పరిషత్ ఫలితాలు నేడే!
ABN , Publish Date - Nov 07 , 2026 | 04:02 AM
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు శనివారం వెలువడనున్నాయి. ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది.
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపునకు విస్తృత ఏర్పాట్లు
365 కేంద్రాలు.. 9062 టేబుళ్లు
ఒక్కో టేబుల్‌కు ఒక్కో సూపర్‌వైజర్
28,500 మంది కౌంటింగ్ సిబ్బంది
ఉదయం 8 నుంచి లెక్కింపు
తొలుత పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు
ఆ తర్వాత బ్యాలెట్ బాక్సుల్లోని జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల కౌంటింగ్
19,885 మంది పోలీసులతో భద్రత
సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీటీవీలు, డ్రోన్లతో నిఘా
అమరావతి, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు శనివారం వెలువడనున్నాయి. ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా 365 కౌంటింగ్ కేంద్రాల్లో సుమారు 9062 టేబుళ్లు ఏర్పాటుచేశారు. టేబుల్‌కో కౌంటింగ్ సూపర్‌వైజర్ ఉంటారు. వీరితో పాటు 11,002 మంది అసిస్టెంట్లు సహా 28,500 మంది కౌంటింగ్ సహాయకులు, ఇతర సిబ్బందిని నియమించినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్‌చంద్ర పునేఠా శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో 77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమయ్యారు.
మిగిలిన 582 జడ్పీటీసీ, 7767 ఎంపీటీసీ స్థానాలకు గాను గురువారం 577 జడ్పీటీసీ, 7706 ఎంపీటీసీ స్థానాలకు మాత్రమే గురువారం పోలింగ్ జరిగింది. తుఫాన్ ప్రభావంతో ఏలూరు జిల్లా వేలేరుపాడు, బుట్టాయగూడెం, పోలవరం, జీలుగుమిల్లి మండలాల్లో 4 జడ్పీటీసీ, 43 ఎంపీటీసీ స్థానాలకు, తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం మండలంలోని ఒక జడ్పీటీసీ, 18 ఎంపీటీసీల ఎన్నికలను శుక్రవారానికి వాయిదా వేశారు. శుక్రవారం వాటికి ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయి.
అలాగే బూత్‌ల స్వాధీనం, బ్యాలెట్ బాక్సుల ధ్వంసం వంటి ఘటనలతో అనంతపురం, కర్నూలు, శ్రీకాకుళం, మార్కాపురం, పల్నాడు జిల్లాల్లోని ఏడు పోలింగ్ కేంద్రాల్లో కూడా రీపోలింగ్ నిర్వహించారు. దరిమిలా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం పోలింగ్ శాతం 70.72గా నమోదైంది. ఓట్ల లెక్కింపులో తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. అనంతరం బ్యాలెట్ పత్రాలను లెక్కపెట్టి ఫలితాలు ప్రకటిస్తారు. టేబుళ్లలో 50 శాతం ఎంపీటీసీలకు కేటాయించారు. ప్రతి టేబుల్‌కు ఒక్కో రౌండ్‌లో 1000 బ్యాలెట్ పత్రాలను లెక్కించడానికి అందజేస్తారు.
భారీ పోలీసు బందోబస్తు..: ఐజీ
రాష్ట్రంలో జిల్లా, మండల పరిషత్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా, సజావుగా సాగేందుకు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఐజీ రాజకుమారి తెలిపారు. మొత్తం 365 కౌంటింగ్ కేంద్రాల్లో మూడంచెల భద్రతా వ్యవస్థ ఉంటుందని.. 19,885 మంది పోలీసు సిబ్బందిని మోహరించామని వెల్లడించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెట్టారు. సీసీటీవీ కెమెరాలు, డ్రోన్ నిఘాతో పాటు పోలీసు సిబ్బంది ధరించే బాడీవోర్న్ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ చేపట్టనున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రతను నిరంతరం పర్యవేక్షించేలా ముందస్తు చర్యలన్నీ తీసుకున్నట్లు ఐజీ వెల్లడించారు.
ఈ వార్తలనూ చదవండి:
సీఎం విజయ్‌కు ఫోన్ చేసి అదే చెప్పా: సీఎం చంద్రబాబు