పదిలో పెరిగిన ఉత్తీర్ణత
ABN , Publish Date - May 01 , 2026 | 05:01 AM
పదో తరగతి పరీక్షల ఫలితాల్లో ఉత్తీర్ణత పెరిగింది. గతేడాది కంటే ఈసారి 4.15 శాతం మెరుగుపడింది. గతేడాది 81.14శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా..
85.25 శాతం విద్యార్థులు పాస్
గతేడాది కంటే 4.15శాతం ఎక్కువ
5,26,954 మంది ఉత్తీర్ణత
83.69శాతం మందికి ఫస్ట్ డివిజన్
మరోసారి అమ్మాయిలే టాప్
అబ్బాయిల కంటే 5.22శాతం ఎక్కువ
బాలికలు 2,67,321(87.9శాతం)
అబ్బాయిలు 2,59,633(82.68శాతం)
మన్యం ఫస్ట్.. అల్లూరి లాస్ట్
టాప్‌లో రెసిడెన్షియల్ స్కూళ్లు
విశాఖ బాలిక జ్ఞానేశ్వరి 599 మార్కులతో స్టేట్ టాపర్
47 మందికి 598 మార్కులు
2161 స్కూళ్లలో 100శాతం ఫలితాలు
16 పాఠశాలల్లో ఉత్తీర్ణత 0
అమరావతి, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి పరీక్షల ఫలితాల్లో ఉత్తీర్ణత పెరిగింది. గతేడాది కంటే ఈసారి 4.15 శాతం మెరుగుపడింది. గతేడాది 81.14శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా.. ఈ ఏడాది 85.25శాతం పాసయ్యారు. మొత్తంగా 6,18,131 మంది రెగ్యులర్ విద్యార్థులు పరీక్షలు రాయగా 5,26,954 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇక ఈ ఏడాది కూడా బాలికలదే పైచేయి. అబ్బాయిలు 2,59,633 (82.68శాతం) మంది, అమ్మాయిలు 2,67,321 (87.9శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. అబ్బాయిల కంటే అమ్మాయిలు 5.22శాతం ఎక్కువ మంది ఉత్తీర్ణులయ్యారు. పదో తరగతి పరీక్షల ఫలితాలను మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి లోకేశ్ గురువారం ఎక్స్ ద్వారా విడుదల చేశారు. 16 పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా పాస్ కాలేదు. 2161 పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణత నమోదైంది. జిల్లాల వారీగా చూస్తే పార్వతీపురం మన్యం జిల్లా 96.07శాతంతో టాప్‌లో నిలిచింది. అల్లూరి సీతారామరాజు జిల్లా 57.12 శాతంతో చివరిన ఉంది. మేనేజ్‌మెంట్ల వారీగా అయితే ఏపీ రెసిడెన్షియల్ స్కూళ్లు 96.04శాతం ఉత్తీర్ణతతో అగ్రస్థానంలో నిలిచాయి. ఇక పాసైన మొత్తం విద్యార్థుల్లో 83.69శాతం మంది ఫస్ట్ డివిజన్‌లో ఉత్తీర్ణులయ్యారు. విశాఖపట్నానికి చెందిన జ్ఞానేశ్వరి 599 మార్కులతో స్టేట్ టాపర్‌గా నిలిచింది. 47 మంది విద్యార్థులకు 598 మార్కులు రావడం విశేషం.
ద్వితీయ భాషలో దాదాపు అందరూ పాస్
సబ్జెక్టుల వారీగా చూస్తే.. ద్వితీయ భాషా సబ్జెక్టులో దాదాపుగా అందరూ ఉత్తీర్ణులయ్యారు. ఈ సబ్జెక్టులో 99.82శాతం ఉత్తీర్ణత సాధించారు. ఆ తర్వాత ఇంగ్లి్‌షలో 98.65శాతం, ప్రథమ భాషా సబ్జెక్టులో 93.95శాతం, సోషల్‌లో 93.92శాతం, గణితంలో 93.64శాతం, సైన్స్‌లో 91.28శాతం ఉత్తీర్ణత నమోదైంది.
ఏపీ రెసిడెన్షియల్ స్కూళ్లు 96.04శాతం
మేనేజ్‌మెంట్ల వారీగా ఉత్తీర్ణతను పరిశీలిస్తే.. ఏపీ రెసిడెన్షియల్ స్కూళ్లు 96.04శాతంతో టాప్‌లో ఉన్నాయి. 96.02శాతంతో బీసీ సంక్షేమ పాఠశాలలు ఆ తర్వాతి స్థానంలో నిలిచాయి. ప్రైవేటు పాఠశాలలు 95.29శాతం, మోడల్ 89.5శాతం, సాంఘిక సంక్షేమ 89.41శాతం, ఆశ్రమ్ పాఠశాలలు 70.09శాతం, కేజీబీడీలు 88.81శాతం, గిరిజన సంక్షేమ పాఠశాలలు 75.04శాతం, జిల్లా పరిషత్ 78.09శాతం, ఎయిడెడ్ 76.55శాతం, మున్సిపల్ పాఠశాలలు 72.02శాతం, ప్రభుత్వ మేనేజ్‌మెంట్ పాఠశాలలు 69.63శాతం ఉత్తీర్ణత సాధించాయి.
84 శాతం మందికి ఫస్ట్ డివిజన్
ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల్లో అత్యధికులు ఫస్ట్ డివిజన్‌లోనే పాసయ్యారు. మొత్తం 5,26,954 మంది ఉత్తీర్ణులైతే 4,40,995 (83.69శాతం) మంది ఫస్ట్ డివిజన్‌లో పాసయ్యారు. 62,572(11.87శాతం) మంది సెకండ్ డివిజన్‌లో, 23,387(4.44శాతం) మంది థర్డ్ డివిజన్‌లో పాసయ్యారు. జిల్లాల వారీగా చూస్తే.. పార్వతీపురం మన్యం 96.07 శాతం తో టాప్‌లో నిలిచింది. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ 95.85 శాతంతో ఆ తర్వాతి స్థానంలో ఉంది. విజయనగరం 91.08 శాతం తో మూడో స్థానంలో, అల్లూరి సీతారామరాజు చివరన, కర్నూలు చివరి నుంచి రెండో స్థానంలో ఉంది.
ఇతర మీడియాల్లోనూ మెరుగ్గా
తెలుగు మీడియంలో పరీక్షలు రాసిన 30,129 మందిలో 19,834 (65.83శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. ఇంగ్లిష్ మీడియం విద్యార్థులు 86.28శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇక హిందీ మీడియంలో 85.71శాతం, ఉర్దూలో 76.76శాతం, కన్నడలో 76.82శాతం, తమిళంలో 95.54శాతం, ఒడియా మీడియంలో 98.43శాతం విద్యార్థులు ఉతీర్ణత సాధించారు.
0 శాతం.. 100 శాతం
రాష్ట్రవ్యాప్తంగా 16 పాఠశాలల్లో సున్నా శాతం ఉత్తీర్ణత నమోదైంది. వీటిలో ఒక జడ్పీ పాఠశాల, రెండు ఎయిడెడ్, 11 ప్రైవేటు, రెండు ఆశ్రమ్ పాఠశాలలు ఉన్నాయి. ఈ మొత్తం పాఠశాలల్లో టెన్త్ పరీక్షలు రాసిన విద్యార్థులు 64 మంది మాత్రమే. మరోవైపు 2161 పాఠశాలలు వంద శాతం ఉత్తీర్ణత సాధించాయి. వీటిలో ప్రభుత్వ మేనేజ్‌మెంట్ స్కూళ్లు 12, జడ్పీ 399, మోడల్ 13, మున్సిపల్ స్కూల్ ఒకటి, ఏపీ రెసిడెన్షియల్ విద్యాసంస్థలు 11, సాంఘిక సంక్షేమ పాఠశాలలు 16, గిరిజన సంక్షేమ 15, కేజీబీవీలు 54, బీసీ సంక్షేమ 31, ఎయిడెడ్ 15, ప్రైవేటు 1,542, ఆశ్రమ్ పాఠశాలలు 52 ఉన్నాయి. గతేడాది 19 పాఠశాలల్లో సున్నా శాతం, 1681 బడుల్లో వంద శాతం ఉత్తీర్ణత నమోదైంది.
మే 25 నుంచి సప్లిమెంటరీ
సప్లిమెంటరీ పరీక్షలు మే 25 నుంచి జూన్ 4 వరకు జరుగుతాయని పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. మే 1 నుంచి 9 వరకు ఫీజులు చెల్లించవచ్చు. ఫైన్‌తో 24 వరకు కట్టొచ్చు. అలాగే 1 నుంచి 7 వరకు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తులను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. రీకౌంటింగ్‌కు సబ్జెక్టుకు రూ.500, రీవెరిఫికేషన్‌కు సబ్జెక్టుకు రూ.వెయ్యి చెల్లించాలి. ఉత్తీర్ణులైన విద్యార్థుల ఒరిజినల్ మార్కుల మెమోలు త్వరలో పాఠశాలలకు పంపుతారు.
ఫెయిలైన విద్యార్థులకు ఫోన్ కాల్స్: డైరెక్టర్
పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు భరోసానిచ్చేందుకు, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా టీచర్ల ద్వారా ఫోన్ కాల్స్ చేయిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. ఫెయిలైన విద్యార్థులపై ఎక్కువ దృష్టి సారిస్తామన్నారు. పాఠశాలల వారీగా విద్యార్థుల జాబితాలు సేకరించి మండల లేదా పాఠశాల స్థాయిల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించి సప్లిమెంటరీ పరీక్షలకు సన్నద్ధం చేస్తామని తెలిపారు. ఉత్తీర్ణత శాతం పెరగడం, బాలికల ఉత్తీర్ణత ఇంకా పెరగడం మంచి పరిణామమని అన్నారు. పరీక్షలకు ముందు పాఠశాల విద్యా శాఖ అమలు చేసిన వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక మంచి ఫలితాలకు దోహదం చేసిందన్నారు.
ఉత్తీర్ణత పెరగడం స్ఫూర్తిదాయకం: సీఎం
ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం 72.8 నుంచి 78.2కు పెరగడం స్ఫూర్తిదాయకమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పదో తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు శుభాకాంక్షలు చెబుతూ ఎక్స్‌లో పోస్టు చేశారు. బాలురు కంటే బాలికల ఉత్తీర్ణత 5.22ు పెరగడం సంతోషకరమన్నారు. విద్యా శాఖ రూపొందించిన వంద రోజుల ప్రణాళికతో ఉత్తమ ఫలితాలు వచ్చాయని ప్రశంసించారు. మంత్రి లోకేశ్, విద్యాశాఖ అధికారులు, టీచర్లు, సిబ్బందిని అభినందించారు.

ఆసుపత్రి నుంచి వచ్చి..
పట్టుదల, సంకల్పం ఉంటే సాధించలేనిదేమీ ఉండదని అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం తెనుగుపూడి అంబేడ్కర్ గురుకుల బాలుర పాఠశాల విద్యార్థి దుర్గాప్రసాద్ నిరూపించాడు. దుర్గాప్రసాద్ టెన్త్ పరీక్షల ముందు ప్రమాదవశాత్తూ మేడపై నుంచి కింద పడటంతో నడుము, వెన్నెముక దెబ్బతిన్నాయి. అయినా పరీక్షలు రాస్తానని పట్టుబట్టాడు. దీంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతడిని కుటుంబ సభ్యులు ఆటోలో పరీక్ష కేంద్రం వద్దకు తీసుకువచ్చి, అక్కడి నుంచి మోసుకుంటూ లోనికి తీసుకువెళ్లేవారు. విద్యార్థి ప్రమాదానికి గురైన విషయాన్ని జిల్లా అధికారులకు ప్రిన్సిపాల్ తెలియజేయడంతో సహాయకుడిని ఏర్పాటుచేశారు. తాజా ఫలితాల్లో దుర్గాప్రసాద్‌కు 439 మార్కులు వచ్చాయి.
4100 మంది.. 590 దాటారు
టెన్త్ ఫలితాల్లో ఏకంగా 4100 మంది విద్యార్థులకు 590 మార్కులు దాటాయి. ప్రభుత్వ మేనేజ్‌మెంట్లలో టాపర్లకు 596 మార్కులొచ్చాయి. బాపట్ల, కాకినాడ, కోనసీమ, నంద్యాల జిల్లాల్లో నలుగురు విద్యార్థులకు 596 మార్కులు వచ్చాయి.
ఓపెన్ స్కూల్ ఫలితాలు విడుదల
టెన్త్, ఇంటర్మీడియట్ ఫలితాలను ఓపెన్ స్కూల్ సొసైటీ గురువారం విడుదల చేసింది. పదో తరగతిలో 24,949 మంది పరీక్షలు రాయగా, 6277 (25.12శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్మీడియట్ పరీక్షలను 55,048 మంది రాయగా, 23,755(43.15శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. టెన్త్ ఉత్తీర్ణతలో 83.07 శాతంతో కోనసీమ జిల్లా టాప్‌లో నిలిచింది. 1.03 శాతంతో బాపట్ల చివరన ఉంది. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతలో 79.55 శాతంతో కోనసీమ టాప్‌లో ఉండగా, 10.33 శాతంతో బాపట్ల చివరన నిలిచింది.
లోకేశ్‌కు అభినందనలు
పదో తరగతి ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం గణనీయంగా పెరగడం అభినందనీయమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. లోకేశ్ దార్శనికత, పక్కా ప్రణాళికతో విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది పడిందన్నారు. కాగా విద్యావంతుడైన నాయకుడు విద్యాశాఖ బాధ్యతలు చేపడితే ఫలితాలు ఎంత అద్భుతంగా ఉంటాయో పదో తరగతి ఫలితాలు నిరూపిస్తున్నాయని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు అన్నారు.
సంక్షేమ గురుకులాల హవా
పదోతరగతి పరీక్షల ఫలితాల్లో సాంఘిక సంక్షేమ శాఖకు చెందిన అంబేడ్కర్ గురుకుల విద్యార్థులు సత్తాచాటారు. 89 శాతానికి పైగా ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 13,538 మంది పరీక్షలు రాయగా, 12,115 మంది పాసయ్యారు. ఇక మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ గురుకుల పాఠశాలల విద్యార్థులు 96.02 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. 5501 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 5274 మంది పాసయ్యారు. గత ఏడాది కంటే బీసీ గురుకులాల్లో ఉత్తీర్ణత 1.02 శాతం పెరిగింది. మంత్రులు డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి, సవిత విద్యార్థులను అభినందించారు.
ప్రత్యేక పాఠశాలల విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత
విభిన్న ప్రతిభావంతులు, ట్రాన్స్‌జెండర్లు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు టెన్త్ ఫలితాల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి. మొత్తం 54 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా, అందరూ ఉత్తీర్ణులయ్యారు. విద్యార్థులకు మంత్రి డోలా అభినందనలు తెలిపారు.
డాక్టర్ కావాలన్నదే లక్ష్యం
-స్టేట్ టాపర్ జ్ఞానేశ్వరి
పదో తరగతి పరీక్షల్లో విశాఖకు చెందిన కొత్తపల్లి జ్ఞానేశ్వరి 600 మార్కులకు 599 సాధించి స్టేట్ టాపర్‌గా నిలిచింది. ఇంగ్లిష్ (99) మినహా మిగిలిన ఐదు సబ్జెక్టులలో 100కు 100 మార్కులు సాధించింది. ఎన్‌ఏడీ జంక్షన్‌లోని శ్రీచైతన్య పాఠశాలలో చదివింది. జ్ఞానేశ్వరి తండ్రి శ్రీనివాసరావు అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం దిమిలి ఉన్నత పాఠశాలలో తెలుగు స్కూల్ అసిస్టెంట్‌గా, తల్లి విజయభారతి నేవల్ డాక్‌యార్డులో పనిచేస్తున్నారు. ‘రాష్ట్రస్థాయిలో మొదటి స్థానం సాధించినందుకు ఎంతో ఆనందంగా ఉంది. డాక్టర్ కావాలన్నదే నా ఆశయం. నాకు చిన్నతనం నుంచి వైద్యం అందించిన పిల్లల వైద్య నిపుణుడు డాక్టర్ బీవీ ఆదినారాయణ ప్రేరణ. ఎప్పుడైనా ఒత్తిడి అనిపిస్తే బొమ్మలు గీసే అలవాటుంది. ఎక్కువగా కథల పుస్తకాలు చదువుతుంటాను. స్టేట్ టాపర్‌గా నిలవడం వెనుక తల్లిదండ్రులు, స్కూలు టీచర్ల కృషి, ప్రోత్సాహం ఎంతో ఉంది’ అని కొత్తపల్లి జ్ఞానేశ్వరి సంతోషం వ్యక్తం చేసింది.

తల్లీతనయుల ఉత్తీర్ణత
తిరుపతి జిల్లా రేణిగుంటకు చెందిన తల్లి, తనయుడు పదో తరగతి పరీక్షల్లో ఒకేసారి ఉత్తీర్ణులయ్యారు. రేణిగుంట పట్ణణంలోని బుగ్గవీధికి చెందిన శిరీష బ్యూటీపార్లర్ నిర్వహిస్తున్నారు. టెన్త్ మధ్యలో మానేసిన ఆమెకు రెండు దశాబ్దాల తర్వాత చదువుకోవాలని ఆసక్తి కలిగింది. చిన్నకుమారుడు శ్రీహర్షతో కలసి టెన్త్ పరీక్షలు రాశారు. తాజా ఫలితాల్లో ఇద్దరూ ఉత్తీర్ణులయ్యారు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణానికి చెందిన తల్లీకుమారుడు బండారు లక్ష్మీలహరి, విజయ్ ఒకేసారి టెన్త్ పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు. బండారు లక్ష్మీలహరి ఏపీవోఎస్‌ఎస్ ద్వారా పదో తరగతి పరీక్షలు రాశారు. విజయ్ 562 మార్కులతో మంచి ప్రతిభ కనబరిచాడు. లక్ష్మీలహరి 500 మార్కులకు 360 మార్కులు సాధించారు.

తండ్రీతనయ ఘనత
పల్నాడు జిల్లా రెంటచింతల మండలం మల్లవరం గ్రామానికి చెందిన జిల్లా బాబురావు(42), ఆయన కుమార్తె చిట్టి ఇద్దరూ పదో తరగతి పరీక్షల్లో ఒకేసారి పాసయ్యారు. జిల్లా బాబురావు పరాశక్తి సిమెంట్ ఫ్యాక్టరీలో వెల్డర్‌గా పనిచేస్తున్నారు. 24 ఏళ్ల క్రితం 9వ తరగతి వరకు చదివారు. ఇన్నేళ్ల తర్వాత టెన్త్ పరీక్షలకు సిద్ధమయ్యారు. ఈ ఏడాది చిట్టి పదో తరగతి పరీక్షలు రాయగా, బాబురావు కూడా ఓపెన్ స్కూల్ ద్వారా ఫీజు చెల్లించి పదో తరగతి పరీక్షలు రాశారు. కుమార్తెకు 448 మార్కు లు రాగా, తండ్రికి 257 మార్కులు వచ్చాయి.

అమ్మ చనిపోయిన బాధలోనూ..
చిత్తూరు జిల్లా నగరి మున్సిపాలిటీ పరిధిలోని నెత్తంకండ్రిగకు చెందిన పూర్ణిమ బాలికల ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదివింది. పబ్లిక్ పరీక్షల ప్రారంభానికి ముందురోజు ఆమె తల్లి మరణించింది. అంతటి దుఃఖంలోనూ పదో తరగతి పరీక్షలు రాసి 530 మార్కులు సాధించింది.