శ్రీహరికోట సమీపాన అంతరిక్ష నగరం
ABN , Publish Date - Nov 17 , 2026 | 03:50 AM
భారత అంతరిక్ష చరిత్రలో ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటకు ప్రత్యేక స్థానం ఉంది.
రూ.25 వేల కోట్ల భారీ పెట్టుబడులే లక్ష్యం.. కార్యాచరణ సిద్ధం చేసిన రాష్ట్ర ప్రభుత్వం
ఆస్ట్రోబేస్, బెల్లాట్రిక్స్, అగ్నికుల్, హాథోర్ సంస్థలతో సీఐఐ సదస్సులో ఒప్పందాలు
శ్రీహరికోట, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): భారత అంతరిక్ష చరిత్రలో ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటకు ప్రత్యేక స్థానం ఉంది. ఇస్రో (భారత అంతరిక్ష పరిశోధన సంస్థ) చేపట్టిన అనేక ప్రతిష్ఠాత్మక ప్రయోగాలకు తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ వేదికైంది. ఇప్పుడు రాష్ట్ర కీర్తిని మరింత ఇనుమడింపజేసేలా శ్రీహరికోట సమీపంలో రూ.25,000 కోట్ల భారీ పెట్టుబడుల లక్ష్యంతో అంతరిక్ష నగరం (స్పేస్ సిటీ) అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. ఈ ప్రాంతంలో ప్రైవేటు అంతరిక్ష స్టార్ట్‌పలు, సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు.. రాకెట్ ఇంజన్లు, ప్రొపల్షన్ సిస్టమ్, పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. శ్రీహరికోటకు 40 కిలోమీటర్ల దూరంలోని రౌతుసురమాల, శ్రీసత్యసాయి జిల్లాలోని తిమ్మసముద్రం, అనంతపురంలోని లేపాక్షిలో అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించిన భారీ పరిశ్రమలు రానున్నాయి. ఇప్పటికే వీటికి సంబంధించి సన్నాహాలు చురుగ్గా సాగుతున్నాయి.
1,800 కోట్ల విలువైన ఒప్పందాలు
శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం సమీపంలో స్పేస్ పార్కు ఏర్పాటు చేయాలనే ప్రయత్నాలు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు కేంద్ర మంత్రిగా ఉన్నప్పటి నుంచే ఈ ప్రతిపాదనలు ఉన్నా అవి కార్యరూపం దాల్చలేదు. అప్పట్లో శ్రీసిటీలో దీన్ని ఏర్పాటు చేయాలని భావించినా అడుగు ముందుకు పడలేదు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిపై మరింత దృష్టి పెట్టింది. ఇటీవల విశాఖపట్నంలో జరిగిన 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సులో రాకెట్ ఇంజన్ల తయారీ, పరీక్ష కేంద్రాలు, ప్రొపల్షన్ పరిశోధన వంటి రంగాల్లో రూ.1,800 కోట్ల విలువైన ఒప్పందాలపై రాష్ట్ర ప్రభుత్వం సంతకాలు చేసింది. ఒప్పందం చేసుకున్న సంస్థల్లో ఆస్ర్టోబేస్ స్పేస్ టెక్నాలజీస్, బెల్లాట్రిక్స్ ఏరోస్పేస్, అగ్నికుల్ కాస్మోస్, హాథోర్ రాకెట్స్ తదితర పరిశ్రమలు ఉన్నాయి. ఈ ఏడాది ప్రథమార్థంలో స్పేస్ టెక్ స్టార్టప్ పిక్సెల్ సహ వ్యవస్థాపకుడు క్షితిజ్ ఖండేల్వాల్ కర్ణాటకలో వారి యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తే అక్కడ భూమి దొరకలేదు. ఈ నేపథ్యంలో మంత్రి లోకేశ్ వారిని ఇక్కడకు ఆహ్వానించడంతో వారు పరిశ్రమ నెలకొల్పేందుకు ముందుకొచ్చారు.
సంస్థ పేరు పెట్టుబడి ఎక్కడ, ఎన్ని ఎకరాలు ఉద్యోగాలు
ఆస్ట్రోబేస్ స్పేస్ టెక్నాలజీస్ రూ.800 కోట్లు శ్రీసత్యసాయి జిల్లా తిమ్మసముద్రంలో 339 ఎకరాల్లో రాకెట్ ఇంజన్ల పరీక్ష కేంద్రం 500
బెల్లాట్రిక్స్ ఏరోస్పేస్ రూ.550 కోట్లు శ్రీసత్యసాయి జిల్లా లేపాక్షిలో 120 ఎకరాల్లో ఉపగ్రహాలు, ప్రొపల్షన్ పరిశోధన కేంద్రం 565
అగ్నికుల్ కాస్మోస్ రూ.510 కోట్లు తిరుపతి స్పేస్‌సిటీలో పునర్వినియోగ రాకెట్లు, ఆర్బిటల్ డేటా సెంటర్ల తయారీ యూనిట్
స్కైరూట్ ఏరోస్పేస్ రూ.400 కోట్లు తిరుపతి స్పేస్‌సిటీలో సుమారు 295 ఎకరాల్లో రాకెట్ తయారీ, అసెంబ్లింగ్ యూనిట్
హాథోర్ రాకెట్స్ రూ.250 కోట్లు తిరుపతి జిల్లా రౌతుసురమాల వద్ద 100 ఎకరాల్లో లిక్విడ్ రాకెట్ ఇంజన్ల తయారీ, పరీక్షా కేంద్రం 200
ఇవి కూడా చదవండి..
స్థానిక సంస్థల రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
భారత్‌లో ఓ భిన్నమైన దృశ్యం కనిపించింది: ప్రిన్స్ విలియమ్