Share News

కస్సు.. బస్సు!

ABN , Publish Date - May 13 , 2026 | 05:04 AM

కూటమి ప్రభుత్వం మహిళల కోసం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న ఉచిత ఆర్టీసీ బస్సు పథకం ‘స్త్రీ శక్తి’.. సిగపట్లకు వేదికగా మారుతోంది. తగినన్ని బస్సులు, సరిపడా సిబ్బందిని ఇవ్వకపోవడంతో ప్రయాణికులు నానా కష్టాలు పడుతున్నారు. కొత్త బస్సులు కొనడంలేదు. సిబ్బంది సంఖ్య పెరగడంలేదు.

కస్సు.. బస్సు!

  • ‘స్త్రీ శక్తి’ అమలుతో బస్సులన్నీ కిటకిట

  • గతంలో ఆర్టీసీలో రోజుకు 36 లక్షల మంది ప్రయాణం

  • ఉచిత ప్రయాణం తర్వాత రెట్టింపైన ప్రయాణికులు

  • ఆ మేరకు పెరగని బస్సులు, సిబ్బంది.. పైగా 264 బస్సులు,1438 మంది సిబ్బంది తగ్గుదల.. దాంతో అష్టకష్టాలు

  • సీటు కోసం కొట్లాటలు.. ప్రయాణంలో తీవ్ర అగచాట్లు

  • ప్రారంభ పాయింట్‌ వద్దే కిక్కిరిసిపోతున్న బస్సులు

  • ‘టికెట్‌ కొంటాం, సీటు చూపండి’ అంటున్న ప్రయాణికులు

  • కొత్త బస్సులు, సిబ్బంది వస్తేనే ప్రయాణం సుఖమయం

  • మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం... పథకం పేరు ‘స్త్రీ శక్తి’! మహిళా సాధికారత దిశగా మరో అడుగు! పథకానికి మంచి పేరు వచ్చింది. మహిళా ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. పండగలు పబ్బాలు, సెలవుల సమయంలో మరింత ఎక్కువ! కానీ... పెరిగిన ప్రయాణికులకు సరిపడా బస్సులేవీ? సిబ్బంది ఎక్కడ? కిటకిటలాడుతున్న బస్సుల్లో కూర్చునే చోటేదీ? చివరికి... ‘ఉచిత ప్రయాణం అక్కర్లేదు. మేం టికెట్‌ కొంటాం. బస్సులు పెట్టండి’ అని మహిళలే అడుగుతున్న పరిస్థితి!

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

కూటమి ప్రభుత్వం మహిళల కోసం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న ఉచిత ఆర్టీసీ బస్సు పథకం ‘స్త్రీ శక్తి’.. సిగపట్లకు వేదికగా మారుతోంది. తగినన్ని బస్సులు, సరిపడా సిబ్బందిని ఇవ్వకపోవడంతో ప్రయాణికులు నానా కష్టాలు పడుతున్నారు. కొత్త బస్సులు కొనడంలేదు. సిబ్బంది సంఖ్య పెరగడంలేదు. పైగా... గత ఏడాది ఆగస్టు 15న ఈ పథకం అమలులోకి రాగా... ఈ 267 రోజుల్లో సగటున రోజుకొకటి చొప్పున 264బస్సులు కాలం చెల్లి షెడ్డుకు చేరాయి. ఇదే సమయంలో 617మంది డ్రైవర్లు, 821మంది కండక్టర్లు పదవీ విరమణ చేశారు. అంటే.. మొత్తంగా 1438 మంది రిటైర్‌ అయ్యారు. ఇక ప్రయాణికుల సంఖ్యేమో ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది. ‘స్త్రీ శక్తి’ పథకం అమలుకు ముందు రోజుకు సగటున 36లక్షల మంది ఆర్టీసీ సేవలుపొందేవారు. పథకం అమలు తర్వాత రోజుకు 60లక్షల మంది ప్రయాణిస్తున్నారు. తొమ్మిది నెలల్లోనే 65 కోట్ల మంది మహిళా ప్రయాణికులు ఆర్టీసీ ఉచిత ప్రయాణ సేవల్ని పొందినట్లు లెక్కలు చెబుతున్నాయి. దీనివల్ల ప్రభుత్వానికి మంచిపేరు రావడం ఎంత నిజమో... ప్రయాణికులకు కష్టాలు పెరగడమూ అంతే నిజం. కొత్త బస్సులు కొనుగోలు చేసి ఇవ్వాల్సిన ప్రభుత్వం ఎలక్ట్రిక్‌ వాహనాల పాట పాడుతోంది. ఆ బస్సులు వచ్చేదెప్పుడు.. వాటికి తగిన మౌలిక సదుపాయాల కల్పన ఎలా.. అందులో కెపాసిటీకి మించి ప్రయాణికుల్ని ఎక్కిస్తే బ్యాటరీ బండి లాగుతుందా.. అనే ప్రశ్నలు ఆర్టీసీ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి.

4.jpg9.jpg


‘ఉచిత’ తీరుతో మరింతగా వేసవి సెగ

మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేయక ముందు ఏపీఎస్‌ ఆర్టీసీ బస్సుల్లో రోజుకు సరాసరి 18లక్షల మంది మహిళలు ప్రయాణించేవారు. పురుషులు సుమారు అంతే మొత్తంలో ఆర్టీసీ ప్రయాణాలు చేసేవారు. ఈ పథకాన్ని ప్రారంభించినప్పటి నుంచి మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగింది. ఇదే సమయంలో పురుష ప్రయాణికుల సంఖ్య భారీగా తగ్గింది. అప్పట్లో 62నుంచి 65శాతం మధ్యలో ఉన్న ఆక్యుపెన్సీ రేషియో గడిచిన తొమ్మిది నెలల్లో 87నుంచి 92మధ్య ఉంటోంది. ఈ వేసవి ప్రారంభం అయ్యాక ఒక్కో రోజు 102శాతం కూడా వస్తోంది. బస్సుల్లో సీట్లు లేకపోయినా ప్రయాణికులు సీట్ల కోసం సిగపట్లు పడుతూ, నిల్చొని గమ్యం చేరేందుకు ప్రయాస పడుతున్నారు. ఆర్టీసీ మార్గదర్శకాల మేరకు ఆక్యుపెన్సీ రేషియే 75శాతం దాటితే బస్సులతో పాటు సిబ్బందినీ పెంచాలి. కానీ ఆర్టీసీ మాత్రం ఆ విషయం పట్టించుకోవడం లేదు. ఫలితంగా డ్యూటీ చేస్తున్న సిబ్బందిపై భారం పెరుగుతోంది.

మూడు వేల బస్సులు.. పది వేల మంది సిబ్బంది ఉండాలి: ఈయూ

స్త్రీ శక్తి పథకం ఎలాంటి ఇబ్బంది లేకుండా అమలు చేయాలంటే ఆర్టీసీకి మూడు వేల బస్సులు, పది వేల మంది అవసరమని ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు పలిశెట్టి దామోదర్‌ రావు అన్నారు. మహిళలకు ఉచిత ప్రయాణం అమలయ్యాక సరాసరి రోజుకు పాతిక లక్షల మంది ప్రయాణికులు పెరిగారని, అదే సమయంలో బస్సులు, సిబ్బంది తగ్గి పోవడంతో ఉన్న సిబ్బంది నరక యాతన అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ వైపు ప్రయాణికుల దాడులు, మరోవైపు పని ఒత్తిడితో ఆరోగ్య సమస్యలు, మధ్యలో తనిఖీ సిబ్బంది రాసే కేసులతో ఆర్టీసీ సిబ్బంది డ్యూటీలు చేయలేక ప్రాణాలు సైతం కోల్పోతున్నారని వివరించారు. ప్రభుత్వం ఆర్టీసీకి బస్సులు కొనిచ్చి సిబ్బందిని పెంచితే స్త్రీ శక్తిలో మెరుగైన సేవలంది, ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని పలిశెట్టి దామోదర్‌ రావు అభిప్రాయపడ్డారు.

3.jpg5.jpg


రోడ్డెక్కితే తంటాలే..

‘ఈ సీటు మహిళల కోసం’... ‘ప్రయాణికుడు చెయ్యెత్తితే బస్సు ఆపాలి..’ ఇటువంటి కొటేషన్లు ఆర్టీసీ బస్సుల్లో కనిపిస్తుంటాయి. అయితే, ఆర్టీసీలో ఇప్పుడు ఆ రెండూ కరువయ్యాయి. ఏ సమయంలో బస్సులో ప్రయాణం చేయాలన్నా మహిళలకు సీటు దొరకడం దాదాపు కష్టమే. చాలా మార్గాల్లో బస్సు మొదటి పాయింట్లోనే సీట్లు ఫుల్‌ అవుతున్నాయి. విజయవాడ బస్టాండ్‌లో స్త్రీ శక్తి బస్సు ప్లాట్‌ఫామ్‌పైకి రావడమే ఆలస్యం, పరుగు పరుగున ఎదురెళ్లి సీట్ల కోసం కిటికీల్లో నుంచి బ్యాగులు వేస్తున్నారు. ఇంత రద్దీగా ఉన్న బస్సులో టికెట్లు (జీరో) జారీ చేయడం కండక్టర్లకు పెద్ద ప్రయాసే అవుతోంది. ఆ తర్వాతి స్టేషన్‌ నుంచి బస్సు ఆపడం కష్టంగా ఉంది. ఎక్కడ చెయ్యెత్తినా బస్సు ఆపాలన్న నిబంధన పక్కకు పోతోంది. దీంతో మహిళా ప్రయాణికులు రోడ్డుకు అడ్డంగా నిల్చుని డ్రైవర్లను నిలదీస్తున్న దృశ్యాలు తరచూ కనిపిస్తున్నాయి.

8.jpg7.jpg10.jpg

Updated Date - May 13 , 2026 | 05:04 AM