Share News

ఖాకీలకే కరువైన రక్షణ!

ABN , Publish Date - Nov 17 , 2026 | 03:58 AM

ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణగా నిలిచే పోలీసులకే రక్షణ లేకుండా పోతోంది. మావోయిస్టులను ఎదుర్కోవడంలో, ఉగ్రవాదుల కుట్రలను భగ్నం చేయడంలో, టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ఏపీ పోలీస్‌ సత్తా చాటింది.

ఖాకీలకే కరువైన రక్షణ!
PC1

ఖాకీలకే కరువైన రక్షణ!

పోలీసులకు కొత్త కష్టం.. కత్తి మీద సాములా విధులు

అడ్డుకుంటే రాజకీయ కార్యకర్తలకు కోపం

అరెస్టు చేస్తే, అంతు చూస్తామంటూ బెదిరింపులు

ఇవన్నీ తట్టుకున్నా, చాలా సందర్భాల్లో సస్పెన్షన్లు

జగన్‌, వైసీపీ నేతల పర్యటనలకు పోలీస్‌ బందోబస్తు

రూల్స్‌ పాటించాలన్న పోలీసులపై వైసీపీ వీరంగం

గుంటూరు ఘటనలో ఎస్‌ఐకి గాయాలు

సీదిరి ‘ములాఖత్‌’లో మహిళా ఎస్‌ఐపై దౌర్జన్యం

కోడ్‌ ప్రకారం రజనీని అడ్డుకున్న మహిళా ఎస్సైపై వేటు

అంతర్గత గ్రూపుల్లో పోలీసుల ఆవేదన

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణగా నిలిచే పోలీసులకే రక్షణ లేకుండా పోతోంది. మావోయిస్టులను ఎదుర్కోవడంలో, ఉగ్రవాదుల కుట్రలను భగ్నం చేయడంలో, టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ఏపీ పోలీస్‌ సత్తా చాటింది. అలాంటి ఖాకీలకు ఇప్పుడు కొత్త కష్టం వచ్చిపడింది. అడ్డుకుంటే కార్యకర్తలు రెచ్చి పోతున్నారు.. అరెస్టు చేస్తే, తాము మళ్లీ అధికారంలోకి వస్తే పోలీసుల సంగతి తేలుస్తానంటూ మాజీ ముఖ్యమంత్రి బెదిరిస్తున్నారు.. ఇవన్నీ తట్టుకుని నిలబడినా కొన్ని సందర్భాల్లో సస్పెన్షన్‌ వేటు పడుతోందని పోలీసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జరిగిన పలు ఘటనల్ని ప్రస్తావిస్తూ అంతర్గత గ్రూపుల్లో వాపోతున్నారు. జగన్‌ శ్రీకాకుళంలో మాజీ మంత్రి అప్పలరాజు ములాఖత్‌కు వెళ్లినప్పుడు, అక్కడి బీభత్సాన్ని అడ్డుకోబోయిన మహిళా ఎస్‌ఐపై వైసీపీ మూకలు నానా యాగీ చేశాయి. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా మాజీ మంత్రి విడదల రజనీని చిలకలూరిపేటలో అడ్డుకున్న మహిళా ఎస్‌ఐ తప్పిదం లేదని స్పష్టంగా వీడియోలో కనిపిస్తున్నా, సస్పెండ్‌ చేశారు. రెండు రోజుల క్రితం శ్రీకాకుళంలో ఎన్నికల విధుల్లో ఉన్న పోలీసులపైకి బీజేపీ నాయకుడు కారుతో దూసుకొచ్చారు. అడ్డుకున్నా వినకుండా, బారికేడ్లపైకి ఎక్కించి పోలీసు అధికారి ప్రాణాల మీదికి తెచ్చాడు. బారికేడ్‌ కింద పడి గాయాల పాలైన ఆయనను సహచర పోలీసులు రక్షించి ఆస్పత్రికి తరలించారు. తాజాగా వైసీపీ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గుంటూరు జైలులో ఉన్న లేళ్ల అప్పిరెడ్డిని పరామర్శించేందుకు వెళ్లినప్పుడు వైసీపీ మూకలు రెచ్చిపోయాయి. అడ్డుకున్న ఎస్‌ఐ రామాంజినేయులుపైకి దూసుకొచ్చి తీవ్రంగా గాయపరిచాయి. రక్తంతో తడిచిన యూనిఫారంతో ఎస్‌ఐను ఆస్పత్రికి తరలిస్తున్న వీడియోలను పోలీసులు తమ అంతర్గత వాట్సాప్‌ గ్రూపుల్లో పోస్టు చేశారు. ’మనకే రక్షణ లేకపోతే ప్రజలకు ఏం భరోసా ఇస్తాం’ అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు. పార్టీల నుంచి వస్తున్న ముప్పును ప్రభుత్వ పెద్దలు, ఆయా పార్టీల అధ్యక్షులు, పోలీసు ఉన్నతాధికారులే పరిష్కరించాలని పోలీసులు కోరుతున్నారు. లేదంటే శాంతి భద్రతలు అదుపులో ఉంచడం కష్టమని తేల్చేస్తున్నట్టు సమాచారం.


PC2.jpgరజనీని అడ్డుకున్నందుకు..

చిలకలూరి పేటలో గత నెల 23న, స్థానిక పట్టణ సంస్థలకు ఎన్నికల సందర్భంగా.. మాజీ మంత్రి విడదల రజనిని ఇంట్లో నుంచి బయటకు రాకుండా మహిళా ఎస్‌ఐ అడ్డుకున్నారు. వాగ్వాదానికి దిగిన రజనీ బయటికి వచ్చేందుకు ప్రయత్నించగా మహిళా ఎస్‌ఐ అడ్డుకునే క్రమంలో జరిగిన తోపులాటలో ఆమె ఇంట్లో పూల మొక్కల కోసం నిర్మించుకున్న చిన్న గోడ కాలికి తగిలి పట్టు తప్పి కింద పడ్డారు. వైసీపీ నేతలు రాద్ధాంతం చేయడంతో మహిళా ఎస్‌ఐపై సస్పెన్షన్‌ వేటు పడింది. మాజీ మంత్రి రజనిని ’మేడమ్‌.. ప్లీజ్‌..’ అంటూ బతిమాలుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఉద్యోగం చేసిన మహిళా ఎస్‌ఐపై సస్పెన్షన్‌ వేటు వేశారు.. అడ్డుకోకుండా ఆ నాయకురాలిని వదిలేసి ఉంటే, శాంతి భద్రతల సమస్య వచ్చి ఉంటే కూడా ఎస్‌ఐపై చర్యలు తప్పేవి కావు. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించిన మాజీ మంత్రిపై మాత్రం ఎలాంటి చర్యల్లేవు. ‘ఇలాగైతే ఉద్యోగాలు ఎలా చేయగలం’ అంటూ ఈ ఘటన పోలీసుల్లో చర్చకు దారి తీసింది.

మహిళా ఎస్‌ఐపై దౌర్జన్యం..

గొర్రెల కాపరిని బైకుతో ఢీ కొట్టి ప్రాణాలు పోవడానికి కారణమైన కుమారుడిని రక్షించుకునే క్రమంలో అరెస్టై జైల్లో ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పరామర్శించేందుకు జగన్‌ జూలై 30న శ్రీకాకుళం వెళ్లారు. బల ప్రదర్శన ర్యాలీలకు అనుమతి లేదంటూ పోలీసులు స్పష్టంగా చెప్పారు. అయినా సరే, ఆమదాలవలస వైసీపీ ఇంచార్జి చింతాడ రవికుమార్‌ ఆంక్షలు ఉల్లంఘించి వైసీపీ కేడర్‌తో నానా బీభత్సం సృష్టించారు. జైలు సమీపంలో బారికేడ్లను తోసుకుంటూ ముందుకు వచ్చేందుకు ప్రయత్నించిన వైసీపీ మూకల్ని బూర్జ పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌ఐ ప్రవల్లిక అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆ మూకలు ఆమెను చుట్టుముట్టి మీద చేతులేసి దుర్బాషలాడు తూ, దాడి చేసినంత పని చేశాయి. ఆమెను రక్షించబోయిన సీఐ సన్యాసి నాయుడును సైతం వైసీపీ శ్రేణులు నెట్టేశాయి.


సజ్జల, పెద్దిరెడ్డి సాక్షిగా దౌర్జన్యం..

ఇటీవల గుంటూరు రూరల్‌ మండలం వెంగళాయపాలెంలో ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించి ఆందోళనకు దిగిన వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డిని పోలీసులు అరెస్టు చేసి గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. ఆయనను పరామర్శించేందుకు వైసీపీ కీలక నేతలు సజ్జల, పెద్దిరెడ్డి సోమవారం గుంటూరు జైలు వద్దకు వెళ్లారు. అదే సమయంలో వైసీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకుని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. సజ్జల, పెద్దిరెడ్డికి తప్ప ఇతరులకు అనుమతి లేదంటూ పోలీసులు వారిని అడ్డుకున్నారు. అయినా లెక్క చేయకుండా దూసుకొచ్చిన వైసీపీ మూకల్ని అడ్డుకునే క్రమంలో పట్టాభిపురం ఎస్‌ఐ రామాంజినేయులు గాయపడ్డారు. నడవలేని స్థితిలో ఉన్న ఆయనను సహచర పోలీసులు ఆస్పత్రికి తరలించే వీడియో పోలీసు అంతర్గత గ్రూపుల్లో వైరల్‌ అవుతోంది. ఎస్‌ఐ యూనిఫారంపై ఉన్న రక్తపు చుక్కలపై పలువురు పోలీసులు తీవ్రంగా స్పందిస్తున్నారు. ‘జైలు ములాఖత్‌ల బందోబస్తులో కూడా మనం రక్తం చిందించి ఆసుపత్రి పాలవ్వాలా.. ఏంటీ పరిస్థితి’ అంటూ వాపోతున్నారు.

పోలీసులపైకి కారు నడిపిన బీజేపీ నేత..

శ్రీకాకుళం జిల్లాలో రెండు రోజుల క్రితం ఎన్నికల నామినేషన్‌ కేంద్రం వద్ద పోలీసులు బారికేడ్లు అడ్డుపెట్టి వాహనా లు అడ్డుకున్నారు. అక్కడికి కారులో వెళ్లిన ఆ జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు చల్లా వెంకటేశ్వర రావు బారికేడ్లు అడ్డు తీయాలంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ’కారు ఇక్కడే పెట్టి మీరు నడుచుకొంటూ లోపలికి రండి’ అని పోలీసులు చెప్పారు. ‘నన్నే అడ్డుకుంటారా.? అంటూ బారికేడ్లను ఢీ కొట్టి కారుతో లోపలికి వెళ్లబోయారు. అడ్డుకోబోయిన పోలీసు అధికారిపై బారికేడ్లు పడి గాయాలయ్యాయి.

ఇవి కూడా చదవండి..

స్థానిక సంస్థల రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

భారత్‌లో ఓ భిన్నమైన దృశ్యం కనిపించింది: ప్రిన్స్ విలియమ్

Updated Date - Nov 17 , 2026 | 04:04 AM