ప్రభుత్వ భూములకు స్కెచ్
ABN , Publish Date - Oct 02 , 2026 | 12:56 AM
బుచ్చెయ్యపేట మండలం రాజాం గ్రామంలో కోట్లాది రూపాయల విలువ చేసే కొండవాగు, పోరంబోకు భూమిపై కబ్జాదారుల కన్ను పడింది. ఈ భూమిలో పెద్ద రేకుల షెడ్డు వేశారు. మిగిలిన భూమిని సాగుకు అనుకూలంగా చదును చేస్తున్నారు. ఆక్రమణదారులంతా అధికారంలో వున్న ఒక పార్టీకి చెందిన ముఖ్య నాయకుడి అనుచరులు కావడంతో అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. భారీ భూకబ్జాకు సంబంధించి పూర్వాపరాలిలా వున్నాయి.
దర్జాగా ఆక్రమణ, చదును పనులు
తెరవెనుక అధికార పార్టీ నేతలు
బుచ్చెయ్యపేట మండలం రాజాంలో 27 ఎకరాల కొండవాగు పోరంబోకు భూమి కబ్జా
సాగుదారుల పేరిట పట్టాల కోసం తీవ్రప్రయత్నాలు
మార్కెట్ విలువ రూ.10 కోట్లుపైమాటే
పరవాడ మండలం కలపాకలో 13 ఎకరాల ఆక్రమణ
వారం రోజుల నుంచి ఎక్స్‌కవేటర్లతో చదును పనులు
పట్టించుకోని రెవెన్యూ అధికారులు
(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)
బుచ్చెయ్యపేట మండలం రాజాం గ్రామంలో కోట్లాది రూపాయల విలువ చేసే కొండవాగు, పోరంబోకు భూమిపై కబ్జాదారుల కన్ను పడింది. ఈ భూమిలో పెద్ద రేకుల షెడ్డు వేశారు. మిగిలిన భూమిని సాగుకు అనుకూలంగా చదును చేస్తున్నారు. ఆక్రమణదారులంతా అధికారంలో వున్న ఒక పార్టీకి చెందిన ముఖ్య నాయకుడి అనుచరులు కావడంతో అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. భారీ భూకబ్జాకు సంబంధించి పూర్వాపరాలిలా వున్నాయి.
బుచ్చెయ్యపేట మండలం రాజాం గ్రామంలో సర్వే నంబర్ 261లో సుమారు 27 ఎకరాల కొండవాగు, పోరంబోకు భూమి ఉంది. గ్రామంలో ప్రధాన రహదారి పక్కన వున్న జిరాయితీ ఎకరా రూ.50 లక్షలు పలుకుతున్నది. దీంతో ప్రధాన రహదారికి చేరువలో, కొంతకాలం క్రితం మూతపడిన జీడి పిక్కల ఫ్యాక్టరీకి సమీపంలో కోట్లాది రూపాయల విలువ చేసే కొండవాగు, పోరంబోకు భూమి కబ్జాదారుల కన్నుపడింది. వీరికి కూటమిలో ఒక పార్టీకి చెందిన ముఖ్య నేత అండదండలు పుష్కలంగా వున్నట్టు స్థానికులు చెబుతున్నారు. ఆక్రమణదారులు ప్రభుత్వ పోరంబోకు భూమిలో ఒక పెద్ద రేకుల షెడ్డు వేశారు. మిగిలిన భూమిని ట్రాక్టర్లతో దున్ని, ఎత్తుపల్లాలను సరిచేశారు. సదరు నాయకుడు.. తనకున్న పలుకుబడితో బినామీల పేరున పట్టాలు మంజూరు చేయించడానికి కలెక్టరేట్ స్థాయిలో పావులు కదుపుతున్నారు. ఈ భూమిని చాలా ఏళ్ల నుంచి పేద రైతులు సాగు చేసుకుంటున్నారని, అందువల్ల పట్టాలు మంజూరు చేయాలంటూ కొంతమంది పేర్లతో రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసినట్టు తెలిసింది. ప్రభుత్వ పోరంబోకు భూమిని ఆక్రమించి, రేకుల షెడ్డు నిర్మించడంతోపాటు మిగిలిన భూమిని చదును చేసినప్పటికీ స్థానిక రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది. ఆక్రమణదారులకు అండగా వున్నది అధికార పార్టీ ముఖ్యనేత కావడంతో రెవెన్యూ అధికారులు చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మార్కెట్ ధర ప్రకారం ఈ భూమి విలువ రూ.10 కోట్లుకుపైనే వుంటుంది. కాగా రాజాంలో సర్వే నంబర్ 261లో ప్రభుత్వ కొండవాగు భూమి ఉన్నమాట వాస్తవమేనని, అయితే ఇది ఆక్రమణకు గురైనట్టు తమకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని స్వర్ణ గ్రామ కార్యాలయం సర్వేయర్ కుమార్ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి, కొండవాగు భూమి ఆక్రమణకు గురైనట్టు నిర్ధారణ అయతే వీఆర్వో, తహశీల్దారు దృష్టికి తీసుకెళతామని చెప్పారు.
కలపాకలో 13 ఎకరాల కబ్జాకు యత్నాలు
పరవాడ మండలం కలపాక గ్రామ పరిధిలో ఏపీ ట్రాన్స్‌కో సబ్‌స్టేషన్‌కు సమీపంలో ప్రభుత్వ కొండపోరంబోకు భూమిని ఆక్రమించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కలపాక రెవెన్యూ పరిధిలోని సర్వే నంబరు 33లో సుమారు 13 ఎకరాల వాగు, పోరంబోకు భూమి వుంది. గ్రామానికి చెందిన ఒక నేత తెరవెనుక వుండి, వారం రోజుల నుంచి రాత్రిపూట ఎక్స్‌కవేర్లు, లోడర్లతో చదును చేయిస్తున్నారు. ప్రభుత్వ భూమి తాము సాగులో ఉన్నట్టు ప్రచారం చేసుకుంటూ డి.పట్టాల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. అయితే భూ కబ్జాపై గ్రామానికి చెందిన కొందరు మూడు రోజుల క్రితం రెవెన్యూ అధికారులకు, కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది.