రిజర్వేషన్లకు రాజముద్ర
ABN , Publish Date - Oct 11 , 2026 | 03:51 AM
స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లపై రాష్ట్ర క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ సిఫారసుల ఆధారంగా బీసీ రిజర్వేషన్లను ఖరారు చేసింది.
స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు క్యాబినెట్ ఆమోదం
మిశ్రా కమిషన్ సిఫారసులను ఆమోదించిన మంత్రివర్గం
వార్డు సభ్యులకు పంచాయతీ యూనిట్‌గా రిజర్వేషన్ శాతం
జడ్పీ/ మున్సిపల్ చైర్‌పర్సన్, మేయర్‌కు రాష్ట్రం యూనిట్
సర్పంచ్, ఎంపీటీసీలకు మండలం యూనిట్‌గా నిర్ణయం
కమిషన్ సిఫారసుల ప్రకారం బీసీ కోటా ఇలా..
గ్రామ వార్డు సభ్యులు: 26.73 శాతం సర్పంచ్‌లు: 27.95 శాతం
ఎంపీటీసీలు: 25.55 శాతం ఎంపీపీలు, జడ్పీటీసీలు: 24.6 శాతం
జడ్పీ చైర్‌పర్సన్‌లు: 23.08 శాతం మున్సిపల్ వార్డులు:32.78 శాతం
మున్సిపల్ చైర్‌పర్సన్‌లు: 33.02 శాతం, మేయర్‌కు 35.29 శాతం
అమరావతి, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లపై రాష్ట్ర క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ సిఫారసుల ఆధారంగా బీసీ రిజర్వేషన్లను ఖరారు చేసింది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో స్థానిక ఎన్నికలు వెంటనే నిర్వహించాలని నిర్ణయించిన ప్రభుత్వం... శనివారం ప్రత్యేక క్యాబినెట్ సమావేశం నిర్వహించింది. ఈ భేటీలో మిశ్రా కమిషన్ సిఫారసులను ఆమోదించడంతో రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలతో పాటు బీసీ రిజర్వేషన్ల అంశం కొలిక్కి వచ్చింది.
గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు, సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీ, జడ్పీ చైర్మన్, మున్సిపల్ వార్డు సభ్యులు, మున్సిపల్ చైర్‌పర్సన్, మేయర్ సహా ఎనిమిది కేటగిరీల్లో రిజర్వేషన్లను ప్రభుత్వం ఖరారు చేసింది. పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల ద్వారా సేకరించిన సమాచారం ప్రకారం రాష్ట్ర మొత్తం జనాభా 5,27,46,589 కాగా, అందులో బీసీలు 2,65,94,418 (50.42 శాతం)గా కమిషన్ తేల్చింది. గ్రామీణ జనాభాలో 48.84శాతం, పట్టణ జనాభాలో 54.36శాతం బీసీలు ఉన్నారని పేర్కొంది.
యూనిట్‌ల వారీగా రిజర్వేషన్ల శాతం
సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ప్రతి స్థానిక సంస్థకు బీసీ రిజర్వేషన్లపై వేర్వేరుగా సిఫారసులు చేశారు. వార్డు సభ్యులకు రిజర్వేషన్ శాతాన్ని నిర్ణయించేందుకు గ్రామ పంచాయతీని యూనిట్‌గా తీసుకుంటారు. సర్పంచ్, ఎంపీటీసీల రిజర్వేషన్లను మండలం యూనిట్‌గా, ఎంపీపీ, జడ్పీటీసీ రిజర్వేషన్లను జిల్లా యూనిట్‌గా, జడ్పీ చైర్‌పర్సన్, మున్సిపల్ చైర్‌పర్సన్/ మేయర్ రిజర్వేషన్లను రాష్ట్రం యూనిట్‌గా నిర్ణయిస్తారు. మున్సిపల్ వార్డు సభ్యులకు మున్సిపాలిటీ/ మున్సిపల్ కార్పొరేషన్ యూనిట్‌గా తీసుకుంటారు. సంబంధిత యూనిట్‌లోని మొత్తం జనాభాలో ఆయా వర్గాల నిష్పత్తి ప్రాతిపదికన తొలుత ఎస్టీలు, అ తర్వాత ఎస్సీలకు సీట్లు కేటాయిస్తారు.
ఏ ప్రాంతంలో అయినా ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు ఎక్కువగా ఉంటే, మొత్తం పరిమితి 50 శాతానికి మించకుండా బీసీ రిజర్వేషన్లను దానికి అనుగుణంగా మారుస్తారు. షెడ్యూల్డ్ ప్రాంతాలు, షెడ్యూల్డ్ తండాలతో పాటు ఎస్సీ, ఎస్టీ జనాభా కలిపి 50 శాతం కంటే ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో బీసీ రిజర్వేషన్లకు అవకాశం లేని యూనిట్లకు ఈ లెక్కల నుంచి మినహాయిస్తారు.
‘స్థానికంలో 50 శాతం లోపే రిజర్వేషన్లు
బీసీ సంక్షేమ శాఖ ఉత్తర్వులు విడుదల
స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లకు సంబంధించి బీసీ సంక్షేమ శాఖ శనివారం ఉత్తర్వులు విడుదల చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు కలిపి రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని స్పష్టం చేసింది. రిజర్వేషన్ల అమల్లో రాజ్యాంగ నిబంధనలు, న్యాయస్థానాల ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది. మున్సిపాలిటీల్లో ఎస్సీ, ఎస్టీలకు కేటాయించే స్థానాలను వారి జనాభా నిష్పత్తి ఆధారంగా నిర్ణయించాలని పేర్కొంది. పంచాయతీలకు సంబంధించి రాజ్యాంగంలోని ఆర్టికల్ 243డీ, మున్సిపాలిటీలకు సంబంధించి ఆర్టికల్ 243టీ నిబంధనలను అనుసరించాలని స్పష్టం చేసింది. కమిషన్ సిఫారసుల అమలుకు తగిన చర్యలు చేపట్టాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖలను ప్రభుత్వం ఆదేశించింది.
ఈ వార్తలనూ చదవండి:
ఎవరు అడ్డొచ్చినా నెట్టుకుంటూ పోతాం
దసరాలోపు 2వ విడత తల్లికి వందనం..!