46 లక్షల రైతుల ఖాతాల్లో 3 వేల కోట్లు జమ
ABN , Publish Date - Oct 31 , 2026 | 03:21 AM
రాష్ట్రంలో రైతులకు అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్ నిధులు శుక్రవారం విడుదలయ్యాయి. ఈ ఏడాది రెండో విడత పీఎం కిసాన్ కింద రూ. 2 వేలు, అన్నదాత సుఖీభవ కింద రూ. 5 వేలు చొప్పున..
అన్నదాత సుఖీభవ-పీఎం
కిసాన్ నిధులు విడుదల
ఇప్పటి వరకు 15 వేల కోట్లు
ఇచ్చాం: మంత్రి అచ్చెన్న
అమరావతి, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రైతులకు అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్ నిధులు శుక్రవారం విడుదలయ్యాయి. ఈ ఏడాది రెండో విడత పీఎం కిసాన్ కింద రూ. 2 వేలు, అన్నదాత సుఖీభవ కింద రూ. 5 వేలు చొప్పున ఒక్కో రైతుకు రూ. 7 వేలు చొప్పున బ్యాంకు ఖాతాలో జమ అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 46,85,838 మంది రైతులకు రూ. 3,125.47 కోట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించాయి. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ నిధులు రూ. 2,342.92 కోట్లు ఉండగా, కేంద్ర వాటా రూ. 782.55 కోట్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
రాష్ట్రంలో 45,69,817 మంది భూ యజమానులు, 1,16,021 మంది అటవీ భూ హక్కుదారులు ఉన్నారు. పీఎం కిసాన్ నిధులను గుజరాత్లోని బనష్కాంతలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ విడుదల చేయగా, అన్నదాత సుఖీభవ నిధులను స్థానిక ఎన్నికల కోడ్ కారణంగా రాష్ట్రప్రభుత్వం డీబీటీ పద్ధతిలో నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసింది. రైతు కుటుంబాలకు ఏటా రూ. 20 వేలు సాయం చేస్తామని సీఎం చంద్రబాబు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కేంద్ర నిధులు రూ. 6 వేలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం రూ. 14 వేలను చెల్లిస్తోంది.
ఏటా మొదటి రెండు విడతలు రాష్ట్ర ప్రభుత్వం రూ. 5 వేలు చొప్పున, మూడో విడత రూ. 4 వేలు ఇస్తుండగా, కేంద్రం రూ. 2 వేలు చొప్పున మూడు విడతలుగా ఇస్తోంది. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీని నిలబెట్టుకుంటూ, ఖరీఫ్ ప్రారంభంలో రూ. 7 వేలు, రబీ ప్రారంభంలో రూ. 7 వేలు, వేసవిలో రూ. 6 వేలు చొప్పున రైతు కుటుంబాలకు సాయం చేస్తున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. 2025-26లో రూ. 8,985.41 కోట్లు, 2026-27లో తొలివిడత రూ. 3,125.47 కోట్లు, రెండో విడత రూ. 3,125.47 కోట్లుతో కలిపి, ఈ పథకం కింద ఇప్పటి వరకు రూ. 15,236.35 కోట్లు రైతులకు అందించినట్లు అచ్చెన్న వివరించారు.
ఈ వార్తలనూ చదవండి:
ఎల్ నినో వెళ్లిపోయాక.. వర్షాలే వర్షాలు?