పట్టిసీమ’తో సస్యశ్యామలం
ABN , Publish Date - Oct 11 , 2026 | 04:30 AM
: కృష్ణా డెల్టా రైతాంగం పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని సద్వినియోగం చేసుకుని గడచిన 11 ఏళ్లుగా సిరులు పండించారని సీఎం చంద్రబాబు ప్రశంసించారు.
గోదావరి జలాలతో కృష్ణా డెల్టాలో సాగు
11 ఏళ్లుగా 500 టీఎంసీలతో సిరులు: చంద్రబాబు
సీఎంకు సాగునీటి సంఘాల ప్రతినిధులు, కృష్ణా డెల్టా రైతుల సత్కారం
అమరావతి, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): కృష్ణా డెల్టా రైతాంగం పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని సద్వినియోగం చేసుకుని గడచిన 11 ఏళ్లుగా సిరులు పండించారని సీఎం చంద్రబాబు ప్రశంసించారు. కృష్ణా బేసిన్‌లో గోదావరి జలాలను వినియోగిస్తూ, పొదుపు చేసుకున్న కృష్ణా జలాలను రాయలసీమలో సాగు, తాగునీటికి మళ్లించామని అన్నారు. కాలువలను అభివృద్ధి చేయడం ద్వారా రాష్ట్రమంతా సాగు, తాగునీటిని అందిస్తామని చెప్పారు. మంత్రి నిమ్మల రామానాయుడుతో కలసి వచ్చిన కృష్ణా డెల్టా రైతులు, రాష్ట్ర సాగునీటి సంఘాల ప్రతినిధులను ఆయన అభినందించారు. పట్టిసీమ నుంచి ఇప్పటి దాకా 500 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు ఇచ్చినందుకు కృతజ్ఞతగా శనివారం సచివాలయంలో వారు సీఎంను శాలువాతో సత్కరించారు. టేకు కర్రతో చేసిన ఎద్దుల బండి ప్రతిమను బహూకరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రాయలసీమలో నెలకొల్పే పరిశ్రమలకూ, త్వరలోనే స్థాపిస్తున్న హార్టికల్చర్ హబ్‌కూ పట్టిసీమ జలాలు పరోక్షంగా సహకరిస్తాయని అన్నారు. సీమలో కియా లాంటి ప్రతిష్ఠాత్మక పరిశ్రమలకు కూడా నీరివ్వగలిగామని చెప్పారు. ఇరిగేషన్ క్యాలెండర్ ప్రకారం ప్రాజెక్టులు పూర్తిచేసి జల భద్రత కల్పిస్తామన్నారు. పట్టిసీమ ద్వారా కృష్టా డెల్టాకు ఇప్పటి వరకూ 500 టీఎంసీల నీటిని తీసుకువచ్చిన చంద్రబాబుకు రైతులు, సాగునీటి యాజమాన్య సంఘాల ప్రతినిధులు ధన్యవాదాలు తెలిపారు. పట్టిసీమ లేకపోతే ఎల్‌నినో ప్రభావంతో నీటి కొరత తీవ్రంగా ఉండేదన్నారు. అన్ని ప్రాంతాలకూ నీటి భరోసా కల్పించిన ముఖ్యమంత్రి ఏపీ వాటర్‌మ్యాన్ అంటూ ప్రశంసించారు.
పట్టిసీమతో 50 వేల కోట్ల సంపద సృష్టి: నిమ్మల
పట్టిసీమ ఎత్తిపోతల పథకం రాష్ట్ర రైతాంగానికి వరప్రదాయినిగా మారిందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. సీఎం చంద్రబాబు దూరదృష్టి, అపార అనుభవానికి ఈ పథకం సజీవ సాక్ష్యమని ప్రశంసించారు. 2015 నుంచి ఇప్పటివరకు గోదావరి వరద జలాలను కృష్ణాడెల్టాకు మళ్లించడం ద్వారా సుమారు రూ.50 వేలకోట్ల సంపద సృష్టించారని వివరించారు. రూ.1,600 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా ఎంతో లాభం జరిగిందని చెప్పారు. సూపర్ ఎల్‌నినో విపత్కర పరిస్థితుల్లో సైతం గోదావరి నుంచి 57 టీఎంసీల నీటిని తరలించి కృష్ణా డెల్టాలో సుమారు 7లక్షల ఎకరాల ఆయకట్టును కాపాడామని తెలిపారు. 30 లక్షల మంది ప్రజల తాగునీటి అవసరాలు తీర్చినట్టు వివరించారు. నాడు జగన్ ప్రతిపక్షంలో ఉండగా అసెంబ్లీ సాక్షిగా పట్టిసీమను ఒట్టి సీమ అని, నిధులు వృథా అని అవహేళన చేశారని విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే పంపులు పీకేస్తామని అన్నారని, నేడు ఆ పంపులే లక్షలాది మంది రైతుల గొంతు ఎండకుండా కాపాడుతున్నాయని అన్నారు. జగన్ రాష్ట్ర ప్రజలకు, రైతాంగానికి ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పినా రైతులు క్షమించరని మండిపడ్డారు.
ఈ వార్తలనూ చదవండి:
ఎవరు అడ్డొచ్చినా నెట్టుకుంటూ పోతాం
దసరాలోపు 2వ విడత తల్లికి వందనం..!