Share News

ఉత్తమ ఫలితాలే లక్ష్యంగా

ABN , Publish Date - Nov 19 , 2026 | 12:08 AM

ఇంటర్మీడియట్‌లో ఉత్తమ ఫలితాలే లక్ష్యంగా ఇంటర్‌ బోర్డు అధికారులు అడుగులు వేస్తున్నారు.

ఉత్తమ ఫలితాలే లక్ష్యంగా

సంకల్ప దీక్ష

- ఈ నెల 24 నుంచి జూనియర్‌ కళాశాలల్లో ప్రత్యేక కార్యక్రమం

- విద్యార్థులకు 50 రోజుల పాటు స్టడీ అవర్స్‌

- శతశాతం ఉత్తీర్ణతకు అధికారుల చర్యలు

శ్రీకాకుళం ఎడ్యుకేషన్‌, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్‌లో ఉత్తమ ఫలితాలే లక్ష్యంగా ఇంటర్‌ బోర్డు అధికారులు అడుగులు వేస్తున్నారు. మెరుగైన పలితాల కోసం కార్యాచరణ సిద్ధం చేశారు. ఇంటర్‌ బోర్డు సూచనలకు అనుగుణంగా ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఈ నెల 24 నుంచి ఫిబ్రవరి 20 వరకు (సెలవు రోజులు మినహాయించి) సంకల్ప దీక్ష పేరుతో విద్యార్థులకు 50 రోజుల పాటు ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు. ఇటీవల నిర్వహించిన అర్ధ సంవత్సర పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా వివిధ సబ్జెక్టుల్లో వెనుబడిన విద్యార్థులకు స్టీడీ అవర్స్‌ నిర్వహించనున్నారు. ఉదయం 8.30 గంటల నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు ఈ ప్రత్యేక తరగతులు జరగనున్నాయి. అంతే కాకుండా ఎంసెట్‌, ఐఐటీ, నీట్‌ వంటి పరీక్షలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. తరగతిలో విద్యార్థుల ప్రతిభ ఆధారంగా ఏ, బీ గ్రేడుల్లో ఉన్న వారు బాగా చదువుతున్నట్లు, సీ, డీ గ్రేడ్‌ విద్యార్థులు ఇంకా మెరుగపడాల్సి ఉందని గుర్తించి వీరికి ప్రత్యేక శిక్షణ అందించనున్నారు. కొంతమంది అధ్యాపకులు విద్యార్థులను దత్తత తీసుకుని స్టడీ అవర్స్‌ నిర్వహించి ప్రత్యేకంగా చదివించే సంకల్పంతో ఉన్నారు.

- వచ్చే ఏడాది జనవరి 21 నుంచి ఎన్విరాన్‌ మెంట్‌ పరీక్షలు ప్రారంభమవుతాయి. వృత్తివిద్యా కోర్సులు అభ్యసించే వారికి జనవరి 27 నుంచి ఫిబ్రవరి పదో తేదీ వరకు ప్రాక్టికల్స్‌, రెగ్యులర్‌ విద్యార్థులకు ఫిబ్రవరి 1 నుంచి పదో తేదీ వరకు ప్రాక్టికల్స్‌ నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 24 నుంచి మార్చి 16 వరకు పబ్లిక్‌ పరీక్షలు జరగనున్నాయి. గతేడాది ప్రథమ సంవత్సర విద్యార్థులకు నూతన విధానంలో ప్రశ్నపత్రాలు రూపొందించి పరీక్షలు నిర్వహించారు. ఈ ఏడాది రెండో ఏడాది విద్యార్థులకు కూడా నూతన విధానంలో ప్రశ్నపత్రాలు ఉంటాయి.

పక్కాగా నిర్వహిస్తాం

జిల్లాలో 38 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు ఉన్నాయి. ప్రథమ, ద్వితీయ సంవత్సరంలో 12వేలమంది వరకు చదువుతున్నారు. ఈ నెల 24 నుంచిసంకల్పం పేరుతో ప్రత్యేక స్డడీ అవర్స్‌ను నిర్వహిస్తాం. ఫిబ్రవరి 20 వరకు 50 రోజుల పాటు నిర్వహిస్తారు. రోజువారీ పరీక్షలు నిర్వహించి వెనుక బడిన విద్యార్దులకు ప్రత్యేక శ్రద్ద తీసుకుంటారు. ఏ, బీ గ్రేడ్‌ల్లో ఉన్న విద్యార్ధులకు పోటీ పరీక్షల కూడా సిద్దం చేస్తారు. ప్రభుత్వ కళాశాల్లో సంకల్పం -27 కార్యాక్రమం పక్కాగా నిర్వహించడం జరుగుతుందిని గతేడాది నుండి ఈ కార్యాక్రమంను చేపడుతున్నట్లు జిల్లా ఇంటర్‌ వృత్తివిద్యాధికారి సురేష్‌ కుమార్‌ తెలిపారు.

Updated Date - Nov 19 , 2026 | 12:08 AM