Share News

మనమే గెలవాలి!

ABN , Publish Date - Nov 19 , 2026 | 02:49 AM

ఏ ఎన్నికలు జరిగినా విజయం మనదే కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఎన్నికల్లో ప్రతి ఒక్క ఓటూ ముఖ్యమేనని.. ప్రతి ఇంటికీ వెళ్లాలని..

మనమే గెలవాలి!

  • ‘ఒక కూటమి.. 3 పార్టీలు’.. ఇదే మన విధానం: సీఎం

  • 2029 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పనిచేయాలి

  • 23 పట్టణ సంస్థలు, పంచాయతీల్లో.. కూటమి అభ్యర్థులను గెలిపించే బాధ్యత మీదే

  • ప్రతి ఓటూ మనకు ముఖ్యమే

  • ప్రతి ఇంటికీ వెళ్లాలి.. ప్రతి ఒక్కరినీ ఓటడగాలి

  • క్షేత్ర స్థాయిలో సమన్వయంతో పని చేయాలి

  • పొత్తు ధర్మాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలి

  • కూటమి ఐక్యత శాశ్వతంగా నిలవాలి

  • టీడీపీ శ్రేణులకు చంద్రబాబు స్పష్టీకరణ

  • ముఖ్య నేతలు, గ్రామ కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్‌

ప్రజలు మంచి చెడులను విశ్లేషించి ఓట్లేస్తున్నారు. ఇది ఇటీవలి మున్సిపల్‌, పరిషత్‌ ఎన్నికల్లో నిరూపితమైంది. మన ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను వివరించేందుకు పంచాయతీ ఎన్నికలూ ఓ వేదిక కావాలి.

- సీఎం చంద్రబాబు

అమరావతి, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): ఏ ఎన్నికలు జరిగినా విజయం మనదే కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఎన్నికల్లో ప్రతి ఒక్క ఓటూ ముఖ్యమేనని.. ప్రతి ఇంటికీ వెళ్లాలని.. ప్రతి ఒక్కరినీ ఓటడగాలని స్పష్టం చేశారు. ‘‘ఐక్యతే మన బలం.. ‘ఒక కూటమి.. మూడు పార్టీలు’.. ఇదే మన విధానం. 2029 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ వ్యవహరించాలి. దానికి అనుగుణంగా సమన్వయంతో పనిచేయాలి’’ అని టీడీపీ శ్రేణులకు స్పష్టం చేశారు. 23 పట్టణ స్థానిక సంస్థలు, పంచాయతీ ఎన్నికల్లో ఏ విధంగా పనిచేయాలన్న అంశంపై ఆ పార్టీ ముఖ్య నేతలు, గ్రామ స్థాయి కార్యకర్తలతో బుధవారం ఆయన టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

కూటమి మద్దతుదారులను గెలిపించే బాధ్యత వారిదేనన్నారు. ప్రభుత్వం చేసే మంచిని ప్రజలకు వివరించడంతోపాటు.. గొడ్డలి పార్టీ కుట్రలనూ చెప్పాలని వారికి దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర స్థాయిలో కూటమి పార్టీలు సమన్వయంతో ఉన్నట్లే.. క్షేత్ర స్థాయిలోనూ అంతే సమన్వయంతో పని చేయాలని సూచించారు. పొత్తు ధర్మాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలని, కూటమి ఐక్యత శాశ్వతంగా నిలవాలన్నదే తన ఆకాంక్షగా పేర్కొన్నారు. ఏ ఒక్క వార్డు ఓడినా ఎందుకు ఓడారో విశ్లేషిస్తానని చెప్పారు. గ్రామాల్లో ఐక్యత, నియోజకవర్గాల్లో ఐక్యతను విశ్లేషించి తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు.


మంచి నాయకత్వం ఇచ్చే సత్తా మనకే..

‘గ్రామస్థాయిలో మంచి నాయకత్వం రావాలి.. గ్రామస్థాయిలోనే సమస్యలకు పరిష్కారం లభించాలి. అన్ని స్థాయుల్లోనూ మంచి నాయకత్వాన్ని అందించే సత్తా కూటమి పార్టీలకే ఉంది’ అని సీఎం తెలిపారు. ప్రజలకు వాస్తవాలు అర్థమయ్యేలా చెప్పాలన్నారు. సంక్షేమ పథకాల ద్వారా ప్రతి వర్గానికి, ప్రతి కుటుంబానికి అండగా ఉంటున్నాం. సూపర్‌ సిక్స్‌ హామీలను నెరవేరుస్తున్నాం. పీ4 ద్వారా పేదరికంలో ఉన్న కుటుంబాలకు చేయూతనిచ్చేలా కార్యక్రమాన్ని రూపొందించాం.

కుటుంబానికి ఏం కావాలో.. గ్రామానికి ఏం చేయాలో ఆలోచించి సమకూరుస్తున్నాం. అర్హుడైనప్రతి వ్యక్తికీ లబ్ధి చేకూరుస్తున్నాం. మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా ప్రతి ప్రాంతాన్నీ అభివృద్ధి చేస్తున్నాం. పెద్దఎత్తున పెట్టుబడులు రప్పించి పారిశ్రామిభివృద్థి చేస్తున్నాం.. ఉపాధి, ఉద్యోగాలు కల్పిస్తున్నాం. రోడ్లు నిర్మిస్తున్నాం.. ఇరిగేషన్‌ ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నాం. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటడానికి ఇదో సదవకాశం’ అని చెప్పారు.

సొంత చెల్లి వ్యక్తిత్వాన్ని కించపరుస్తారా?

హింసే గొడ్డలి పార్టీ విధానమని, రాజకీయం కోసం ఆ ఏమైనా చేస్తుంది.. ఎంతకైనా దిగజారుతుందని చంద్రబాబు అన్నారు. తల్లి-చెల్లి అని కూడా చూడకుండా గొడ్డలి పార్టీ నేతలు కుట్రలకు పాల్పడతారని, సొంత చెల్లెలి వ్యక్తిత్వాన్ని కించపరిచేవారు రాజకీయాల్లో ఉండేందుకు అనర్హులని స్పష్టం చేశారు. ఆ పార్టీకి ఓటేయడానికి ప్రజలు ఇష్టపడడం లేదని, ఈ విషయం ఇప్పటికే నిరూపితమైందని చెప్పారు.

ఈ వార్తలనూ చదవండి:

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై జగన్‌కు లోకేశ్ కౌంటర్

పంజాబ్‌లో లారీ డ్రైవర్‌కు రూ.12 కోట్ల జాక్‌పాట్

Updated Date - Nov 19 , 2026 | 02:58 AM