నెలలో డీఎస్సీ 2.0
ABN , Publish Date - Oct 02 , 2026 | 04:14 AM
నెల రోజుల్లోగా డీఎస్సీ 2.0 నోటిఫికేషన్ విడుదలకు చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి లోకేశ్ ఆదేశించారు. గురువారం ఉండవల్లిలోని నివాసంలో విద్యాశాఖపై ఆయన సమీక్షించారు. నోటిఫికేషన్ నుంచి అభ్యర్థులకు పోస్టింగ్ ఆర్డర్లు ఇచ్చే వరకూ...
నోటిఫికేషన్ నుంచి పోస్టింగ్ ఆర్డర్లు ఇచ్చేవరకూ ప్రతి దశలోనూ పారదర్శకత
టెన్త్‌లో ఉత్తమ ఫలితాలకు ‘మిషన్ మార్చ్’
కమ్యూనిటీ లీడర్ల భాగస్వామ్యంతో ‘జీరో డ్రాపౌట్ మిషన్’ చేపట్టాలి
నియోజకవర్గానికి ఒకటి చొప్పున 175 బడులు లీప్ స్కూళ్లుగా అభివృద్ధి
125 ఆటిజం సెంటర్ల ఏర్పాటుకు చర్యలు
విద్యాశాఖపై సమీక్షలో అధికారులకు మంత్రి లోకేశ్ ఆదేశాలు
అమరావతి, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): నెల రోజుల్లోగా డీఎస్సీ 2.0 నోటిఫికేషన్ విడుదలకు చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి లోకేశ్ ఆదేశించారు. గురువారం ఉండవల్లిలోని నివాసంలో విద్యాశాఖపై ఆయన సమీక్షించారు. నోటిఫికేషన్ నుంచి అభ్యర్థులకు పోస్టింగ్ ఆర్డర్లు ఇచ్చే వరకూ ప్రతి దశలోనూ పారదర్శకత పాటించాలని స్పష్టం చేశారు. ఏపీలో జరుగుతున్న రిక్రూట్‌మెంట్ విధానాన్ని దేశం మొత్తం ఆసక్తిగా గమనిస్తోందని, మన విధానాలను ఇతర రాష్ర్టాలు అనుసరించే అవకాశం ఉందని చెప్పారు. పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాల సాధనే లక్ష్యంగా ‘మిషన్ మార్చ్’ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. కమ్యూనిటీ లీడర్ల భాగస్వామ్యంతో ‘జీరో డ్రాపౌట్ మిషన్’ చేపట్టాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆదర్శంగా తీర్చిదిద్దిన నిడమర్రు పాఠశాల సందర్శనకు సింగపూర్ మంత్రి షణ్ముగంను ఆహ్వానిస్తామని తెలిపారు. నియోజకవర్గానికి ఒకటి చొప్పున 175 పాఠశాలలను గుర్తించి లీప్ స్కూళ్లుగా అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు పంపాలని మంత్రి ఆదేశించారు.
వర్సిటీల్లో అధ్యాపక పోస్టుల భర్తీ
యూనివర్సిటీల్లో అధ్యాపక పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టాలని లోకేశ్ ఆదేశించారు. అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ పూర్తయిందని, డిసెంబరులో రాత పరీక్ష నిర్వహణకు ఏపీపీఎస్సీ ఏర్పాట్లు చేస్తోందని ఉన్నత విద్య కమిషనర్ భరత్ గుప్తా వివరించారు. జేఎస్ఎస్, థాపర్, యూపీఈఎస్, జేయూఎస్, బెన్నెట్, సవిత యూనివర్సిటీలు రాష్ట్రంలో క్యాంప్‌సలు ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయని అధికారులు తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ విద్యాసంస్థల క్యాంప్‌సల ఏర్పాటుకు అవసరమైన భూమిని గుర్తించి, త్వరగా నిర్మాణాలు ప్రారంభించేలా చూడాలని మంత్రి సూచించారు.
ఒకేచోట ఆటిజం, భవిత సెంటర్లు
రాష్ట్రంలో ‘సాల్ట్’ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలుచేయాలని లోకేశ్ ఆదేశించారు. 125 ఆటిజం సెంటర్ల ఏర్పాటుకు త్వరితగతిన చర్యలు తీసుకోవాలన్నారు. 21 ఆటిజం సెంటర్ల ఏర్పాటుకు అవసరమైన కౌన్సిలర్లను గుర్తించామని సమగ్రశిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావు తెలిపారు. ఆటిజం, భవిత సెంటర్లు ఒకేచోట ఉండేలా చూడాలని మంత్రి సూచించారు. ఈ నెలాఖరుకు 14 సెంటర్ల నిర్మాణ పనులు పూర్తిచేస్తామని అధికారులు పేర్కొన్నారు. విశాఖపట్నంలో కొత్తగా నిర్మించబోతున్న గ్రంథాలయాల నమూనాలను మంత్రి పరిశీలించారు. నైపుణ్య శిక్షణ కార్యక్రమాల ద్వారా యువతకు పెద్దఎత్తున ఉద్యోగ, ఉపాధి కల్పనకు చర్యలు తీసుకోవాలని నైపుణ్యాభివృద్ధి శాఖ అధికారులను లోకేశ్ ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 192 పీఎంకేవీవై కేంద్రాల అప్‌గ్రెడేషన్ చేయాలని నిర్ణయించారు. నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా ఇప్పటివరకూ 5.43 లక్షల మంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించినట్లు అధికారులు వివరించారు. యువతకు నైపుణ్య శిక్షణ అందించడంలో ఏపీ రెండో స్థానంలో నిలిచిందని తెలిపారు. సీడాప్ ద్వారా ఏడాదికి లక్ష మందికి ఉద్యోగాలు రావాలనే లక్ష్యంతో పనిచేయాలని మంత్రి ఆదేశించారు. పీఎం సేతు పథకం కింద అన్ని క్లస్టర్లకు పారిశ్రామిక భాగస్వాములను త్వరితగతిన ఎంపిక చేయాలని సూచించారు.
ఈ వార్తలనూ చదవండి:
వివేకా కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం.. వారికి నోటీసులు