Share News

ప్రకృతి సాగులో ఏపీ అగ్రస్థానం

ABN , Publish Date - Oct 11 , 2026 | 04:32 AM

ప్రకృతి వ్యవసాయాన్ని మరింత విస్తృతం చేస్తూ దేశంలోనే అగ్రస్థానానికి చేరుకున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ విధానం తీవ్రమైన కరువు పరిస్థితిని కూడా తట్టుకుని ఎక్కువ దిగుబడులు ఇస్తుందని చెప్పారు.

 ప్రకృతి సాగులో ఏపీ అగ్రస్థానం

  • పెట్టుబడి తక్కువ.. రాబడి ఎక్కువ.. కరువులోనూ అధిక దిగుబడులు

  • ‘సరస్‌ మేళా’లో ఈ విధానాలు ప్రదర్శిస్తాం: సీఎం చంద్రబాబు

అమరావతి, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): ప్రకృతి వ్యవసాయాన్ని మరింత విస్తృతం చేస్తూ దేశంలోనే అగ్రస్థానానికి చేరుకున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ విధానం తీవ్రమైన కరువు పరిస్థితిని కూడా తట్టుకుని ఎక్కువ దిగుబడులు ఇస్తుందని చెప్పారు. రాష్ట్రంలో ప్రకృతి సేద్యం పెంపు, ప్రీ-మాన్సూన్‌ డ్రై సోయింగ్‌(పీఎండీఎస్)పై సామాజిక ప్రకృతి సేద్య రైతులు, కమ్యూనిటీ రీసోర్స్‌పర్సన్స్‌తో సీఎం టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. సీఎం మాట్లాడుతూ.. 2016లో 40 వేల మంది రైతులతో ప్రారంభమైన ప్రకృతి సేద్యం నేడు 17.73 లక్షల మందికి చేరిందని తెలిపారు. రాష్ట్రంలో 25 లక్షల మంది రైతులు ప్రకృతి సేద్యం చేసేలా ప్రోత్సహిస్తున్నామన్నారు. ‘రసాయన ఎరువులతో భూసారం క్షీణిస్తుంది. సాగు ఖర్చులు పెరిగి, రైతుకు భారంగా మారుతుంది. రసాయన ఎరువులతో పోల్చితే ప్రకృతి సేద్యం ద్వారా 47 శాతం మేర ఆదాయం పెరిగింది. తీవ్రమైన కరువును తట్టుకుని అధిక ఉత్పత్తి ఇస్తుంది. ఈ పద్ధతిలో సాగు చేస్తే పత్తిలో 96 శాతం, కందిలో 87 శాతం మేర నికరాదాయం ఇచ్చాయి. పెట్టుబడి వ్యయం తగ్గి, రైతులకు రాబడి పెంచేలా ఉపకరిస్తుంది. కేంద్రం కూడా జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్‌ పాలసీ ద్వారా రైతులకు ఆసరాగా నిలుస్తోంది. 2023-24 కంటే ముందు సంవత్సరాలతో పోల్చితే ఏపీలో 6 శాతం మేర రసాయన ఎరువుల వినియోగం తగ్గింది. గతేడాదికి, ఇప్పటికి మరో 2.28 శాతం మేర తగ్గిపోయింది. రసాయన ఎరువుల వినియోగం తగ్గించినందుకు కేంద్రం ఇచ్చే రూ.218 కోట్ల ప్రోత్సాహకాలపై లేఖ రాశాం’ అని చంద్రబాబు అన్నారు. ‘ఇటీవల కురిసిన వర్షాలతో వానలోటు 34శాతానికి తగ్గింది. ప్రతికూల పరిస్థితుల్లోనూ ప్రకృతి సేద్యాన్ని కొనసాగించాలి. ప్రకృతి సేద్యంలో గుజరాత్‌ కంటే ఏపీ అగ్రస్థానంలో ఉందని ప్రధాని మోదీ చెప్పారు.


15న నిర్వహించే ‘సరస్‌ మేళా’లో ప్రకృతి సేద్య విధానాలను ప్రదర్శిస్తాం. ఎల్‌నినో ప్రభావాన్ని తగ్గించేలా అనంతపురం జిల్లాలోనే 10లక్షల పంట కుంటలు తవ్వించాం. చెక్‌డ్యామ్‌లు, ట్రెంచ్‌లను తవ్వడంతో పాటు స్థానికంగా ఉన్న నీటి వనరుల బేసిన్లను అనుసంధానిస్తాం. నదుల అనుసంధానంతో ఓ ఏడాది వర్షాలు కురకవపోయినా నీటి ఇబ్బందులను అధిగమించే అవకాశం ఉంటుంది. ప్రకృతి సేద్యాన్ని ముందుకు తీసుకెళ్తున్న రైతులే నాకు స్ఫూర్తి. కషాయం, జీవామృతం తయారీకి దేశీయ ఆవుల కోసం మరిన్ని గోకులాల నిర్మాణం చేపడతాం’ అని సీఎం చెప్పారు. ప్రకృతి సాగు విస్తరణకు యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తున్న కమ్యూనిటీ రీసోర్స్‌పర్సన్స్‌కు సీఎం అభినందనలు తెలిపారు.

ఈ వార్తలనూ చదవండి:

ఎవరు అడ్డొచ్చినా నెట్టుకుంటూ పోతాం

జయహో బీసీ

దసరాలోపు 2వ విడత తల్లికి వందనం..!

Updated Date - Oct 11 , 2026 | 04:32 AM