రాజధానిని కాపాడిన తీర్పది
ABN , Publish Date - Nov 29 , 2026 | 12:55 AM
హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ఇచ్చిన తీర్పు రాష్ట్రాన్ని, అమరావతిని కాపాడిందని సీఎం చంద్రబాబు గుర్తుచేసుకున్నారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో అమరావతి నిర్మాణం
త్వరలోనే లీగల్ ఏఐ స్టాక్ అందుబాటులోకి తెస్తాం
సాంకేతికతతో కేసుల నిర్వహణ మరింత వేగవంతం
222 ఏళ్ల తూర్పుగోదావరి జిల్లా న్యాయస్థానం..
131 ఏళ్ల బార్ అసోసియేషన్ చారిత్రక వేడుకల్లో సీఎం చంద్రబాబు
రాజమహేంద్రవరం, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ఇచ్చిన తీర్పు రాష్ట్రాన్ని, అమరావతిని కాపాడిందని సీఎం చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. రాజధాని అమరావతిని అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నామని తెలిపారు. రాజమహేంద్రవరంలో శనివారం నిర్వహించిన ‘222 ఏళ్ల తూర్పుగోదావరి జిల్లా న్యాయస్థానం, 131 ఏళ్ల బార్ అసోసియేషన్ చారిత్రక వేడుకలు’ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. న్యాయవ్యవస్థలో సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించి కేసుల నిర్వహణను మరింత సమర్థంగా, వేగంగా మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోందని చెప్పారు. లీగల్ గవర్నెన్స్, లిటిగేషన్ మేనేజ్‌మెంట్ కోసం త్వరలోనే లీగల్ ఏఐ స్టాక్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపారు.
ప్రస్తుతం ఆన్‌లైన్ లిటిగేషన్ కేస్ మేనేజ్‌మెంట్ వ్యవస్థ ద్వారా 8.4 లక్షల కేసులను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఏఐ ఆధారంగా కేసుల విశ్లేషణ, కౌంటర్ అఫిడవిట్ల తయారీ, చట్టాలు, ప్రభుత్వ ఉత్తర్వులు, నిబంధనలు, కేసుల రికార్డులను ఒకే డిజిటల్ వేదికపైకి తీసుకురావడం ఈ వ్యవస్థ లక్ష్యమని పేర్కొన్నారు. ‘తాటి ఆకులపై తీర్పుల ప్రతులు రాసిన రోజుల నుంచి నేటి ఏఐ వరకూ న్యాయవ్యవస్థ ఎంతో అభివృద్ధి చెందింది. ఏపీ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లిసాగిల్ చరిత్రలో నిలిచిపోయారు’ అని చంద్రబాబు తెలిపారు. రాజమండ్రిలో పోక్సో ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు.
వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలకు వచ్చి పుణ్యస్నానాలు చేయాలని సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులను సీఎం కోరారు. అనంతరం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సరస వెంకట నారాయణ భట్టి, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ పమిడిఘంటం శ్రీ నరసింహ, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసాగిల్, త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రామచంద్రరావు, జస్టిస్ నయనాల జయసూర్య, జస్టిస్ దోనాడి రమేశ్, జస్టిస్ భట్టు దేవానంద్, జస్టిస్ రవినాథ్ తిల్హరి, తూర్పుగోదావరి జిల్లా న్యాయాధికారి జునైద్ అహ్మద్ మౌలానా, పలువురు న్యాయమూర్తులతో కలిసి వేడుకల సావనీర్‌ను చంద్రబాబు ఆవిష్కరించారు. స్థానిక పుష్కర ఘాట్‌లో న్యాయమూర్తులు కార్తిక దీపాలను వదిలారు.
ఈ వార్తలనూ చదవండి:
అమరావతి నిర్మాణాలపై వైసీపీ తప్పుడు ప్రచారం.. నిజాలు తేల్చిన ఏపీ ఫ్యాక్ట్ చెక్..