ఆంధ్రజ్యోతి కథనానికి స్పందించిన అధికార యంత్రాంగం
ABN , Publish Date - Mar 18 , 2026 | 12:22 PM
ఏపీలో శనగ రైతులు పడుతోన్న ఇబ్బందుల మీద ఆంధ్రజ్యోతి ప్రచురించిన కథనానికి అధికార యంత్రాంగం స్పందిస్తోంది. బాపట్ల జిల్లా మార్క్‌ఫెడ్ మేనేజర్ కరుణశ్రీ ఈ అంశంపై తీసుకుంటోన్న చర్యల గురించి వివరించారు.
ఆంధ్రజ్యోతి, ఫిబ్రవరి 18: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శనగ రైతులను ఆదుకోవడంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి తనవంతుగా చేసిన ప్రయత్నం సఫలీకృతం అయ్యింది. రైతుల సమస్యలను ప్రస్తావిస్తూ ఆంధ్రజ్యోతి కథనం ప్రచురించడం, అదే కథనాన్ని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డైరెక్టర్ భాను ప్రకాశ్ కోగంటి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అధికార యంత్రాంగం స్పందించింది. బాపట్ల జిల్లా మార్క్‌ఫెడ్ మేనేజర్ కరుణశ్రీ ఈ అంశంపై తీసుకుంటోన్న చర్యల గురించి ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి వివరించారు. దళారుల్ని నమ్మి రైతులు తమ పంటను తక్కువ ధరకు అమ్ముకోవద్దని సూచించారు. ప్రభుత్వం నిర్ధారించిన మద్దతు ధర మేరకు రైతుల నుంచి పంట కొనుగోలు చేస్తామని వివరించారు.
ఈ అంశంపై 'ఏబీఎన్ ఆంధ్రజ్యోతి' డైరెక్టర్ కోగంటి భాను ప్రకాశ్ హర్షం వ్యక్తం చేశారు. శనగ రైతుల సమస్యపై వెంటనే స్పందించినందుకు కరుణశ్రీకి ధన్యవాదాలు తెలిపారు. సమస్యను సరైన వారి దృష్టికి తీసుకెళ్తే వేగంగా పరిష్కారమవుతుందని మరోసారి నిరూపణ అయ్యిందని ఆయన 'ఎక్స్' ఖాతాలో పోస్ట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వ్యవసాయ శాఖ పనితీరును డిజిటలైజ్ చేయడం, క్షేత్రస్థాయిలో రైతులకు మెరుగైన సేవలు అందించడం కోసం 'APAIMS 2.0' తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ఈ యాప్ ద్వారా ఏపీ రైతులకు పలు విధాలుగా లబ్ధి చేకూరుతోంది.
అయితే, ఇప్పుడు ఏపీలోని ముఖ్యంగా ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, కర్నూలు, అనంతపురం జిల్లాలలో శనగ పండించిన రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయారు.
సమీప భవిష్యత్‌లో ఏ పంట వేయాలో తెలియక, ప్రత్యామ్నాయ పంటలు లేక అయోమయంలో ఉన్నారు. రాష్ట్రంలో నల్లబర్లీ పొగాకు సాగు నిషేధం నేపథ్యంలో అత్యధికంగా రైతులు శనగ పంటను సాగు చేసిన సంగతి తెలిసిందే. ఈ అంశం మీద 'ఏబీఎన్ ఆంధ్రజ్యోతి' డైరెక్టర్ కోగంటి భాను ప్రకాశ్ రైతుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దీంతో ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి.. రైతులకు అవసరమైన సూచనలు చేశారు.
ఇవి కూడా చదవండి..
సెలవు ఇవ్వలేదని.. బ్యాంక్ మేనేజర్‌ను కాల్చేసిన గార్డ్..
మీ కళ్లకు పరీక్ష.. ఈ గడ్డిలో పాము ఎక్కడుందో 15 సెకెన్లలో కనిపెట్టండి..