంతులు సైతం సైబర్‌ మోసాల బారిన పడుతున్నారు. నేరాల్ని ఛేదించే పోలీసులు... అవి జరగకుండా ప్రజల్లో అవగాహన తెచ్చి కట్టడి చేస్తే అత్యుత్తమ పోలీసులుగా ప్రజల మన్ననలు అందుకుంటారు. నేరాలను టెక్నాలజీ ద్వారా గుర్తించడంతో పాటు డేటా విశ్లేషణ జరగాలి.

డ్రోన్ల వినియోగాన్ని విస్తరించాలి. ఏఐ వినియోగంతో దర్యాప్తు సామర్థ్యాన్ని పెంచుకోవాలి. గంజాయి, డ్రగ్స్‌ కట్టడిలో ఈగల్‌ బృందం బాగా కృషి చేస్తోంది. పోలీసు అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. హోం మంత్రి వంగలపూడి అనిత, రాష్ట్ర డీజీపీ హరీశ్‌ కుమార్‌ గుప్తాతో కలసి సీఎం... అమరవీరుల స్మృతి చిహ్నం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులు అర్పించారు.

ఈ వార్తలనూ చదవండి..

కూటమి దూకుడు

పండుగపూట ఘోరం

Updated Date - Oct 22 , 2026 | 05:36 AM