మోదీ నేతృత్వంలో నిర్ణయాత్మక అడుగు
ABN , Publish Date - Nov 29 , 2026 | 12:52 AM
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్లు.. ప్రధాని మోదీ నాయకత్వంలో మహిళా సాధికారత దిశగా ఒక నిర్ణయాత్మక అడుగుగా ముఖ్యమంత్రి చంద్రబాబు అభివర్ణించారు.
మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులను పార్టీలన్నీ ఏకాభిప్రాయంతో ఆమోదించాలి: చంద్రబాబు పిలుపు
అమరావతి, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్లు.. ప్రధాని మోదీ నాయకత్వంలో మహిళా సాధికారత దిశగా ఒక నిర్ణయాత్మక అడుగుగా ముఖ్యమంత్రి చంద్రబాబు అభివర్ణించారు. కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న ఈ రెండు బిల్లులను అన్ని రాజకీయ పార్టీలూ ఏకాభిప్రాయంతో ఆమోదించాలని కోరారు. ‘1986లోనే స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించి దేశానికి ఆంధ్రప్రదేశ్ మార్గదర్శకంగా నిలిచింది. చట్టసభల సీట్ల సంఖ్యను 50 శాతం పెంచడం వల్ల ప్రతి రాష్ట్రం వాటాకు రక్షణ లభిస్తుంది.
ఆంధ్రప్రదేశ్ లోక్‌సభ సీట్లు 25 నుంచి 38కి పెరుగుతాయి. దక్షిణాది రాష్ట్రాల వాటా చెక్కుచెదరకుండా ఉంటుంది. 1971లో ఒక ఎంపీ 10 లక్షల మంది ప్రజలకు ప్రాతినిధ్యం వహించేవారు. నేడు ఆ సంఖ్య దాదాపు 27 లక్షలకు చేరింది. సీట్ల పెంపుతో అది సుమారు 18 లక్షలకు తగ్గుతుంది. మహిళా రిజర్వేషన్లకు మద్దతు తెలుపుతూ అసెంబ్లీ ఇప్పటికే కేంద్రానికి తీర్మానం పంపింది. ఈ బిల్లులను వ్యతిరేకించడం అంటే మహిళలకు జరిగే న్యాయాన్ని నిరాకరించడమే’ అని చంద్రబాబు ‘ఎక్స్’లో పేర్కొన్నారు.
రాజ్యాంగ సవరణ మద్దతు: మాధవ్
విశాఖపట్నం, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్‌కు సంబంధించి రాజ్యాంగ సవరణ ప్రతిపాదనలకు ఏపీ బీజేపీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.
ఈ వార్తలనూ చదవండి:
అమరావతి నిర్మాణాలపై వైసీపీ తప్పుడు ప్రచారం.. నిజాలు తేల్చిన ఏపీ ఫ్యాక్ట్ చెక్..