పెట్రో ప్రాజెక్టుల నిర్మాణంలో స్పీడ్ పెంచండి
ABN , Publish Date - Sep 17 , 2026 | 03:05 AM
రామాయపట్నం పోర్టు సమీపంలో భారీ పెట్టుబడులతో చేపట్టిన గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీ కమ్ పెట్రో కెమికల్ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(బీపీసీఎల్)ను సీఎం చంద్రబాబు కోరారు. ఆ రిఫైనరీ సమీపంలో డౌన్‌స్ట్రీమ్ (శుద్ధి చేసి వినియోగానికి సిద్ధంగా ఉన్న) పెట్రో కెమికల్ పార్క్‌ను ఏర్పాటు చేయాలని తాజాగా ప్రతిపాదించారు.
పెట్రో ప్రాజెక్టుల నిర్మాణంలో స్పీడ్ పెంచండి
బీపీసీఎల్ బృందంతో భేటీలో సీఎం చంద్రబాబు
అమరావతి, సెప్టెంబరు 16(ఆంధ్రజ్యోతి): రామాయపట్నం పోర్టు సమీపంలో భారీ పెట్టుబడులతో చేపట్టిన గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీ కమ్ పెట్రో కెమికల్ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(బీపీసీఎల్)ను సీఎం చంద్రబాబు కోరారు. ఆ రిఫైనరీ సమీపంలో డౌన్‌స్ట్రీమ్ (శుద్ధి చేసి వినియోగానికి సిద్ధంగా ఉన్న) పెట్రో కెమికల్ పార్క్‌ను ఏర్పాటు చేయాలని తాజాగా ప్రతిపాదించారు. రిఫైనరీకి సమీపంలో దాదాపు 1,500 ఎకరాల్లో డౌన్‌స్ట్రీమ్ పెట్రో కెమికల్ పార్క్‌ను ఏర్పాటు చేయడానికి బీపీసీఎల్, ఏపీఐఐసీ సంయుక్తంగా ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. బీపీసీఎల్ సీఎండీ సంజయ్‌ఖన్నా నేతృత్వంలో అధికారులు, ప్రతినిధులు బుధవారం చంద్రబాబుతో సమావేశమయ్యారు. రామాయపట్నంలో భారీ రిఫైనరీ కోసం కేటాయించిన 6 వేల ఎకరాల్లో ఇప్పటికే 75 శాతం భూమిని అప్పగించామని, మిగిలిన భూమిని కూడా అక్టోబరు రెండో వారంలోగా అప్పగిస్తామని బీపీసీఎల్ సీఎండీకి సీఎం హామీ ఇచ్చారు. ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని ప్రక్రియలను వేగవంతం చేసి, నిర్మాణ పనులను వీలైనంత త్వరగా ప్రారంభించాలని ఆదేశించారు. ప్రస్తుతం దాదాపు 5 శాతంగా ఉన్న దేశ పెట్రో కెమికల్ ఇంటెన్సిటీ ఇండెక్స్.. రాబోయే దశాబ్ద కాలంలో 15నుంచి 20శాతానికి పెరుగుతుందని అంచనాలున్నందున భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని రిఫైనరీకి రూపకల్పన చేయాలన్నారు.
ఈనెలాఖరుకు పర్యావరణ అనుమతులు..
ప్రకాశం, నెల్లూరు జిల్లాల మధ్య ఏర్పాటు చేయనున్న తమ ప్రాజెక్టు అంచనా వ్యయం దాదాపు రూ.1.45 లక్షల కోట్లని సంజయ్ ఖన్నా వివరించారు. ఏటా 9 మిలియన్ టన్నుల సామర్థ్యంతో సమగ్ర గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీ ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. సెప్టెంబరు చివరి నాటికి ఈ ప్రాజెక్టుకు తుది పర్యావరణ అనుమతులు లభించే అవకాశం ఉందని చెప్పారు. ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్ తయారు చేస్తున్న అధ్యయన నివేదిక అందిన తర్వాత అక్టోబరులో తుదిపెట్టుబడి వ్యయం ఖరారవుతుందని, అనంతరం రిఫైనరీ నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని వివరించారు. ఈ రిఫైనరీ మోటార్ స్పిరిట్, హై-స్పీడ్ డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ సహా దాదాపు 5.4 మిలియన్ టన్నుల యూరో -6 ప్రామాణిక ఇంధనాలను ఉత్పత్తి చేస్తుందన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా హెచ్‌డీపీఈ, ఎల్‌డీపీఈ, ఎల్‌ఎల్‌డీపీఈ, పాలిప్రొపైలీన్, పాలివినైల్ క్లోరైడ్ వంటి డౌన్‌స్ట్రీమ్ ఉత్పత్తులు, బై-ప్రొడక్ట్స్ కూడా ఉత్పత్తి అవుతాయని వివరించారు. దేశ రసాయన, పెట్రో కెమికల్ రంగం 2040 నాటికి ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నామని చెప్పారు.
ఈ వార్తలనూ చదవండి:
గంటల వ్యవధిలోనే రోడ్లు మంజూరు చేసిన డిప్యూటీ సీఎం పవన్
ఎక్కువ ధరకు గణేశ్ లడ్డూ వేలం పాడడంపై వివాదం.. వ్యక్తి ఆత్మహత్య